Adilabad | ఆదిలాబాద్ గడ్డపై పంతుళ్ళ ఫైట్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల నుండి ఒకే సామాజికవర్గానికి చెందిన ఒకే వృత్తి నిర్వహించిన అభ్యర్ధులు తలపడుతున్నారు

  • Publish Date - April 15, 2024 / 05:55 PM IST

రాజీనామా చేసి రాజకీయబాట
గతంలో ముగ్గురూ ఉపాధ్యాయులు
ఆదివాసీలకే అన్ని పార్టీల ఛాన్సు
పోటీపడుతున్న తొలి మహిళ సుగుణ
ఒకే సామాజికవర్గం.. ఒకే వృత్తి

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల నుండి ఒకే సామాజికవర్గానికి చెందిన ఒకే వృత్తి నిర్వహించిన అభ్యర్ధులు తలపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప-క్షాల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్ధులు ముగ్గురూ ఆదివాసీ గోండు సామాజికవర్గానికి చెందినవారు. పోటీలో నిలిచిన ఈ ముగ్గురు ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన అభ్యర్థులు కావడం గమనార్హం.ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్ధి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తొలి మహిళకావడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

పంతుల ఫైట్ ఆదిలాబాద్ అడ్డా

ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఆత్రం సుగుణ, బీజేపీ నుండి గొడం నగేష్, బీఆరెస్ నుండి ఆత్రం సక్కు తాజా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశారు. స్చచ్చందంగా తమ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినవారు. తమకు ఆయా పార్టీల నుంచి రాజకీయ అవకాశాలు లభించినపుడు వీరు తమ టీచర్ ఉద్యోగాన్ని వీడి తమకు నచ్చిన పార్టీ నుంచి పోటీలో నిలిచారు.

బీజేపీ నుండి బరిలోకి దిగిన గోడం నగేష్ గతంలో ఎమ్మెల్యే, ఎంపిగా గెలవడమే కాకుండా మంత్రిగా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ మొన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీ లో ఉండి తాజాగా బీజేపీలో చేరి ఎంపి టిక్కెట్ తెచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని జాతర్ల గ్రామానికి చెందిన నగేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 1994లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారి తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2014లో బీఆరెస్ లో చేరి ఆ పార్టీ తరఫున ఆదిలాబాద్ ఎంపి గా పోటీ చేసి గెలుపొందారు. నగేష్ తండ్రి రామారావు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. గతంలో ఆయన కూడా ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లో వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ హాయాంలో మంత్రి పదవిని చేపట్టారు. ఒక విధంగా నగేష్ ది రాజకీయ కుటుంబంగా చెప్పవచ్చు.

బీఆరెస్ అభ్యర్థి ఆత్రం సక్కు గతంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. తాజాఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1993 నుండి 2008 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన సక్కు స్వచ్చందంగా ఉద్యోగ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2018లో మరోసారి కాంగ్రేస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందినప్పటికి తర్వాత బీఆరెస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి బీఆరెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్టు కోవా లక్ష్మికి ఇచ్చిన సందర్భంలో ఆ పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల బరిలో ఆత్రం సక్కును నిలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మాత్రం తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. 2008 నుండి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా సుగుణ పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా ఉపాధ్యాయుడు. సుగుణ తాజాగా స్వచ్చంద ఉద్యోగ విరమణ పొంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్ సభ అభ్యర్థిగా ఆ పార్టీ టిక్కెట్టును దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నప్పటికి ఆ పార్టీ అధిష్టానం మాత్రం ఎంపీ టికెట్ సుగుణను ఎంపిక చేసింది. రాజకీయంగా ఇది ఆమె తొలి ప్రయత్నం. ఆత్రం సుగుణ ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న మొదటి మహిళా అభ్యర్థి కావడం విశేషం.

ఇదిలా ఉండగా బీజేపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపిగా ఉన్న సోయం బాపురావు , బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు సైతం గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు కావడం మరింత ఆసక్తికరమైన అంశం. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన వారు ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రాణిస్తుండటం విశేషం చెప్పవచ్చు.

Latest News