జయపజయాల లెక్కల్లో అభ్యర్థులు.. పార్టీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో పోటీ చేసిన అభ్యర్థులు ఇక తమ గెలుపు ఓటముల సాధ్యాసాధ్యాలపై కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు

  • Publish Date - November 30, 2023 / 11:41 AM IST

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో పోటీ చేసిన అభ్యర్థులు ఇక తమ గెలుపు ఓటముల సాధ్యాసాధ్యాలపై కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. పార్టీకి సంబంధించిన సర్వే సంస్థలతో పాటు తమ అనుచర వర్గాల ద్వారా పోలింగ్ కేంద్రాల వారిగా తమకు ఎన్ని ఓట్లు పడ్డాయి..ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న లెక్కలు తీసుకుంటు తమ గెలుపు అవకాశాలను అంచనా వేసుకుంటున్నారు.


వివిధ సర్వే సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తమ నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్ సరళి తీరు తెన్నులను పోల్చుకుంటూ విజయవకాశాల లెక్కల కసరత్తు సాగిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆరెస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ద్విముఖ పోటీ ఉన్న నియోజకవర్గాలతో పాటు బీజేపీ బలంగా ఉన్న సీట్లలో, ఆ పార్టీతో త్రిముఖ నెలకొన్న పోటీ సీట్లలో విజయవకాశాలను అంచనా వేయడంలో ఆయా పార్టీలు, అభ్యర్థులు అనుచరుల ద్వారా గ్రామాలు, పోలింగ్ కేంద్రాల వారిగా పోలైన ఓట్లు..తమకు పడే ఓట్ల సంఖ్యను విశ్లేషించుకుంటున్నారు.


స్వతంత్ర అభ్యర్థులకు పడే ఓట్లను సైతం పరిగణిలోకి తీసుకుంటూ తమ గెలుపు ఓటములను లెక్కలేసుకుంటున్నారు. అలాగే అధికార బీఆరెస్ పార్టీ అభ్యర్థులకు కారును పోలి వున్న గుర్తులతో ఎంత వరకు నష్టం జరిగిందన్న అంచనాలు కూడా వేస్తున్నారు. తమతమ పార్టీల ఎన్నికల హామీల ప్రభావం…సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు ఎంతమేరకు తమకు ఓటింగ్ శాతాన్ని తెచ్చిపెట్టాయి.. ఓటర్లకు నేరుగా పంచిన డబ్బుల ప్రభావం ఎంత అన్న దానిపై కూడా అభ్యర్థులు కూడికలు తీసివేతలు సాగిస్తున్నారు.


క్రాస్ ఓటింగ్‌..ఓట్ల బదిలీపై మల్లగుల్లలు


ముఖ్యంగా తమ పార్టీ నుంచి ఇతర పార్టీలకు, ఇతర పార్టీల, అభ్యర్థుల నుంచి తమకు పడిన క్రాస్ ఓటింగ్ ఎంత మేరకు తమకు కలిసొస్తుందన్న లెక్కలు కూడా సేకరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ మిత్ర పక్షమైన సీపీఐ, టీజేఎస్‌ల నుంచి ఎంత మేరకు తమకు ఓటు బదిలీ జరిగిందన్న లెక్కలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో కీలకంగా మారాయి. సీపీఐ బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ సహా 20సీట్లలో తమకు ఎంత మేరకు ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ అభ్యర్థులు లెక్కల కుస్తీ సాగిస్తున్నారు.


ఇంకోవైపు బీజేపీ, జనసేనల మధ్య ఓటు బదిలీపై ఆ పార్టీ నేతలు కూడా విశ్లేషణ చేసుకుంటున్నారు. అదిగాక పోలింగ్ రోజు ఎలాగు తాము ఓడిపోతామన్న భావనతో పలు నియోజకవర్గాల బీజేపీ, బీఎస్పీ, సీపీఎంల అభ్యర్థులు ప్రధాన పార్టీలైన బీఆరెస్‌, కాంగ్రెస్ అభ్యర్థులకు లోపాయి సహకారంతో జరిపించిన క్రాస్ ఓటింగ్ ప్రభావం ఎంత వరకు గెలుపు సాధనకు దోహదం చేస్తుందన్న లెక్కలు కూడా అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నాయి.


కీలకంగా మారిన ఖమ్మం..నల్లగొండ, మహబూబ్‌నగర్‌లు


ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని నియోజకవర్గాలు ఈ ఎన్నికలో పార్టీల మెజార్టీని డిసైడ్ చేస్తాయన్న అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో గురువారం జరిగిన పోలింగ్‌లో ఓటింగ్ సరళిపై లెక్కలు జోరందుకున్నాయి. పైకి ఆ సీట్లలో కాంగ్రెస్‌కు మెజార్టీ సీట్లు ఖాయమన్న ప్రచారం జరిగినప్పటికి పోలింగ్‌లో మౌత్ టాక్ ప్రభావం ఎంత మేరకు ఓట్లుగా మారిందన్న దానిని తేల్చుకునేందుకు పోలింగ్ కేంద్రాల వారిగా ఓటింగ్ సరళిని అంచనా కడుతున్నారు.