వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ
విధాత, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాలకు పదును పెడుతున్నది. బీసీ, మైనారిటీ వర్గాలను దగ్గరకు చేర్చుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నది. శనివారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో కుల గణనకు రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించనుండడంతో బీసీ వర్గాలు కాంగ్రెస్ కు మరింత దగ్గర కానున్నారు. ప్రస్తుత కేబినెట్ లో మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే నెలలో మొత్తం భర్తీ చేస్తారా ముగ్గురితో కానిచ్చేస్తారా అనేది త్వరలో వెల్లడి అవుతుంది.
ప్రస్తుత కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్గ ఉన్నారు. ఆయన విద్యుత్ తో పాటు ఆర్థిక శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన మాల కులానికి సంబంధించిన నాయకుడు. షెడ్యూల్డు కులాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వం మల్లు విక్రమార్కకు డిప్యూటీ సీఎంను కట్టబెట్టింది. అయితే బీసీలను, మైనారిటీలను మరింత దగ్గరకు చేర్చుకునేందుకు మరో డిప్యూటీ సీఎం ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందని సమాచారం. మొన్న జరిగిన ఎన్నికల్లో కొందరు బీసీలు బీఆరెస్ తో పాటు బీజేపీకి కూడా జై కొట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించడంతో ఆకర్షితులయ్యారు. ఎస్సీ వర్గీకరణ చేసి ఏ, బి, సి, డి గా విభజిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఇప్పటికే ఎస్సీ కులానికి చెందిన మల్లు విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇచ్చినందున, బీసీల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు చర్యలు చేపట్టింది. బీసీలకు ఇవ్వని పక్షంలో మైనారిటీలకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎం.కోదండరామ్ రెడ్డి, అమేర్ అలీఖాన్ లకు కేబినెట్ లో బెర్త్ లభిస్తుందని అంటున్నారు. మైనారిటీ నుంచి ఎవరూ లేకపోవడం కూడా అమేర్ కు కలిసివచ్చే అవకాశం ఉంది. కోదండరామ్ రెడ్డికి విద్యా శాఖను అప్పగించి పూర్తి ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అమేర్ కు డిప్యూటీ సీఎం లేదా మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలను తోసిపుచ్చలేము. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్, నిజామాబాద్ నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ ఓటమి పాలు కావడం అమేర్ కు కలిసి వచ్చిందనే చెప్పాలి. కోదండరామ్, అమేర్ తో పాటు మరొకరికి ప్రాతినిధ్యం కల్పిస్తారా, ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు భర్తీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. బీసీ లేదా మైనారిటీ డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్, బీజేపీలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉండగా అందులో కనీసం 12 సీట్లను గెలిపించి అధినేత్రి సోనియా గాంధీకి బహుమానంగా ఇవ్వాలనే ధృడసంకల్పంతో తెలంగాణ కాంగ్రెస్ ఉంది.