Telangana | అక్టోబ‌ర్‌ రెండో వారంలో.. ఎలక్షన్‌ షెడ్యూల్?

Telangana అసెంబ్లీ ఎన్నిక‌ల క‌స‌రత్తులో వేగం మూడున రానున్న సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటన విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేస్తున్నది. అక్టోబర్‌ రెండోవారంలో షెడ్యూల్‌ విడుదల చేయనున్నారని తెలుస్తున్నది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వహణకు ఏర్పాట్ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిత్యం పర్యవేక్షిస్తున్నది. ఇప్ప‌టికే అన్ని జిల్లాల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్ల‌ను పూర్తి చేసిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కేంద్ర క‌మిష‌న్‌కు ఇప్పటికే తెలియజేసింది. దీంతో […]

  • Publish Date - September 20, 2023 / 08:10 AM IST

Telangana

  • అసెంబ్లీ ఎన్నిక‌ల క‌స‌రత్తులో వేగం
  • మూడున రానున్న సీఈసీ బృందం
  • మూడు రోజుల పాటు పర్యటన

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేస్తున్నది. అక్టోబర్‌ రెండోవారంలో షెడ్యూల్‌ విడుదల చేయనున్నారని తెలుస్తున్నది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వహణకు ఏర్పాట్ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిత్యం పర్యవేక్షిస్తున్నది. ఇప్ప‌టికే అన్ని జిల్లాల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్ల‌ను పూర్తి చేసిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కేంద్ర క‌మిష‌న్‌కు ఇప్పటికే తెలియజేసింది.

దీంతో షెడ్యూల్ విడుద‌ల‌కు ముందు ఒక‌సారి వ‌చ్చి రాష్ట్ర ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ యంత్రాంగంతో స‌మీక్ష నిర్వ‌హించ‌డానికి కేంద్రం ఎన్నిక‌ల సంఘానికి చెందిన ఉన్న‌తాధికారుల బృందం అక్టోబ‌ర్ 3వ తేదీన హైద‌రాబాద్ కు రానున్న‌ది.

ఈ బృందం రాష్ట్రంలో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ప‌ర్య‌టించి స‌మావేశాలు నిర్వ‌హించి తిరిగి వెళుతుంది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏ మేర‌కు సంసిద్ధత ఉన్నదో నిర్ధారణకు వ‌చ్చిన త‌రువాత కేంద్ర ఎన్నిక‌ల సంఘం అసెంబ్లీ ఎన్నిక‌ల‌ షెడ్యూల్ విడుద‌ల చేస్తుందని చెబుతున్నారు.

డిసెంబర్‌ 13 నాటికి కొత్త ప్రభుత్వం

ఈ ఏడాది డిసెంబ‌ర్‌ 13వ తేదీ నాటికి రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది. 2018 డిసెంబ‌ర్‌ 7న జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆరెస్‌ గెలుపొందిన త‌రువాత 13వ తేదీన ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌, మ‌రో మంత్రిగా మ‌హ‌మూద్ అలీ ప్ర‌మాణం స్వీకరించారు. ఆనాడు కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది.

తిరిగి ఈ ఏడాది డిసెంబ‌ర్ 13వ తేదీ నాటికి ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేసి కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ అవ‌కాశం క‌ల్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న కార్య‌క్ర‌మాల‌ను వేగం చేసింది.

అక్టోబ‌ర్‌3న రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం

రాష్ట్రంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం బృందం అక్టోబ‌ర్ 3వ తేదీన హైద‌రాబాద్‌కు వ‌స్తుంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తుంది. మొద‌టి రోజున గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీలతో స‌మావేశాన్ని నిర్వ‌హిస్తోంది. అలాగే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ది.

రెండ‌వ రోజున క్షేత్ర స్థాయిలో సంసిద్ద‌త‌పై 33 జిల్లాల ఎన్నిక‌ల అధికారులు, ఎస్‌పీలు, పోలీస్ క‌మిష‌న‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తారు. ఈ మేర‌కు అధికారులు క్షేత్ర స్థాయిలో స‌న్న‌ద్ద‌త‌పై స‌వివ‌ర‌మైన నివేదిక విడుద‌ల చేస్తారు. మూడ‌వ రోజున ఓట‌ర్ల‌ను చైత‌న్య‌ప‌రి చే కార్య‌క‌లాపాల‌పై ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తారు.

అలాగే ఓట‌రు చైత‌న్యంపై ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ప్ర‌ముఖుల‌ను, దివ్యాంగ ఓట‌ర్ల‌ను, యువ ఓట‌ర్ల‌ను కేంద్ర ఎన్నిక‌ల బృందం కలువనున్నది. సీఎస్‌, డీజీపీల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతుంది. ఆ త‌రువాత ఎన్నిక‌ల సంసిద్ద‌త‌పై మీడియాతో మాట్లాడిన త‌రువాత ఈ బృందం ఢిల్లీకి తిరిగి వెళుతుంది.

ఢిల్లీ వెళ్లిన త‌రువాత ఏక్ష‌ణ‌మైనా షెడ్యూల్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంటుంది. 2018లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం అక్టోబ‌ర్‌ 6న షెడ్యూల్ విడుద‌ల చేయ‌గా, డిసెంబ‌ర్ 7న ఎన్నిక‌లు నిర్వ‌హించింది. ఈ ఏడాది కూడా ఒక‌టి రెండు రోజులు అటూఇటూగా ఎన్నిక‌ల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని సమాచారం.