అంతుచిక్కని ‘ఆఖరి అస్త్ర‌ప్రయోగం’

తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోరిప్పితే ఆఖరి బాల్ మన కోర్టులోనే ఉందంటూ పదేపదే చెప్పేవారు. కానీ, ఆఖరికి.. ఆఖరి బాల్ కాస్తా చేజారి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది

  • Publish Date - November 30, 2023 / 12:38 PM IST
  • బీఆర్ఎస్, బీజేపీ పరస్పర సహకారం?
  • కాంగ్రెస్ లక్ష్యంగా కదిపిన పావులు
  • బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు విస్మయం
  • ఆసక్తికరంగా మారిన వ్యవహారం
  • రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోరిప్పితే ఆఖరి బాల్ మన కోర్టులోనే ఉందంటూ పదేపదే చెప్పేవారు. కానీ, ఆఖరికి.. ఆఖరి బాల్ కాస్తా చేజారి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సందర్భం వేరుకావచ్చుగానీ, గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ఎన్నికల పోల్ మేనేజ్ మెంట్ ను కళ్ళారా చూసిన వారు… ఆఖరి నిమిషంలో తమ అమ్ములపొదిలోని అద్భుత అస్త్రమైన పోల్ మేనేజ్ మెంట్ ను ప్రయోగించడం ఇప్పుడు అంతుచిక్కని వ్యూహంగా మారింది.


ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికల్లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో ఓటరును ప్రసన్నం చేసుకోవడంలో ఎమ్మెల్యేలు చేతులెత్తేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలంటేనే చివరి రోజు ఎంతో కొంత తమకు పోటీచేసే అభ్యర్థులు అందులో బీఆర్ఎస్ అభ్యర్థులు తప్పకుండా ముట్టచెబుతారని భావించిన ఓటర్లను నిరాశపరచడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓటర్లతో పాటు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. ప


లు సెగ్మెంట్లలో ప్రణాళికాబద్ధంగా జరిగిందా? అనూహ్యంగా జరిగిందా? ఈ హఠాత్ పరిణామాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు పంపకాల కోసం పడిగాపులుగాసిన ఓటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు ఆఖరికి చేతులెత్తేయడం గమనార్హం. ఈ పరిణామంతో పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గులాబీ నాయకుల జాడలేకుండా పోయారు.


ఇదే తీరును కొన్ని సెగ్మెంట్లలో బీజేపీ నాయకులు పాటించడం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ లక్ష్యంగా ఇరువర్గాలు పరస్పరం సహకరించుకుని త్రిముఖ పోటీని ద్విముఖ పోటీగా మార్చి బీఆర్ఎస్, బీజేపీ పరోక్షంగా సహకరించుకుని కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టాలని ప్రయత్నించాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


చేతులెత్తేసిన బీఆర్ఎస్, బీజేపీ


పదేళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీ, అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ములుగు మినహా మిగిలిన 11 స్థానాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇందులో రెండు స్థానాలు జనగామ, స్టేషన్ ఘన్ పూర్ మినహా 9 స్థానాల్లో సిటింగులే సీటు దక్కించుకున్నారు. ఆర్థికంగా, పార్టీపరంగా అన్ని రకాల అండదండలతో పటిష్టమయ్యారనేది ప్రజల్లో నెలకొన్న గట్టి భావన.


ఇలాంటి వాతావరణంలో ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి చివరి రోజు వరకు భారీస్థాయిలో కార్యక్రమాలు, ప్రచారం, హంగూ, ఆర్బాటం, ఆర్థికాధిపత్యాన్ని ప్రదర్శించి, భారీ సభలు నిర్వహించిన బీఆర్ఎస్, బీజేపీ పోటీ అభ్యర్థులు కొన్ని చోట్ల అర్ధంతరంగా చేతులెత్తేయడం చర్చకు దారితీసింది.


తెల్లవారుజాము వరకు జాగారణ


వరంగల్ తూర్పు, ములుగు, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేటతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరించిన తీరు, అభ్యర్థులు అందుబాటులో లేకుండా పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ మారడమే కాకుండా అన్ని వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం వరకు అన్నీ రెడీ అని చెప్పిన నాయకులు ఒక్కసారిగా ఎవరికి అందుబాటులో లేకుండాపోయారు.


దీంతో తెల్లవారే వరకు ఇగవస్తరు, అగవస్తరని భావించిన నాయకులు ఉసూరుమంటూ వెనుదిరగడమే కాకుండా ముఖం చూపెట్టకుండా జారుకున్నారు. ఇక్కడే గమనించాల్సిన విషయమేమిటంటే ఈ పక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాయని, పరోక్షంగా సహకరించుకున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆసక్తికరమైన పరిణామమేమంటే ఒక పార్టీ ఓటరును ప్రసన్నం చేసుకుంటే మరోపార్టీ సైలెన్స్ కావడమే కాకుండా చేతులెత్తేయడంలో రహస్య ఒప్పందాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.


ఆయా సెగ్మెంట్లలో బలాబలాలను బేరీజు వేసుకుని కాంగ్రెస్ పార్టీని నిలువరించడమే లక్ష్యంగా పావులు కదిపినట్లు చెబుతున్నారు. పదేళ్ళు అంతకంటే ఎక్కువ సంవత్సాలు, కొందరు ఐదేళ్ళుగా అధికారంలో ఉన్నారు. వీరంతా ఆర్థికంగా బలమైన నేతలుగా ప్రజల్లో ముద్ర ఉంది. అలాంటి నేతలు అమాయకులుగా కనీసం పోల్ మేనేజ్ మెంట్ అంటేనే తెలువదా? అన్నట్లుగా వ్యవహరించడం ఇక్కడ విశేషం. తమ ఆర్థికవనరులు లేవంటూ కిందిస్థాయి నాయకులకు చెప్పడాన్ని విశ్వసించడంలేదు.


బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న చోట బీజేపీకి, బీజేపీ పట్టులేని చోట్ల బీఆర్ఎస్ కు దోహదం చేసే విధంగా సెట్ బ్యాక్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ లేకుండా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించుకున్నట్లు అనుమానాలు నెలకొన్నాయి.


ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగిందని అంటున్నారు. ఈ కారణంగా చివరి నిమిషంలో కేడర్ ఒత్తిడి మేరకు అక్కడక్కడ కొంత అడ్జెస్ట్ చేయగా మరికొన్ని చోట్ల అభ్యర్థులు అందుబాటలో లేకుండా పోయారని అంటున్నారు. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ తన ఆర్థిక బలాబలాలు తక్కువైనప్పటికీ స్థాయి మేరకు ఓటరును ప్రసన్నం చేసుకునే ప్రయత్నం సాగింది.