High Court
హైదరాబాద్, విధాత : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితాకుమారి బదిలీ అయ్యారు. ఆమెను తెలంగాణ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
అయితే ఈ సిఫారసుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడంతోపాటు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. జస్టిస్ లలితాకుమారి తెలంగాణ హైకోర్టులో విశేష సేవలు అందించారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు.
మరో ఇద్దరు న్యాయమూర్తులు..
జస్టిస్ కన్నెగంటి లలితాకుమారితో పాటు మరో ఇద్దరు వేర్వేరు రాష్ర్టాల హైకోర్టు న్యాయమూర్తులను కూడా బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు పంపింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్‌ను అలహాబాద్ హైకోర్డుకు, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఫుల్ మనుభాయ్ పంచోలీని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు పంపింది. దీంతో ఆ సిఫారసులను కేంద్రం ఆమోదం తెలుపుతూ గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.