Jr NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నా, తనలోని వినయం మాత్రం ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. నటన, డ్యాన్స్‌తో కెరీర్ ప్రారంభ దశలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారక్, అవకాశమొచ్చిన ప్రతిసారి తనకు మార్గదర్శకులైన సీనియర్ హీరోల గురించి గౌరవంగా మాట్లాడుతుంటారు. అలాంటి ఒక సందర్భమే అవార్డు వేదికపై ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఓ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమంలో యమదొంగ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆ క్షణాన్ని తారక్ తన జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా అభివర్ణించారు.
చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అని ఆయన చెప్పిన మాటలు సభలో హర్షధ్వానాలు తెప్పించాయి. అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన ఎన్టీఆర్, తన బాల్యం నుంచి తాను చూసి ఎదిగిన హీరోల గురించి ప్రస్తావించారు. “మేమంతా చిన్నప్పటి నుంచి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాం. వాళ్ల సినిమాల నుంచే నటన, డ్యాన్స్, క్రమశిక్షణ నేర్చుకున్నాం” అంటూ తన ప్రేరణలను వెల్లడించారు. అదే వేదికపై, కొన్నేళ్ల క్రితం మరణించిన లెజెండరీ నటుడు శోభన్ బాబు గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
శోభన్ బాబు గారి మరణం చాలా బాధాకరం. ఆయనకు చివరి చూపు కోసం వెళ్లే అర్హత కూడా నాకు ఇంకా రాలేదని అనిపించింది” అంటూ వినయంతో మాట్లాడారు. ఆ కారణంగానే తాను అందుకున్న ఈ అవార్డును శోభన్ బాబు గారికే అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఆ అవార్డు ఆయన కుటుంబ సభ్యులకు అందేలా చేయాలని కోరుతూ చిరంజీవికే తిరిగి అందజేశారు.ఈ సందర్భంలో స్పందించిన చిరంజీవి, ఎన్టీఆర్ ఆలోచనల్ని, సంస్కారాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు. “ఈ అవార్డును శోభన్ బాబు గారికి అంకితం చేయాలనే ఆలోచన తారక్‌కు రావడం అతని విలువలు, పెంపకం ఎలా ఉన్నాయో చెబుతోంది” అంటూ మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు.
