ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపులు!.. లక్షకుపైగా టెలిఫోన్‌ కాల్స్ ట్యాపింగ్?

నాటి ప్రతిపక్ష, అధికారపక్ష నేత ఫోన్లను ట్యాప్‌ చేయించారని మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుపై జరుగుతున్న కేసు విచారణ.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తూ

  • Publish Date - March 25, 2024 / 03:15 PM IST

  • 30 మంది పోలీసులపై విచారణ!
  • బీఆరెస్ ముఖ్య నేతను లాగుతుందా?
  • జ్యూవెలరీ, హవాలా, యాక్టర్లూ టార్గెట్‌
  • బ్లాక్‌మెయిల్‌తో కోట్లకొద్దీ అక్రమ వసూళ్లు
  • ఉప ఎన్నికల్లో డబ్బు తరలింపునకు 
  • పోలీసు వాహనాల వాడకం
  • మీరు ఇప్పుడు చేస్తున్నారు.. 
  • మేం అప్పటి ప్రభుత్వం చెబితే చేశాం
  • అధికారులతో ప్రభాకర్‌ వ్యాఖ్యలు?
  • ట్యాపింగ్‌తోనే ఫామ్‌హౌస్‌ స్వాములకు బేడీలు

విధాత, హైదరాబాద్ : నాటి ప్రతిపక్ష, అధికారపక్ష నేత ఫోన్లను ట్యాప్‌ చేయించారని మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుపై జరుగుతున్న కేసు విచారణ.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తూ సరికొత్త మలుపులు తిరుగుతున్నది. అంతిమంగా బీఆరెస్‌ ముఖ్య నేతలకు చుట్టుకునే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతున్నది. పోలీసుల కస్టడీలో ప్రణీత్‌రావు చెప్పిన వివరాల ఆధారంగా ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేసిన పోలీసులు విచారణను మరింత ముందుకు దూకిస్తున్నారు. జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఎన్ భుజంగరావు, మేకల తిరుపతన్న వెల్లడించిన అంశాలు మరింత సంచలనంగా మారాయి. బీఆరెస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వారితోపాటు ఈ కేసులో ఏ 1గా ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ టీ ప్రభాకర్ రావు, ఏ3 పీ రాధాకిషన్ రావు ఇచ్చిన వ్యక్తుల ఫోన్ నంబర్లను, ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత ఎ.రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వారు అంగీకరించినట్లుగా పోలీస్ వర్గాల కథనం. రేవంత్‌రెడ్డి ప్రతి కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీఆరెస్ పెద్దలకు చేరవేశామని ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న వెల్లడించారని తెలిసింది. బీఆరెస్ పెద్దలు అందించిన ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లతో పాటు పలువురు రియల్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, జ్యూవెలరీ యజమానులు, హవాలా వ్యాపారులు, జర్నలిస్టులు, టీఎన్జీవో సంఘం నాయకులు ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా విచారణలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న అంగీకరించారని చెబుతున్నారు. అలాగే మాజీ మంత్రి అనుచర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా, ప్రముఖ జువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తులు, రియల్ వ్యాపారులకు చెందిన మొబైల్ ఫోన్లను ట్యాప్ చేసి, బెదిరింపులకు పాల్పడి కోట్లకొద్దీ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా వెల్లడించారని సమాచారం. సాధారణ కాల్స్‌తోపాటు వాట్సప్, సిగ్నల్, ఫేస్‌టైమ్ యాప్‌లతో చేసిన కాల్స్‌ను కూడా ట్యాపింగ్ చేయడం ఒళ్లు గగుర్పాటు కల్పించే అంశంగా చెబుతున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయడం, వారు సమకూర్చుకున్న డబ్బులను పట్టుకోవడం, వారి వ్యూహాలను, పట్టుబడిన డబ్బులను బీఆరెస్ పెద్దలకు చేరవేయడం, బీఆరెస్ కోసం డబ్బులను పోలీసు వాహనాల్లో దర్జాగా తరలించడం వంటి చర్యలకు అరెస్టయిన ముగ్గురు అధికారులు పాల్పడినట్లుగా పోలీసులు విచారణలో తేలిందని సమాచారం. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లను యథేచ్ఛగా ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీఆరెస్ పెద్దలకు చేరవేశారని తెలుస్తోంది. 

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఉదంతం వెనుకా ట్యాపింగ్‌?

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో బీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిన ప్రయత్నంలో బీజేపీ ప్రతినిధులుగా చెబుతున్న స్వాములు, బీఆరెస్ ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఫోన్ల సంభాషణల రికార్డులు బయటకు రావటానికి ఈ ట్యాపింగే కారణమని చెబుతున్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని, అయినప్పటికీ వారు లొంగలేదని మీడియా సమావేశం పెట్టి అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆడియో, వీడియో టేపులను విడుదల చేయడం వెనకాల ప్రభాకర్ రావు బృందం ఉన్నట్లు విచారణ అధికారులు అంచనాకు వచ్చారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఎపిసోడ్‌లో ఇద్దరు స్వాముల అరెస్టు అవగా, దానిపై అప్పటి పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పాలుపంచుకున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితులు తప్పక ఉన్నాయని అధికారవర్గాలు అంటున్నాయి. 

ట్యాపింగ్‌తో లావాదేవీల గుర్తింపు.. 

ఫోన్ ట్యాపింగ్‌కు అలవాటు పడిన దుగ్యాల ప్రణీత్, ఎన్ భుజంగరావు, మేకల తిరుపతన్నల బృందం ఆగడాలు గత శాసనసభ ఎన్నికల వేళ పరాకాష్టకు చేరుకున్నట్లు వెల్లడైంది. ఎన్నికల్లో రాజధాని నుంచి హవాలా సొమ్ము రాష్ట్రంలోని బయటి ప్రాంతాలకు భారీగా తరలిస్తారన్న అంచనాలతో వారు ఫోన్ ట్యాపింగ్ మరింత ఎక్కువగా చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లుగా గుర్తించారని తెలిసింది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో క్షేత్రస్థాయి ఆపరేషన్‌కు అవకాశం తక్కువన్న ఆలోచనతో ప్రణీత్ బృందం నగర శివార్లపై దృష్టి సారించిందని, ఎక్కువగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్యాపింగ్ నిర్వహించిందని దర్యాప్తులో తేలిందని సమాచారం. ట్యాపింగ్ ద్వారా గుర్తించిన హవాలా లావాదేవీలపై ఆధారంగా దొరికిన సొమ్మును వందల కోట్లలో పక్కదారి పట్టించినట్లు దర్యాప్తు బృందం గుర్తించి, ఇందుకు సంబంధించి ఆధారాల సేకరణ చేస్తున్నారు.

ఎర్రబెల్లి చుట్టు బిగిస్తున్న ట్యాపింగ్ ఉచ్చు?

ఈ కేసులో ఇప్పటివరకు ప్రణీత్ రావుతోపాటు ఎన్ భుజంగరావు, మేకల తిరుపతన్నను అరెస్టు చేశారు. మరిన్ని పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత మరికొందరిని అరెస్టు చేయనున్నారని తెలుస్తున్నది. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు విశ్రాంత, ప్రస్తుత పోలీస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. వారికి ఏప్రిల్ 6వరకు జ్యూడిషియల్ రిమాండ్ ఉంది. కేసులో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ చైర్మన్ శ్రవణ్‌రావు కార్యాలయం, అలాగే సిరిసిల్లలో, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వగ్రామం, ప్రణీత్‌రావు అత్తగారి గ్రామమైన పర్వతగిరి గ్రామంలో సంపత్ రావు ఇంట్లో సర్వర్లు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతల, జర్నలిస్టుల, వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ముగ్గురు అధికారులు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. దీంతో త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి సహా ముగ్గురు బీఆరెస్ పార్టీ కీలక నేతలకు 41ఏ కింద నోటీస్లు జారీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తున్నది. 

విచారణాధికారులకు టచ్‌లోకి ప్రభాకర్‌రావు?

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ ఐపీఎస్ టీ ప్రభాకర్‌రావు కేసు విచారణ సాగిస్తున్న పోలీస్ అధికారులకు టచ్‌లోకి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అమెరికా నుంచి ఒక ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్లు వెల్లడైంది. భారత దేశంలో క్యాన్సర్ చికిత్సకు సరైన వైద్యులు లేనందున తాను అమెరికాకు వచ్చానని.. ఈ ఏడాది జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ వస్తానని చెప్పినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో.. అప్పుడు తాము కూడా అప్పటి ప్రభుత్వం చెబితే పనిచేశామని చెప్పారని తెలిసింది. ‘ఎంతైనా మనం పోలీసులం.. మనం.. మనం ఒకటి. మా ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేస్తున్నారు?’ అని సదరు ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు సున్నితంగా ప్రశ్నించే ప్రయత్నం చేశారని సమాచారం. ఆయన చెప్పిన మాటలన్నీ విన్న ఆ ఉన్నతాధికారి.. ‘మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్‌కు సమాధానం రాసి పంపండి’ అని బదులిచ్చారని సమాచరాం. దీనికి స్పందించని ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేసినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రావుపై కేసు నమోదైన తర్వాత పరిస్థితులు చేయిదాటుతున్నాయని, అరెస్టు తప్పదని గమనించే చడీచప్పుడు లేకుండా ఆయన అమెరికా వెళ్లిపోయారని చెబుతున్నారు. మాజీ డీసీపీ పీ రాధాకిషన్ రావు లండన్‌కు, శ్రవణ్‌రావు అరువెల నైజీరియాకు వెళ్లిపోగా వారి కోసం తెలంగాణ పోలీసు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

 

ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే ట్యాపింగ్?

విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయడానికి టీ ప్రభాకర్ రావు ఆదేశాలే కారణమని ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న పోలీసులకు వాంగ్మూలమిచ్చారని సమాచారం. ఈ వ్యవహారం వెనక బీఆరెస్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తున్నది. ప్రభాకర్ రావు, డీసీపీ రాధాకిషన్‌రావు ఆదేశాలతో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్టులోనూ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే హార్డ్ డిస్కులను ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్లు విచారణలో నిగ్గు తేలింది. ప్రస్తుతం వాటిని రికవరీ చేసిన పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ కి పంపించి డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు. అసలు సూత్రధారులు ఎవరనేది తెలియాలంటే ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు అరెస్టు కావాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. ప్రధాన సూత్రధారులను బోనులో నిలబెట్టాలంటే ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకమని న్యాయనిపుణులు చెబుతున్నారు.

బీఆరెస్ పెద్దల చొరవతోనే పదోన్నతి!

దుగ్యాల ప్రణీత్ రావు 2018లో ఎస్ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా చేరి 2023లో డీఎస్పీగా ఆక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ఇందుకోసం మావోయిస్టు కార్యకలాపాల సమాచారం అందించినట్లు నివేదిక రూపొందించారని సమాచారం. తొలుత ఈ నివేదికను రివ్యూ కమిటీలో ఉన్నతాధికారి ఒకరు తిరస్కరించారని, ఆయన సెలవులో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో పదోన్నతి సాధించాడని పోలీసువర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపైనా విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా ఎస్ఐ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు భుజంగరావు, తిరుపతన్నల పదోన్నతులపై కూడా విచారణాధికారులు దృష్టి పెట్టారు. 

ఎర్రబెల్లిపై సీఎం రేవంత్‌కు శరణ్ లేఖ..

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై హైదరాబాద్ వ్యాపార వేత్త, ఫోన్ ట్యాపింగ్ బాధితుడు శరణ్ చౌదరి, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో తనను అక్రమంగా నిర్బంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు తన బంధువు పేర తన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. దాంతోపాటు రూ.50 లక్షల నగదును బెదిరించి తీసుకున్నారంటూ ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. 2023, ఆగస్ట్ 21న తాను ఆఫీస్ కు వెళ్తుండగా… కొందరు సివిల్ దుస్తుల్లో వచ్చి తనను అడ్డుకుని.. తాము పోలీసులమని చెప్పి సీసీఎస్ కు తీసుకెళ్లారని, అక్కడికి వెళ్లిన తర్వాత పలువురి నుంచి అక్రమంగా డిపాజిట్ లు సేకరించినట్టు తనపై కేసు పెట్టినట్లు ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు బెదిరించారని లేఖలో పేర్కోన్నారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డీసీపీ రాధా కిషన్ రావు సూచనల మేరకు తనను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి కొట్టారని, బలవంతంగా ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టం అయిన విజయ్ పేరు మీద నా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారని, రెండు రోజులపాటు అక్రమంగా నిర్భంధించి తన కుటుంబ సభ్యులను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని, తన స్నేహితుడు రూ.50 లక్షలు ఇచ్చిన తర్వాత తనను వదిలి పెట్టారని ఆ లేఖలో వివరించారు. దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యగా ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు పోలీసులను తన వద్దకు పంపి బెదిరించి పిటిషన్ ను ఉపసంహరించుకునేలా చేశారని శరణ్ చౌదరి ఫిర్యాదులో తెలిపాడు. దీనిపై పూర్తి విచారణ జరిపించి తనకు న్యాయం చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డిని శరణ్ కోరాడు.

Latest News