Professor Papireddy
విధాత: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటున్నదని మలి తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్రం ఏర్పాటు తరువాత మొట్ట మొదటి సారిగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా పని చేసిన ప్రొఫెసర్ పాపిరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని ప్రజలు భావిస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడంలో బీజేపీ విఫలమైందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉన్నదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఈ మేరకు విధాత వెబ్ న్యూస్, యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణ సమాజం ప్రస్తుతం ఏమి కోరుకుంటున్నదో తెలియజేశారు. ఆవివరాలు ఇలా…
ప్రశ్న: తెలంగాణ ఉద్యమం రెండవ సారి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ?
జ: ఉమ్మడి రాష్ట్రంలో యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందని భావించారు. నీళ్లు, నియామకాలు, నిధుల కేటాయింపులలో వివక్షత కొనసాగింది. ఈ వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలు 1996 నుంచి మలి దశ ఉద్యమం చేపట్టారు. యూనివర్సిటీలలో వివక్షత చాలా స్పష్టంగా కనిపించేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే తప్ప ఈ వివక్షత పోదని ప్రజలు భావించారు. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు ఉద్యమంలో ముందు బాగాన నిలిచారు.
ప్ర: ఉద్యమంలో మీరు నిర్వహించిన పాత్ర?
జ: వివక్షతకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేశారు. ఆ నాడు పార్టీలకు అతీతంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో నేను వరంగల్ నుంచి పాల్గొన్నాను. వరంగల్ జేఏసీకి చైర్మన్‌గా పని చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి అందరితో కలిసి కృషి చేశాను. ప్రజల పోరాటం ఫలించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్దతిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది.
ప్ర: బీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనా విధానం ఎలా ఉంది? ప్రజల అభిప్రాయం ఏమిటీ?
జ: ఏ ఆకాంక్షల కోసం పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని ప్రజలు భావిస్తున్నారు. ఏ ఆత్మగౌరవం కోసం పోరాడామో ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడిన బీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఆత్మగౌరం దక్కడం లేదని ప్రజలు భావిస్తున్నారు. ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు.
తాము ఎమ్మెల్యేల వద్దకు వెళితే తామేమి చేయలేమని అంటున్నారని, మంత్రులు కూడా అదే మాట అంటున్నారని, పవర్ సెంటర్గా ప్రజలు భావిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కలిసే అవకాశం లేదని ప్రజలు భావిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి సీఎంలు ప్రతి రోజు తమ అధికార నివాసం వద్ద కలిసే వారని ఇప్పుడదని లేదన్నారు.
అందుకే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం కొరవడిందని అంటున్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారంతా ఎటో పోయారని, ఆనాడు ఉద్యమకారులపైదాడులు చేసిన వారే నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారని ప్రజలు భావిస్తున్నారన్నారు.
ప్ర: తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏమి కావాలని కోరుకుంటున్నారు?
జ: తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మార్చాలన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని అర్థం అవుతున్నది.
ప్ర: ఇప్పుడు తెలంగాణ వాదుల కర్తవ్యం ఏమిటీ?
జ: ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ వాదులంతా ఏకం అవుతున్నారు. ఎవరికి వారుగా బావాజాల వాప్తి చేస్తున్నారు. ఇప్పటికే వివిధ వర్గాలలో ఉన్న బుద్ది జీవులు ఈ ప్రభుత్వాన్ని మార్చాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు తెలంగాణ వాదులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది.
ప్ర: ప్రజలు మార్పు కోరితే కాంగ్రెస్, బీజేపీలలో ఎవరిని ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు?
జ: బీఆర్ఎస్ సర్కారు ను మార్చాలని అనుకుంటున్న ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కాంగ్రెస్ పార్టీనే రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల తాను పర్యటించానని, తనతో ఎవరు మాట్లాడినా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అంటున్నారన్నారు.
మొదట్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ నిలబడుతుందని భావించారు కానీ, ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉందని ప్రజలు భావిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలబడేది కాంగ్రెస్ పార్టీనే అనే అభిప్రాయంతో ప్రజలున్నారు.
ప్ర: బీఆర్ఎస్, బీజేపీకి మధ్య అవగాహన ఉందని ప్రజలు భావించడానికి కారణం ఏమిటీ?
జ: బీఆర్ఎస్, బీజేపీకి మధ్య అవగాహన ఉందని ప్రజలు భావించడానికి ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలే కారణమని చెప్పాను. దీని కారణంగానే బీఆర్ఎస్ను, కేసీఆర్ను ఓడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి బీజేపీలో చేరిన నేతలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన మాటలు.. ముఖ్యంగా కవిత విషయంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్కు మధ్య అవగాహన ఉందని భావిస్తున్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య సయోధ్య కుదిరిందన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లిన తరువాతనే బీజేపీలో చేరికలు ఆగిపోయినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిణామాల కారణంగా రాష్ట్రంలో బీజేపీ బాగా దెబ్బతిన్నది. ఏలక్షంతోనైతే పలువురు నేతలుబీజేపీలో చేరారో.. ఆ నేతలు ఇప్పడు తీవ్ర కలత చెందుతున్నట్లుగా వారిమాటలను బట్టి అర్థం అవుతున్నది.