రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ కేసీఆర్‌తో అసాధ్యం: AIKAF

బెదిరింపులతో ఆత్మహత్యలను దాచలేరు కౌలు రైతుల ఆత్మహత్యలను గుర్తించకపోవడం సిగ్గుచేటు పల్లా రైతు బంధువా? శత్రువా? రైతు నేత, ప్రొఫెసర్ల విమర్శ విధాత, వరంగల్: రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ ప్రభుత్వ విధానాలతో సాధ్యం కాదని, రైతుల పక్షాన పోరాడే రైతు సంఘాలను, సంస్థలను ఆప్రజాస్వామిక పద్ధతుల్లో బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ రిటైర్డ్ ప్రొఫెసర్లు మరింగంటి యాదగిరాచార్యులు, కూరపాటి వెంకటనారాయణ హెచ్చరించారు. రైతుల పట్ల […]

  • Publish Date - January 4, 2023 / 04:26 AM IST
  • బెదిరింపులతో ఆత్మహత్యలను దాచలేరు
  • కౌలు రైతుల ఆత్మహత్యలను గుర్తించకపోవడం సిగ్గుచేటు
  • పల్లా రైతు బంధువా? శత్రువా?
  • రైతు నేత, ప్రొఫెసర్ల విమర్శ

విధాత, వరంగల్: రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ ప్రభుత్వ విధానాలతో సాధ్యం కాదని, రైతుల పక్షాన పోరాడే రైతు సంఘాలను, సంస్థలను ఆప్రజాస్వామిక పద్ధతుల్లో బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ రిటైర్డ్ ప్రొఫెసర్లు మరింగంటి యాదగిరాచార్యులు, కూరపాటి వెంకటనారాయణ హెచ్చరించారు.

రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా రైతుబంధు సమితి చైర్మన్‌గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై, బెదిరింపు ధోరణిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వరంగల్ ఓంకార్ భవన్ లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న మన రాష్ట్రంలో రైతు ఆత్మహత్య లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేటికీ ఆత్మహత్యలు నివారించకపోవడం సిగ్గుచేటు అన్నారు.

కేవలం రైతుబంధు, రైతు బీమా లతోనే రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ రైతులకు కావాల్సిన మార్కెట్ దోపిడీని అరికట్టి, ఇన్పుట్స్, కనీస మద్దతు ధరను, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాలను తగిన విధంగా అందించకుండా దోచుకునే వారికే వత్తాసు పలుకుతూ రైతు ఆత్మహత్యలను ఎలా అరికడతారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే అందులో 20 శాతం మంది అంటే 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని అధికారిక లెక్కలే చెబుతున్నాయని ఆత్మహత్యల్లో కౌలు రైతులు 80 శాతం మంది ఉన్నారని అలాంటి కౌలు రైతులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లేకపోవడం దారుణమని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనైనా కౌలు రైతులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు సబ్సిడీలు రాయితీలు నష్టపరిహారాలు ఇచ్చేవారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఏదో ఒక ఆర్థిక ఇబ్బందితో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ఒక్కరోజు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు కేసీఆర్ ప్రభుత్వానికి లేవని విమ‌ర్శించారు.

కనీసం రైతుబంధు సమితి చైర్మన్ అని చెప్పుకుంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం పరామర్శించలేదని ఆరోపించారు. ఇలాంటి స్థితిలో రైతు సంఘాలు, సంస్థలు రైతుల పక్షాన తమకున్న పరిధిలో సహాయ సహకారాలు అందిస్తూ రైతులను ఆదుకోమని చేసిన సర్వే రిపోర్టులను బహిర్గతం చేయడం తప్పు అని ఉరికిచ్చి కొడతామని బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్ర‌శ్నించారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అసలు రైతుబంధు సమితి చైర్మనా లేక రైతు శత్రువు సమితి చైర్మనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ఇప్పటికైనా ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలను ప్రకటనలను బెదిరింపులను మానుకొని రైతు సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. లేకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా బాధ్యులు రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఓదెల రాజన్న ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, ఏఐసీటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్ర ప్రతాప్, ఏఐఎఫ్ డివై రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద రవి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోరాటి హంసాల్ రెడ్డి, కందికొండ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.