విధాత: విమానం ఇంజిన్‌లో పడి విమానాశ్రయ ఉద్యోగి దారుణంగా మృతి చెందిన ఘటన టెక్సాస్ (Texas)లో జరిగింది. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. శాన్ ఆంటోనియా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన డెల్టా విమానం.. ప్రయాణికులను దించడానికి నిర్ణీత ప్రదేశానికి వెళుతోంది.
బాధిత ఉద్యోగి సమీపంలోకి విమానం రాగానే అతడిని ఇంజిన్ లాగేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంతమంది మాత్రం సదరు ఉద్యోగి కావాలనే ఆ ఇంజిన్ ముందుకు వచ్చాడని వెల్లడించారు.
శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మృతుని శరీరం ఛిన్నాభిన్నం కావడంతో అతడెవరనేది ఇంకా గుర్తించలేదు. దీనిపై ఫెడరల్ ఏవియేషన్, డెల్టా ఎయిర్‌వేస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సిబ్బందికి విధి విధానాలు, నిబంధనల పట్ల మరింత అవగాహన కల్పిస్తామని ప్రకటించాయి.
గతేడాది సైతం ఒక ఉద్యోగిని విమానం ఇంజిన్ లాగేసుకోవడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటనలో విమాన సంస్థకు జరిమానా సైతం పడింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా దాని ఇంజిన్‌లు భారీగా గాలిని లోపలికి తీసుకుంటాయి. వీటికి సమీపంలో ఎవరు వచ్చినా లోపలికి లాగేసుకుంటాయి.