Site icon vidhaatha

Viral News | మ‌తిమ‌రుపు భ‌ర్త‌.. చిమ్మ చీక‌టిలో 20 కి.మీ. న‌డిచిన భార్య‌

ఓ మ‌తిమ‌రుపు భ‌ర్త వ‌ల్ల భార్య‌కు క‌ష్టాలు త‌ప్ప‌లేదు. చిమ్మ చీక‌టిలో ఆమె 20 కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సి వ‌చ్చింది. భార్య‌ను వ‌దిలేసిన భ‌ర్త ఏకంగా 156 కిలోమీట‌ర్ల దూరం వెళ్లిపోయాడు. చివ‌ర‌కు పోలీసుల సాయంతో భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లుసుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. థాయిలాండ్‌కు చెందిన బూన్‌టామ్ కైమూన్‌(55), ఆయ‌న భార్య అమ్నూయ్ కైమూన్‌(49) క‌లిసి కారులో ఆదివారం త‌మ సొంతూరికి బ‌య‌ల్దేరారు. కారులో వెళ్తుండ‌గా, తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో భ‌ర్త‌కు టాయిలెట్ రావ‌డంతో కారును రోడ్డు ప‌క్క‌కు ఆపాడు. భ‌ర్త మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్ల‌గా, భార్య కూడా కారు దిగి టాయిలెట్‌కు దిగింది. అయితే కారు వ‌ద్ద‌కు వ‌చ్చిన భ‌ర్త‌.. త‌న భార్య కారులోనే ఉంద‌ని భావించి అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు.

షాకైన భార్య‌.. చీక‌ట్లోనే 20 కి.మీ. న‌డ‌క‌

ఇక భార్య వ‌చ్చేస‌రికి అక్క‌డ కారు క‌నిపించ‌లేదు. దీంతో ఆమె తీవ్ర ఆందోళ‌న‌కు గురైంది. ఫోన్ చేద్దామంటే ఆమె వ‌ద్ద ఫోన్ లేదు. కారులోనే ఫోన్‌ను ఉంచింది. చేసేదేమీ లేక చిమ్మ చీక‌ట్లోనే 20 కిలోమీట‌ర్ల మేర న‌డిచింది. తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు క‌బీన్ బూరికి చేరుకుంది. అక్క‌డ పోలీసుల సాయంతో త‌న ఫోన్‌కు ఫోన్ చేసింది. 20 సార్లు చేసినా స్పంద‌న లేదు. భ‌ర్త‌కు చేద్దామంటే అత‌ని నంబ‌ర్ ఆమెకు తెలియ‌దు.

ఉద‌యం 8 గంట‌ల‌కు స్పందించిన భ‌ర్త‌

ఎట్ట‌కేల‌కు ఉద‌యం 8 గంట‌ల‌కు భ‌ర్త ఆమె కాల్స్‌కు స్పందించాడు. ఆ స‌మ‌యంలో అత‌ను షాక్‌కు గుర‌య్యాడు. అప్ప‌టికే బూన్‌టామ్ 156 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాడు. ఇక భార్య కోసం మ‌ళ్లీ తిరిగి క‌బీన్ బూరికి చేరుకున్నాడు.

భార్య‌కు క్ష‌మాప‌ణ‌లు

వెనుకాల సీట్లో కూర్చున్న త‌న భార్య గాఢ నిద్ర‌లోకి జారుకుంద‌ని భావించి, ముందుకు వేగంగా వెళ్లాన‌ని బూన్‌టామ్ తెలిపాడు. ఈ సంద‌ర్భంగా భార్య‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. త‌న‌ను వ‌దిలేసి ఎందుకు వెళ్లిపోయావ‌ని, ఆమె త‌న భ‌ర్త‌తో ఎలాంటి గొడ‌వ చేయ‌లేదు. హ్యాపీగా అక్క‌డ్నుంచి వెళ్లిపోయారు ఆ దంప‌తులు.

Exit mobile version