Skin Care | చలికాలంలో చర్మం పొడిబారుతుందా..? ఈ జాగ్రత్తలు పాటించండి.. స్కిన్‌ని కాపాడుకోండి

చలికాలంలో పొడి చర్మం, పగుళ్ల సమస్య వేధిస్తోందా? కేవలం మాయిశ్చరైజర్లు వాడితే సరిపోదు. శరీరానికి తగినంత నీరు, గోరువెచ్చని నీటి స్నానం, హెర్బల్ టీ వంటి ఈ సింపుల్ చిట్కాలతో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

Skin Care

Skin Care | చలికాలం వచ్చిందంటే (Winter Season) చాలు చర్మ సమస్యలూ (Skin Care) మొదలవుతాయి. శీతలగాలులకు ఒంట్లో తేమ తగ్గిపోయి.. దురద, చర్మం పగిలిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. శీతకాలంలో పొడి చర్మం ప్రతిఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది. వేడివేడి నీళ్లతో స్నానం చేయడం కూడా.. సమస్యను పెంచుతుంది. దీంతో ప్రతీ ఒక్కరూ మాయిశ్చరైజర్లు, క్రీమ్స్‌ను వాడతారు. కానీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం ఇస్తాయి. పొడిచర్మం సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే.. చర్మం లోపలి నుంచీ ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

నీళ్లు మానొద్దు

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దాహం వేయదు. నీళ్లు తగ్గించి కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటారు. దాంతో డీహైడ్రేషన్‌ ఏర్పడుతుంది. చర్మం పాలిపోతుంది, పొడిబారుతుంది, పగుళ్లు వస్తాయి. చర్మం రోజంతా తేమగా ఉండాలంటే.. శరీరానికి తగినంత నీరు అందించాలి. దాహం వేసినా వేయకపోయినా రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల్సిందే.

వేడినీళ్ల స్నానం వద్దు..

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వేడివేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఆ సమయానికి హాయిగా ఉంటుంది కానీ, ఈ అలవాటు చర్మ ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. చలి వాతావరణం చర్మంలోని సహజమైన నూనెలను తగ్గిస్తుంది. దీనికి తోడు వేడినీళ్ల స్నానం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావ సమస్యలు వస్తాయి. ఎంత చల్లటి వాతావరణమైనా, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడమే ఉత్తమం.

సాధారణ సబ్బులను పక్కన పెట్టండి

సాధారణ రోజుల్లో ఉపయోగించే సబ్బులను పక్కన పెట్టండి. ఇవి చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. దాంతో చర్మం పొడిబారుతుంది. కలబంద, పసుపు, వేప లాంటి సహజ పదార్థాలున్న సబ్బులను వాడండి. రసాయనాల జాడలేని సేంద్రియ సబ్బులు వాడటం మరీ మంచిది. ముఖ్యంగా సున్నిపిండితో స్నానం చేయడం ఉత్తమం.

8 గంటల నిద్ర..

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ముఖ్యంగా తగినంత నిద్ర అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి.

హెర్బల్‌ టీ బెస్ట్‌..

శీతకాలంలో మామూలు ‘టీ’కి బదులుగా.. అల్లం, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలతో చేసిన ‘హెర్బల్‌ టీ’ని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు, బాడీకి కావాల్సిన వేడిని అందిస్తాయి.

స్వెట్టర్‌ ఒక్కటే సరిపోదు!

చలిని తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరూ స్వెట్టర్‌లు ఉపయోగిస్తారు. అయితే, చర్మాన్ని కాపాడుకునేందుకు స్వెటర్‌ మాత్రమే సరిపోదు. కాళ్లకు సాక్స్‌, చేతులకు గ్లౌజులూ ముఖ్యమే. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :


Donald Trump | ట్రంప్‌ మరో సంచలనం.. భారత్‌పై 500 శాతం సుంకాలు..?
Toxic | యశ్ ‘టాక్సిక్’ గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు.. హాలీవుడ్ స్థాయిలో టేకింగ్, వైల్డ్ యాక్షన్

Latest News