Rekha | అనారోగ్యంతో పోరాటం… వ‌చ్చిన సంబంధాలు పోతున్నాయంటూ ఆనందం హీరోయిన్ ఆవేద‌న‌

Rekha | సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ రేఖా వేదవ్యాస్ ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Rekha | సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ రేఖా వేదవ్యాస్ ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2001లో విడుదలైన ఆనందం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె, తొలి చిత్రంతోనే యువతలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా, అందులో రేఖ నటన ప్రత్యేకంగా నిలిచింది.

తొలి విజయానంతరం రేఖ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా కన్నడ చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి 30కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె ఆకస్మికంగా తెరమరుగవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

అనారోగ్యం కారణంగా విరామం

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ తన ఆరోగ్య పరిస్థితిపై ఓపెన్‌గా మాట్లాడారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని, శారీరకంగానే కాదు మానసికంగానూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోవడంతోనే సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందన్నారు. ఒక దశలో మళ్లీ ఫోటోషూట్లు చేసి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదని చెప్పారు.

పెళ్లిపై ఓపెన్ కామెంట్స్

వివాహంపై కూడా రేఖ నిజాయితీగా స్పందించారు. హీరోయిన్‌గా బిజీగా ఉన్న రోజుల్లో పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదని, కానీ వయసు పెరిగేకొద్దీ జీవిత భాగస్వామి అవసరం అనిపించిందన్నారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని చూసి సంబంధాలు ముందుకు రాకపోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోవడం కంటే ఆలస్యమైనా సరైన వ్యక్తి రావాలని ఆశిస్తున్నానని ఆమె వెల్లడించారు. బయటకు సినీ జీవితం రంగులమయంగా కనిపించినా, వ్యక్తిగతంగా ఒంటరితనం, కష్టాలు ఉంటాయని ఆమె మాటల్లో స్పష్టమైంది.

గుర్తింపు తెచ్చిన చిత్రాలు

తెలుగులో రేఖ నటించిన పలు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. దొంగోడు, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, అనగనగనగా ఓ కుర్రాడు, జాబిలి, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి వంటి సినిమాల్లో ఆమె నటన ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. కన్నడలో వరుస విజయాలతో స్టార్ హోదా పొందిన రేఖ ఒక దశలో సౌత్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా నిలిచింది.

అయితే వరుస పరాజయాలు, ఆరోగ్య సమస్యలు కలిసి ఆమె కెరీర్‌కు బ్రేక్ వేశాయి. 2014 తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించని రేఖ అప్పుడప్పుడు టీవీ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవల ఒక టీవీ షోలో నటుడు వేణు తొట్టెంపూడితో కలిసి కనిపించగా, ఆమె రూపంలో వచ్చిన మార్పు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు క్యూట్ లుక్‌తో మెరిసిపోయిన రేఖ ఇప్పుడు బరువు తగ్గి కనిపించడం అభిమానులను కలవరపరిచింది. రేఖ ఆరోగ్యం త్వరగా మెరుగుపడి మళ్లీ పాత ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Latest News