విధాత, మెదక్ బ్యూరో: ఏడుపాయల వన దుర్గ భవానీ మాత జాతర శనివారం నుండి ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతరను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రారంభించనున్నారు.
మూడు రోజులు జరగనున్న జాతర…
ఏడుపాయల వన దుర్గ భవాని మాత జాతర మూడు రోజులపాటు జరగనుంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 18న జాతర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు చేసి ఉపవాస దీక్షలు చేపడుతారు.
అనంతరం అమ్మవారి సన్నిధిలో జాగరణ చేసి దీక్షలు విరమిస్తారు. రెండవ రోజు ఆదివారం జాతరకే తలమానికంగా నిలిచే బండ్లు తిరిగి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి బండ్లు తిరిగే కార్యక్రమాన్ని తిలకిస్తారు.
రథోత్సవంతో ముగియనున్న జాతర
ముందుగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానదీశుల బండి ముందు తిరగగా సుమారు వందకు పైగా బండ్లు ఆ బండిని అనుసరిస్తాయి. ఇక మూడో రోజు ఆదివారం రాత్రి రథోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 18 కులాల పని బాటల వాళ్లు పాల్గొని పట్టుపరిచి ప్రత్యేక పూజలు నిర్వహించి రథం తిరిగే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రథోత్సవంతో జాతర ముగుస్తుంది.
పార్కింగ్ సౌకర్యాలు..
ఏడుపాయల జాతరకు తెలంగాణ నుండి కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ముఖ్యంగా కర్ణాటక మహారాష్ట్ర జహీరాబాద్ నారాయణఖేడ్ తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు బోడుమెట్పల్లి మీదుగా నాగసానిపల్లి కమాన్ నుండి ఏడుపాయలకు చేరుకుంటారు. వీరి వాహనాలను పార్కింగ్ చేయడానికి చెలిమెల కుంట ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుండి భక్తులు కాలినడకన ఏడుపాయల ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
ఇక హైదరాబాద్, సంగారెడ్డి, బాలనగర్ తూప్రాన్ తదితర ప్రాంతాల నుండి వచ్చేవారు నూతనంగా ఏర్పాటు అయిన రోడ్డు మార్గం గుండా పోతాన్ శెట్టిపల్లి వైపు నుండి ఏడుపాయలకు చేరుకోవాల్సి ఉంటుంది. వీరి వాహనాలు ఏడుపాయల లో ఏర్పాటుచేసిన రెండో బ్రిడ్జి వద్ద పార్క్ చేసి అమ్మవారి ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
జాతరకు 150 ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ అధికారులు జాతరకు 150 వరకు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తాగునీటి కోసం జాతరలో 480 నల్లాలను ఏర్పాటు చేయగా, జాతర పరిసరాలు దుమ్ము లేవకుండా 15 ట్యాంకర్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని చల్లుతున్నారు. మంజీరా నదిలో స్నానాలు చేసేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా సుమారు 200 మంది గజ ఈతగాలను అప్రమత్తంగా ఉంచారు. జాతరలో 350 తాత్కాలిక మరుగుదొడ్లు, 80 శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. జాతరను పరిశుభ్రంగా ఉంచడానికి 80 మంది కార్మికులను ఏర్పాటు చేశారు. జాతరకు 1200 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఏడుపాయల స్థల పురాణం…
ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం తెలంగాణ ప్రాంతంలోనే ప్రఖ్యాతి గాంచింది, పచ్చని చెట్లు, గుట్టలు, రాళ్లతో నెలకొని ఉన్న ఈ ప్రాంతంలో మంజీరానది ఏడుపాయలుగా విడిపోగా మధ్యలో ఏర్పడిన గుహలో అమ్మవారు స్వయంభుగా అవతరించారు. ద్వాపరయుగంలో అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు మహారాజు అక్కడికి వెళ్ళగా తపో ధ్యానంలో నిమగ్నమై ఉన్న ఒక ముని కనబడ్డాడు. పరీక్షిత్తు రాజు దాహం తీర్చమని ఆ మునిని కోరిన కఠోర తపస్సులో ఉన్న ముని గమనించలేదు. ఎన్నిసార్లు అడిగినా ముని స్పందించకపోవడంతో ముని మెడలో చనిపోయిన పాము వేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు.
కొంతసేపటికి ఈ విషయం అతడి కుమారుడు గమనించి తన తండ్రి మెడలో చనిపోయి ఉన్న పామును వేసిన వాడు పాము కాటుతో మరణిస్తాడు అని శపించాడు. ఆ శాపము వలన పరీక్షిత్తు మహారాజు పాముకాటుతోనే మరణించాడు. అనంతర కాలంలో పరీక్షిత్తు మహారాజ్ కుమారుడు జనమజేయుడు తన తండ్రిని చంపిన పాములపై పగ తీర్చుకోవడానికి సర్పయాగం చేశాడు.
ఆ సర్పయాగం ఆపడానికి వాసుకి కోరిక మేరకు వనదుర్గా భవాని స్వయంభుగా వెలిసి మంజీరా నదిని అమ్మవారి పాదాలతో స్పర్శించగా ఏడుపాయలుగా చీలి యాగం నుండి వచ్చే అగ్ని జ్వాలలను చల్లార్చి సర్పజాతి వినాశనం కాకుండా కాపాడినది. ఈనాటికి ఇక్కడి గుహలలో తవ్వినప్పుడు గతంలో యాగం చేసిన బూడిద లభ్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
పూర్తయిన జాతర పనులు: కలెక్టర్ రాజర్ష షా
ఏడుపాయల జాతర అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలిపారు. రాష్ట్ర పండుగగా అధికారింగా నిర్వహిస్తున్న జాతరకుచు ఇట్టి జాతరకు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వస్తారని సకల వసతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
భక్తులు పవిత్ర స్నానాలాచరించుటకు సింగూరు నుండి 0. 450 టిఎంసి ల నీటిని విడుదల చేయగా ఘనపూర్ ఆనకట్టకు చేరి అలుగుపారుతున్నదని అన్నారు. స్నానాలు చేసేందుకు 10 షవర్లు, బట్టలు మార్చుకొనుటకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశామన్నారు.
జాతరలో ప్రధాన సమస్య పారిశుద్యమని, ఇందుకోసం జాతరను 5 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ లో 120 పారిశుధ్యకార్మికులు, 35 మంది సూపర్ వైజర్ల చొప్పున 650 పారిశుధ్య కార్మికులు, 200 మంది సూపర్ వైజర్లను నియమించి డ్రెస్ కోడ్ తో పాటు గ్లౌస్ లు, మాస్కులు శానిటైజర్లు అందించామని, చెత్త సేకరణకు 280 డ్రమ్ములు, 4 ట్రాక్టర్లు, 12 స్వచ్ఛ భారత్ ఆటోలు, 4 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
భక్తులకు ప్రథమ చికిత్స అందించుటకు 12 మంది వైద్యులు, 38 మంది పారా మేడికల్ సిబ్బందితో 6 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, మూడు 108 అంబులెన్సులు, ఒక 102 అంబులెన్స్ అందుబాటులో ఉంచుతున్నామని కలెక్టర్ తెలిపారు. అంతేగాక నది పరివాహక ప్రాంతాలలో నీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేస్తున్నామని, యాంటీ లార్వా, ఫాగ్గింగ్ కూడా చేయనున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
జాతర విజయవంతానికి 80 మంది రెవెన్యూ సిబ్బందితో పాటు ఎంపిడివోలు, యంపీఓలు, మెదక్, తూప్రాన్ మునిసిపల్ కమిషనర్లు అన్ని శాఖల అధికారులను సమన్వయము చేస్తూ చక్కటి కార్యాచరణతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
భక్తుల కాలక్షేపానికి మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జాతరకు ప్రభుత్వం 2 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఈ సారి సుమారు 70 లక్షల రూపాయల శాశ్వత పనులు చేపట్టుటకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.