Chat GPT |
విధాత: కృత్రిమ మేధ (Artificial Intelligence) కు శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేకుండా తమ రచనలను వినియోగిస్తున్నారని పేర్కొంటూ పలువురు ప్రముఖ రచయితలు చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ (Open AI) పై కేసు వేశారు. ఈ రచయితల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ రచయిన జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్, జాన్ గ్రీషమ్, జార్జ్ సాండర్స్, జోడీ పికాల్ట్ తదితరులు ఉన్నారు.
తమ పుస్తకాల్లో విషయాలను ఉపయోగించి చాట్‌జీపీటీకి సమాచారాన్ని, లోకం పోకడను నేర్పుతున్నారని.. దీనికి తమ వద్ద ఎవరూ అనుమతి తీసుకోలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. మాన్‌హాటన్ ఫెడరల్ కోర్టులో మంగళవారం వీరంతా లా సూట్ ఫైల్ చేశారు. తమ రచనలను ఉపయోగించుకోవడం ద్వారా చాట్ జీపీటీ కొన్ని బిలియన్లను ఆర్జిస్తోందని.. లక్షల మంది వినియోగదారులకు తమ కంటెంట్ ఆధారంగా వినోదాన్నిస్తోందని వారు ఆరోపించారు.
దీనికి తగ్గ ప్రతిఫలం తమకు రావడం లేదని పేర్కొన్నారు. డాగ్లస్ ప్రిస్టన్ అనే రచయిత మాట్లాడుతూ.. నేను నా నవలలోని పాత్రల పోడలను వివరించాలని చాట్ జీపీటీని అడిగా.. అది వికీపీడియాలోనూ ఇప్పటి వరకు ఎక్కడా ఏని సమాచారాన్ని నా ముందు ఉంచింది. అంటే అది పుస్తకాలు అన్నింటినీ చదివేసిందన్నమాట.
అంటే ఓపెన్ ఏఐ డేటాబేస్‌లో నేను రాసిన రచనలు ఉన్నట్లేగా? అని ప్రశ్నించారు. వ్యవహారం చాట్ జీపీటీ అధికారికంగా స్పందించలేదు. అయితే కొందరు ఉన్నతోద్యోగులు మాట్లాడుతూ యూఎస్ కాపీ రైట్ చట్టాలకు అనుగుణంగానే తమ విధానాలు ఉన్నాయని స్పష్టం చేశారు.