విధాత: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష నిర్వహించింది. ఈ సభకు ఎఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సభా వేదికపై అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ మణిక్ రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. అంతకు ముందు ప్రత్యేక హెలికాప్టర్ లో ఖర్గే హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు చేరుకున్నారు.
ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మనుధర్మ పార్టీలన్నారు. పెద్ద విగ్రహాలు, భవనాలు కడితే ప్రజాస్వామ్యం ఉన్నట్లు కాదని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. దేశానికి మంచి చేసేది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బిఆర్ఎస్ విధ్వంసం చేస్తుందని, ఎనిమిదేళ్లలో ప్రజలకు చేసింది ఏముందని ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ తన పాటలతో సభికులను ఉత్తేజపరిచారు.