చైనా రాకెట్ వ‌ల్లే చంద్రునిపై పేలుడు.. వెల్ల‌డించిన శాస్త్రవేత్త‌లు

చంద్రునిపై 2022, మార్చి 4న జరిగిన‌ భారీ పేలుడు మిస్ట‌రీని శాస్త్రవేత్త‌లు తాజాగా ఛేదించారు

  • Publish Date - November 23, 2023 / 09:07 AM IST

విధాత‌: చంద్రునిపై 2022, మార్చి 4న జరిగిన‌ భారీ పేలుడు మిస్ట‌రీని శాస్త్రవేత్త‌లు తాజాగా ఛేదించారు. జాబిల్లి ఉప‌రిత‌లంపై 29 మీట‌ర్ల వెడల్పుతో భారీ బిలానికి కార‌ణ‌మైన ఈ పేలుడు ఇప్ప‌టి వ‌ర‌కూ ర‌హ‌స్యంగానే ఉండిపోయింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆరిజోనాకు చెందిన అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు రెండేళ్ల నుంచి ఈ అంశంపై అధ్య‌య‌నం చేశారు. తాజాగా ఆ వివ‌రాలను ప్లానిట‌రీ సైన్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. చాంగే 5-టీ1 మిష‌న్‌ను చంద్రునిపైకి తీసుకెళ్ల‌డానికి చైనా ఉప‌యోగించిన మార్చ్ 3సీ రాకెట్ వ‌ల్ల‌నే ఈ పేలుడు జ‌రిగింద‌ని వారు పేర్కొన్నారు. 2014లో ప్ర‌యోగించిన ఈ రాకెట్ పైభాగం చంద్రునిపై పేలుడుకు కార‌ణ‌మైంద‌ని వెల్ల‌డించారు.


అంతే కాకుండా ఈ రాకెట్‌లో బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌ని ర‌హ‌స్య అద‌న‌పు పేలోడ్‌ను కూడా చైనా పంపించింద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. టెలిస్కోప్‌ల ద్వారా రాకెట్ ట్రాజెక్ట‌రీ మార్గాన్ని ప‌రిశీలించి ఈ అంచ‌నాకు వ‌చ్చామ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ అరిజోనా ప్రొఫెస‌ర్ టాన‌ర్ కాంప్‌బెల్ తెలిపారు. డ‌బ్ల్యూఈ0931ఏ పేరుతో పిలుస్తున్న ఆ బిలం లాంగ్ మార్చ్ 3సీ రాకెట్ వ‌ల్లే ఏర్ప‌డింద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ రాకెట్ పేలుడు వ‌ల్ల డంబెల్ ఆకారంలో రెండు బిలాలు ఏర్ప‌డిన‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు.


భారీ రాకెట్ భాగం రెండుగా విడిపోయి ఉప‌రిత‌లాన్ని ఢీ కొట్టిందా? లేక తాము అనుకుంటున్న‌ట్లు మ‌రో పేలోడ్ ను ఏమైనా కావాల‌ని ఢీకొట్టించారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఆ పేలోడ్ అనేది మ‌నం ఎప్ప‌టికీ తెలుసుకోలేమ‌ని క్యాంప్‌బెల్ పేర్కొన్నారు. అయితే ఈ అధ్య‌య‌నాన్ని చైనా ఖండించింది. లాంగ్ మార్చ్ 3సీ రాకెట్ పైభాగం భూ వాతావ‌ర‌ణంలోనే కుప్ప‌కూలిపోయింద‌ని తెలిపింది. ఈ వాద‌న‌ను యూఎస్ స్పేస్ క‌మాండ్ తోసిపుచ్చింది. అస‌లు ఆ భాగం భూ వాత‌వ‌ర‌ణంలోకి ఎన్న‌డూ ప్ర‌వేశించ‌లేద‌ని తెలిపింది

Latest News