Site icon vidhaatha

Deputy CM Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

*ఈ ఘటనలో జనసేన వాళ్లున్నా చర్యలకు వెనకాడొద్దు
*సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి
* థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు
* నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి
* రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది

అమరావతి : రాష్ట్రంలో సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన థియేటర్ల బంద్ అనే ప్రకటన వెనకగల శక్తులేమిటో.. కారణాలేమిటో విచారణ చేపట్టాలని..ఇందుకు కారకుల్లో జనసేన వాళ్లు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను పవన్ కల్యాణ్ కు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని… ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు… ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని… ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.

* ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే..?
టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఇంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్యా పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకోవాలని సూచించారు.

* సినిమా హాళ్ల బంద్ నేపథ్యంపై…
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం… తదితర అంశాలపై మరోైసారి పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ కు సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు… బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

జనసేన పార్టీ నుంచి అత్తి సత్యనారాయణ సస్పెండ్ !
అమరావతి : థియేటర్ల బంద్ పిలుపు విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జి నాయకులు అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సత్యానారాయణ కూడా థియేటర్ల బంద్ ప్రకటనలో భాగస్వాములేననివచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైనదని ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటిదాకా పార్టీ రాజమండ్రి ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లుగా తెలిపారు.

Exit mobile version