విధాత: హర్యానాలోని కురుక్షేత్రలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి చేతిని పదునైన ఆయుధాలతో నరికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కురుక్షేత్ర హవేలి బయట జుగ్నూ అనే వ్యక్తి కూర్చున్నాడు. అతని వద్దకు 10 నుంచి 12 మంది దుండగులు వచ్చారు. వారు తమ ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించారు.
ఇక పదునైన ఆయుధాలతో జుగ్నూపై దాడి చేశారు. అతని చేయిని నరికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న జుగ్నూను చికిత్స నిమిత్తం లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించారు. బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే కేవలం చేయిని మాత్రమే ఎందుకు నరకాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది.
కురుక్షేత్ర హవేలి ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. బాధితుడిపై 10 నుంచి 12 మంది దుండగులు దాడి చేసినట్లు దృశ్యాలు లభ్యమయ్యాయి. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.