Site icon vidhaatha

Railway Board | రైలు ప్రమాద మృతుల ఎక్స్‌గ్రేషియా పది రెట్లు పెంపు

Railway Board

న్యూఢిల్లీ: రైలు ప్రమాద ఘటనల్లో చనిపోయిన, గాయపడినవారికి ఇచ్చే పరిహారాన్ని రైల్వే బోర్డు పదింతలు పెంచింది. గతంలో రైలు ప్రమాదాల్లో చనిపోయినవారికి రూ.50 వేలు, తీవ్రంగా గాయ పడిన వారికి రూ.25వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.5వేలు ఇచ్చే వారు. ఇప్పుడు వరుసగా.. ఐదు లక్షలు, రెండున్నర లక్షలు, 50వేలు ఇవ్వనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 18న ఒక సర్క్యులర్‌ను రైల్వే బోర్డు జారీ చేసింది.

రైలు ప్రమాదం కారణంగా కాపలా ఉన్న రైల్వేక్రాసింగ్‌ల వద్ద రోడ్డుమీద ఉన్నవారికి ప్రాణాపాయం కలిగినా, లేదా గాయపడినా ఇచ్చే పరిహారాన్ని కూడా ఇదే స్థాయిలో పెంచినట్టు సర్క్యులర్‌ పేర్కొంటున్నది. సర్క్యులర్‌ విడుదలైన నాటి నుంచే ఇది వర్తిస్తుందని తెలిపింది. అంటే.. కాపలా ఉన్న లెవల్‌ క్రాసింగ్‌ వద్ద రైలు ప్రమాద ఘటన కారణంగా చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని ఐదు లక్షలకు పెంచారు.

గాయపడినవారికి రెండున్నర లక్షలు, స్వల్ప గాయాలు అయినవారికి 50వేలు పరిహారం ఇస్తారు. గతంలో ఇవి 50వేలు, 25వేలు, 5వేలుగా ఉండేవి. అవాంఛనీయ ఘటనలు.. అంటే రైల్లో దాడి, ఉగ్రవాదుల దాడి, దోపిడీలో చనిపోయినవారి కుటుంబాలకు లక్షన్నర, తీవ్రంగా గాయపడిన వారికి 50వేలు, స్వల్ప గాయాలైన వారికి 5వేలు అందిస్తారు.

రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి దవాఖాన ఖర్చుల కోసం అదనపు నష్టపరిహారం కింద ప్రమాదం జరిగిన తర్వాత 30 రోజుల వరకూ మూడు వేల చొప్పున ఇస్తారు. దీనిని పది రోజులకు ఒకసారి విడుదల చేస్తారు. అదే అవాంఛనీయ ఘటనల్లో తీవ్రంగా గాయ పడితే.. వారికి రోజుకు 1500 చొప్పున ప్రతి పది రోజులకు లేదా డిశ్చార్జి రోజున ఏది ముందు అయితే ఆ రోజున ఒకేసారి విడుదల చేస్తారు. ఇది గరిష్ఠంగా ఆరు నెలలు ఉంటుంది.

తదుపరి ఐదు నెలల వరకూ డిశ్చార్జి రోజు లేదా ప్రతి పది రోజులకు ఒకసారి రోజుకు 750 చొప్పున అందిస్తారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్స్‌ వద్ద జరిగే ప్రమాదాలకు, నిబంధనలు అతిక్రమించి ప్రమాదానికి గురైనవారికి, రైలు పట్టాలపై తీగలు తగిలి కరెంటు షాక్‌తో చనిపోయినవారికి లేదా గాయపడినవారికి నష్టపరిహారం ఇవ్వరు.

Exit mobile version