కమలనాథులకు సీఎం అభ్యర్థుల సమస్య

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని సొంతం చేసుకున్నది

  • Publish Date - December 10, 2023 / 06:46 AM IST

విధాత‌: ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని సొంతం చేసుకున్నది. 2018లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించింది. కాంగ్రెస్‌, బీజేపీ ముఖాముఖి తలపడేవి ఈ మూడు రాష్ట్రాలే.


అందుకే అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇండియా కూటమి బలపడుతుండటంతో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన కమలనాథులు ఎలాగైనా ఇక్కడ గెలువాలనే పట్టుదలతో పనిచేశారు.


ప్రధానంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించకుండానే అంతా తానై ప్రచారం చేశారు. కర్ణాటకలోనూ ప్రధాని ఇలాంటి ప్రయోగం చేసినా ఫలించలేదు. కానీ ఉత్తరాదిలో తనకు తిరుగులేదని ప్రధాని చాటిచెప్పే ప్రయత్నం ఈ మూడు రాష్ట్రాల ఫలితాల ద్వారా మరోసారి చాటారు.


మధ్యప్రదేశ్‌లో


ఈ మూడు రాష్ట్రాల్లో మోడీ మానియా పనిచేసింది ఎంత నిజమో కాంగ్రెస్‌ స్వయంకృతమూ అంతే ఉన్నది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథన్‌, జ్యోతిరాదిత్యల మధ్య విభేదాలు కాషాయపార్టీకి కలిసి వచ్చింది. దీంతో అక్కడ అధికారపార్టీలో చీలిక తెచ్చి శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్నికల సమయంలో శివరాజ్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇక్కడ కొంతమంతి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటంతో కేంద్ర మంత్రులను, ఎంపీలను బీజేపీ బరిలోకి దింపింది.


ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. ఎన్నికల సమయంలోనే శివరాజ్‌సింగ్‌ పోటీ చేస్తారా? లేదా అన్న చర్చ జరిగింది. ఎందుకంటే ఆయనకు మొదటి రెండు జాబితాల్లో సీటు దక్కలేదు. మూడో జాబితాలో ఆయను సీటు దక్కినా సీఎంగా ఆయనకు మరోసారి అవకాశం రాదని అప్పుడే చాలామంది అంచనా వేశారు. దానికి అనుగుణంగానే ప్రస్తుత పరిణామాలున్నాయి.


మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికకు పార్టీ ప్రతినిధుల కమిటీ ఏర్పాటు చేసింది. వాళ్లు ఆయా రాష్ట్రాల్లో గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తారు. అయితే ఇదంతా ఒక ప్రక్రియ మాత్రమే. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ-షాలు ఎవరిని ఎంపిక చేస్తే వాళ్లే సీఎం అవుతారన్నది అందరికీ తెలిసిందే.


సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన శివరాజ్‌కు ఈ విషయం అర్థమైంది. అందుకే ఆయన ‘అందరికీ రామ్‌ రామ్‌’ అని ట్వీట్‌ చేశారు. ఆయన తాను సీఎంగా ఉండబోనని పరోక్షంగా చెప్పడానికే అలా ట్వీట్‌ చేశారని అక్కడి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనిపై స్పందించిన చౌహాన్‌ తన ట్వీట్‌ అంతర్థార్థం అది కాదని రాముడి పేరుతో దిన చర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని వివరణ ఇచ్చారు.


కానీ ఆయన ట్వీట్‌లో ద్వంద్వార్థం ఉండటంతో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నది. మధ్యప్రదేశ్‌ సీఎం రేసులో శివరాజ్‌సింగ్‌తో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ ఉన్నారు. వీరిలో తోమర్‌, పటేల్‌లలో ఎవరికో ఒకరి అవకాశం దక్కొచ్చంటున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ 29 స్థానాలకు గాను 28 గెలిచింది. ఈసారి ఎన్నికల్లో అవే ఫలితాలను పునరావృతం చేయాలనుకుంటున్నది.


ఛత్తీస్‌గఢ్‌లో


మధ్యప్రదేశ్‌ లో వలె ఛత్తీస్‌గఢ్‌లోనూ కొత్తవారికి అవకాశం దక్కొచ్చు అంటున్నారు. మోడీ లాగా మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాజస్థాన్‌లో వసుంధరా రాజే, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌లు మూడు సార్లు సీఎంగా పనిచేశారు. ప్రధాని పార్టీని పటిష్ఠం చేస్తూనే రాజకీయంగా పార్టీలో తనకు ప్రత్యామ్నాయంగా ఎవరూ లేకుండా చూసుకుంటున్నారనే విమర్శ ఉన్నది. అందుకే మోడీ ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్‌ బగేల్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి రమణ్‌సింగ్‌ పేరు ప్రస్తావించకుండా ప్రచారం చేశారు. అక్కడ బీజేపీ 54 సీట్లు గెలిచింది.


మరోసారి రమణ్‌సింగ్‌కు అవకాశం దక్కకుంటే ఓబీసీనిగాని, గిరిజన నేతను గానీ ఎన్నుకునే అవకాశం ఉన్నది. సీఎం సీటు ఆశిస్తున్న ఆశావహుల్లో విష్ణు దేవ్‌, రేణుకాసింగ్‌, రాంవిచార్‌ నేతమ్‌, లతా ఉసెండీ, గోమతి సాయి, అరుణ్‌సావో, ఓపీ చౌధరీ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీ సాధించినా లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి 11 స్థానాల్లో 9 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకున్నది. ఈసారి అక్కడ స్వీప్‌ చేయాలన్నది ఆపార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది.


రాజస్థాన్‌లో


మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కొత్త వారిని సీఎంగా ఎంపిక చేసినా రాజస్థాన్‌లో మాత్రం వసుంధ రాజెను కాదనే పరిస్థితి కమలనాథులకు కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఆమెకు ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ వసుంధర లేకుండా ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని భావించిన బీజేపీ అధిష్ఠానం రాజెతో రాజీపడింది. ఆమె సూచించిన దాదాపు 50 మంది అభ్యర్థులకే టికెట్లు ఇచ్చింది.


ఇక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఆపార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. గజేంద్ర షెకావత్‌, దియాకుమారి, మహంత్‌ బాలక్‌నాథ్‌ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ వసుంధ రాజె తన మద్దతు దారులతో బల ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఇంటికి 45 మంది ఎమ్మెల్యే వెళ్లి వచ్చారు. తమకు 75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వారు చెబుతున్నారు.


వసుంధర కూడా ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ ఎన్నికల్లో దెబ్బతినకుండా అప్పటివరకు ఆమెను ముందుపెట్టిన పార్టీ పెద్దలు ఈసారి కొత్తవారికే సీఎంగా అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. అదే జరిగితే తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో పార్టీని చీల్చి కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారేమోనన్న అనుమానం బీజేపీ అధిష్ఠానంలో ఉన్నది.


కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ కూడా ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నారని, ఆయన ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. సోమవారం నాటికి సీఎం ఎవరు స్పష్టత రావొచ్చు. గత లోక్‌సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను బీజేపీ 24 గెలిచింది. ఈసారి కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లను బీజేపీ అధిష్ఠానం ఆశిస్తున్నది.


మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. కానీ సీఎం అభ్యర్థుల ఎంపిక ఆపార్టీకి కత్తిమీద సాములా మారింది. మూడు రాష్ట్రాల్లో కొత్త వారిని ఎంపిక చేసినా సీఎం సీటు ఆశిస్తున్న ఆ పార్టీ మాజీ సీఎంలు ఎలాంటి వైఖరి తీసుకుంటారు? లోక్ సభ ఎన్నికల్లో వాళ్లు ఎలా వ్యవహరిస్తారు? అన్నది చూడాలి.


ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీలోని నేత మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చిన కాషాయపార్టీలోనూ అవే పరిస్థితులు కనిపిస్తుండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఏం జరగకున్నా భవిష్యత్తులో ఈ మూడు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest News