ఎదురీదుతున్న సిటింగ్‌లు.. బరిలో ఎన్నికల ఉద్దండులు

  • Publish Date - November 28, 2023 / 12:19 PM IST
  • ఏడవసారి పోటీలో నేతలు
  • మెజారిటీ మూడవసారి పరీక్ష
  • ఎక్కువ మందికి ఎన్నికల అనుభవం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల బరిలో నిలిచిన సిటింగ్ ఎమ్మెల్యేలు విజయం కోసం ఎదురీదుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది రెండవసారి నుంచి ఏడవసారి బరిలో నిలవడం గమనార్హం. వీరిలో ఒక్కరు మినహా 11 మంది బీఆర్ఎస్ కు చెందిన వారు కావడం గుర్తించాల్సిన అంశం. ఎన్నికల అనుభవంతో పండిపోయిన తలలు కూడా ఇందులో ఎక్కువగానే ఉన్నాయి.


ఏడవసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఎక్కవమంది మూడవసారి సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీలో నిలిచి గెలుపు కోసం తండ్లాడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పర్సనల్ వ్యతిరేకత, వరుసగా ఎమ్మెల్యేలుగా కొనసాగడంతో పాటు, గతంలో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించడం కలగలిసి విజయం కోసం సర్వశక్తులొడ్డడమే కాకుండా తీవ్రంగా చెమటోడుస్తున్నారు.


– ఎన్నికల అనుభవం ఎక్కువే


ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గతంలో చాలామంది నాయకులు పలుమార్లు పోటీచేసి గెలుపోటములు చవిచూసినప్పటికీ, ఈఎన్నికల్లో పోటీపడుతున్న వారిలో ఆరుపర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలుపొంది, ఏడవసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారితోపాటు తొలిసారి పోటీలో నిలిచిన వారున్నారు.



గత ఎన్నికల్లో తొలిసారి గెలిచి, రెండవసారి పోటీచేస్తూ ప్రభుత్వ, పర్సనల్ వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా, మూడవసారి ముచ్చట తీర్చుకుందామనుకుంటున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరంతా ఈఎన్నికల్లో విజయం కోసం ఎదురీదుతున్నారు. గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతుండగా, తొలిసారి పోటీకి అవకాశం వచ్చిన అభ్యర్థులు సైతం చెమటోడుస్తున్నారు.


– పోటీలో తలపండిన నేతలు


పోటీలోనూ, విజయంలోనూ ఈనలుగురు నాయకులు తలపండిపోయారు. గెలుపోటములు చవిచూశారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముగ్గురు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ నుంచి డీఎస్ రెడ్యానాయక్ ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఏడవసారి ఎమ్మెల్యేలుగా పోటీపడుతున్నారు.

ఇందులో దయాకర్రావు మూడు పర్యాయాలు వర్ధన్నపేట నుంచి, మూడుసార్లు పాలకుర్తి నుంచి వరుసగా గెలుపొందడం విశేషం. మరోసారి పాలకుర్తి నుంచి బరిలో ఉన్నారు. రెడ్యా మాత్రం ఇప్పటివరకు నియోజకవర్గం మార్చకుండా డోర్నకల్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.


ఈఇద్దరిలో దయాకర్ రావు గతంలో టీడీపీ నుంచి, రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎర్రబెల్లి దయాకర్రావు లోక్ సభ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి వరంగల్ ఎంపీగా కూడా పోటీచేసి గెలుపొందారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీచేస్తున్న కడియం శ్రీహరి గతంలో ఐదుసార్లు పోటీచేశారు. ప్రస్తుతం ఆరవసారి బరిలో నిలిచారు.


ఇందులో ఒకసారి ఉప ఎన్నికల్లో పోటీచేశారు. గతంలో టీడీపీ నుంచి, ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. మధ్యలోనే రాజీనామా చేశారు. ప్రస్తుతం రెండవ పర్యాయం ఎమ్మెల్సీగా ఉన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గుండె విజయరామారావు సైతం ఆరవసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.


వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆరవసారి పోటీపడుతున్నారు. వీరిద్దరి ఖాతాలో ఉప ఎన్నిక కూడా ఉంది. వినయ్ చీఫ్ విప్ గా ఉండగా, ఎర్రబెల్లి, రెడ్యానాయక్, కడియం, విజయరామారావు మంత్రులుగా పనిచేశారు. విజయరామారావు మినహా ముగ్గురు నాయకులు వరుసగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు దీర్ఘకాలికంగా ఎమ్మెల్యేలుగా ఉన్నందున వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు.


పోటీలో ఉన్న వారిలో ముగ్గురు విప్ లుగా పనిచేసిన అనుభవం ఉన్నది. భూపాలపల్లి నుంచి రెండు పర్యాయాలు గెలిచి, మూడవ పర్యాయం గెలిచేందుకు యత్నిస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ హయాంలో, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి టీడీపీ హయాంలో, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ హయాంలో విప్ లుగా పనిచేశారు. వెంకటరమణారెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు.


– మూడవసారి పోటీ పరీక్ష


రెండో పర్యాయం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఆరుగురు ఉన్నారు. ములుగు నుంచి గెలిచిన సీతక్క, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి రెండోసారి గెలిచారు. వీరిలో సీతక్క, గండ్ర మధ్యలో ఓటమిపాలుకాగా, ముత్తిరెడ్డి మినహా మిగిలిన వారంతా మూడవసారి పోటీలో ఉన్నారు.


ఇందులో విచిత్రమేమిటంటే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లిలో ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో అక్కడ పదేండ్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా మారింది. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ పక్షాన కడియం తొలిసారి పోటీచేస్తున్నప్పటికీ, గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ రాజయ్య ప్రాతినిధ్యం వహించారనేది గమనార్హం.


– రెండవ సారి పోటీలో నిలిచి


నర్సంపేట నుంచి గెలుపొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ తూర్పు నుంచి గెలుపొందిన నన్నపునేని నరేందర్ ఎమ్మెల్యేలుగా రెండవసారి పోటీలో ఉన్నారు. ములుగు నుంచి సీతక్క గత ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. ఇందులో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న నన్నపునేని నరేందర్ గతంలో వరంగల్ నగర మేయర్ గా పనిచేశారు. వెంటనే ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఇదిలాఉండగా నరేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పులో 2014లో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించిన విషయం విస్మరించలేనిది.


 


అందుకే నరేందర్ కు మేయర్ గా చేయలేని పనులు, ఈదఫా ఎమ్మెల్యేగా పూర్తిచేయలేని అంశాలు, గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు. ఇక ఒక్క ములుగులో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి తొలిసారి పోటీచేస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, జడ్పీ ఇంచార్జ్ చైర్మన్ గా ఆమెకు కూడా వ్యతిరేకత తప్పడంలేదు. సిటింగ్ ఎమ్మెల్యేగా సీతక్క కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో కొంత సానుభూతి ఉంది.


– స్థానిక సంస్థల్లో గెలిచిన అనుభవం


పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో స్థానిక సంస్థల్లో గ్రామ సర్పంచ్, కార్పొరేటర్, జడ్పీటీసీలుగా ఎన్నికై ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, ప్రస్తుతం పోటీ చేస్తున్నవారున్నారు. వారిలో రెడ్యా నాయక్, వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బడే నాగజ్యోతి, భూక్యా సంగీత, దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణ తదితరులు ఉన్నారు. రెడ్యా సర్పంచ్, సమితి ప్రసిడెంట్, ఎంపీపీగా పనిచేయడం విశేషం. ఎర్రబెల్లి డీసీసీబీ చైర్మన్ గా, దొంతి పీఎసీఎస్ చైర్మన్ పనిచేశారు.