కొత్త ప్ర‌భుత్వంపై కోటి ఆశ‌లు

కొలువుదీరుతున్న కొత్త ప్ర‌భుత్వంపై రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు కోటి ఆశ‌లు పెట్టుకున్నారు

  • Publish Date - December 7, 2023 / 03:29 AM IST

  • సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల ఆశాభావం
  • మొద‌టి తారీకున జీతాలొస్తాయ‌న్న ధీమా
  • ఇన్నాళ్లూ బాసిన‌లుగా బ‌తికాం
  • ఇప్పుడు స్వేచ్ఛ లభించినట్టయింది
  • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో
  • మాట్లాడే హక్కూ కోల్పోయాం
  • పాలాభిషేకాలకే యూనియన్లు పరిమితం
  • తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు


విధాత‌, హైద‌రాబాద్‌: కొలువుదీరుతున్న కొత్త ప్ర‌భుత్వంపై రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు కోటి ఆశ‌లు పెట్టుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో త‌మ‌కు మాట్లాడే హ‌క్కు కూడా కోల్పోయామ‌న్న భావ‌న‌లో ఉన్న ఉద్యోగ సంఘాల నేత‌లు మొద‌టి సారిగా త‌మకు బానిస‌త్వం నుంచి విముక్తి ల‌భించింద‌ని ప్ర‌క‌టించారు. తాము ఇక నుంచి వాట్సాప్ కాల్స్‌లో కాకుండా నిర్భ‌యంగా ఫోన్‌లో మాట్లాడుకునే అవ‌కాశం క‌లిగింద‌ని ప్ర‌క‌టించారు.


వీట‌న్నింటి క‌న్నా తాము ఆత్మ‌గౌర‌వంతో బ‌తుకుతామ‌న్న భ‌రోసా వ‌చ్చింద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు మీడియా స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ ప్ర‌క‌టించారు. అలాగే మొద‌టి తారీకున త‌మ‌కు జీతాలు వ‌స్తాయ‌న్న భ‌రోసా వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ రాష్ట్రం మొద‌లుకొని ఉమ్మ‌డి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌, టీడీపీ ప్ర‌భుత్వాలు వేత‌నాల‌ను మొద‌టి తారీకునే ఇచ్చేవారని గుర్తు చేశారు. ఇప్పుడు కొలువుదీరే కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై త‌మ‌కు ఆ న‌మ్మకం ఏర్ప‌డింద‌ని బ‌హాటంగానే చెబుతున్నారు.


స్వేచ్ఛ‌గా ఉంటాం


ఇప్ప‌టి వ‌రకు బానిస‌లుగా బ‌తికామ‌ని, త‌మ‌కు డీఏలు ఇవ్వాల‌ని కూడా అడ‌గ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పైగా తాము ఏదైనా డిమాండ్ చేస్తే వెంట‌నే తాము అలా మాట్లాడ‌లేద‌ని త‌మ చేత‌నే కౌంట‌ర్ ఇప్పించేవార‌న్నారు. ఇలాంటి దుస్థితి ఉమ్మ‌డి రాష్ట్రంలో కూడా త‌మ‌కు రాలేద‌ని వాపోయారు. పైగా అయిన దానికి కానిదానికి పాలాభిషేకం చేయ‌డం కోసం తాము పాల‌పాకెట్లు వెంట బెట్టుకొని తిరిగే వాళ్ల‌మ‌ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ల అధ్యాపక సంఘం అధ్య‌క్షులు మ‌ధుసూదన్‌రెడ్డి తెలిపారు. తాము ఏ ప్ర‌భుత్వానికీ వ్య‌తిరేకం కాద‌ని స్పష్టం చేశారు. ‘ఉద్యోగులు ప‌నిచేస్తారు.. జీతాలు అడుగుతారు.


కానీ ప్ర‌భుత్వాలు కూల్చ‌లేరు క‌దా? ఎందుకు మా ఫోన్ల‌ను కూడా ట్యాప్ చేశారు?’ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాము ఏదైనా మాట్లాడుకోవాల్సి వ‌స్తే వాట్సాప్ కాల్‌లో మాట్లాడుకునే వాళ్ల‌మ‌న్నారు. చివ‌ర‌కు ప్ర‌శ్నిస్తార‌ని భావించిన నేత‌ల‌పై కూడా కేసులు పెట్టార‌న్నారు. శ్రీ‌నివాస‌రావు అనే ఉద్యోగ సంఘం నాయ‌కుడు మాట్లాడుతూ త‌న‌పై 40కి పైగా కేసులు పెట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉద్యోగ సంఘం నాయ‌కుడిగా త‌మ‌కు కావాల్సింది అడ‌గ‌డ‌మే త‌ప్పా? అని ప్రశ్నించారు. క‌నీసం డీఏలు కూడా ఇవ్వ‌లేద‌న్నారు. పైగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ లేని విధంగా ఇక్క‌డ జీతాలు ఇస్తున్నామ‌ని గొప్ప‌లు పోయార‌ని, ప‌క్క రాష్ట్రం కంటే త‌మ‌కు త‌క్కువ‌గా వేత‌నాలున్నాయ‌ని తెలిపారు. ఈ ప్ర‌భుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛగా ఉంటార‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.


క‌లెక్ట‌ర్లుచేసే త‌ప్పుల‌కు తాసీల్దార్ల‌ను బాధ్యుల‌ను చేశారు


రెవెన్యూ ఉద్యోగుల ప‌రిస్థితి దారుణ‌మ‌ని తాసీల్దార్ల సంఘం వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు వీ ల‌చ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌పై సీఎం హోదాలో నేరుగా కేసీఆరే దాడి చేశార‌ని, ఫ‌లితంగా రెవెన్యూ ఉద్యోగులంతా బ‌ద‌నాం అయ్యర‌న్నారు. దాని ప‌ర్యావ‌సానంగానే ప‌లుచోట్ల తాసీల్దార్ల‌పై దాడులు జ‌రిగాయ‌ని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ తాసీల్దార్‌పై పెట్రోల్ పోసి చంప‌డం ఇందులో భాగంగానే చూడాల‌న్నారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో ఇప్ప‌డు క్షేత్రస్థాయిలో ప‌ర్య‌వేక్షించే సిబ్బంది అధికారి లేడ‌ని, తాసీల్దార్ల‌కు ఎలాంటి అధికారాలు లేవ‌ని చెప్పారు.


అయితే ఈ ధ‌ర‌ణిలో క‌లెక్ట‌ర్ తంబ్ పెడితే తాసీల్దార్ సంత‌కం వ‌స్తుందని, ఇదెక్క‌డి ప‌ద్ధతని అన్నారు. తాసీల్దారు త‌న‌కు సంబంధం లేకుండానే క‌లెక్ట‌ర్ వ‌ద్ద జ‌రిగే తప్పిదాలకు బాధ్య‌త వ‌హించే దుర్గ‌తి ఏర్ప‌డింద‌న్నారు. ధ‌ర‌ణిలో అనేక త‌ప్పులు జ‌రిగాయ‌ని, అవ‌న్నీ స‌రి చేసే వ్య‌వ‌స్థ కొత్త ప్ర‌భుత్వంలో వ‌స్తుంద‌న్న ఆశ ఉంద‌ని ల‌చ్చిరెడ్డి తెలిపారు. ఒక రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయ‌కుడు మాట్లాడుతూ త‌మ‌కు నోరు విప్పే స్వేచ్ఛ ఎక్క‌డ ఉంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల‌ను ప్ర‌జ‌ల‌కు శ‌త్రువులుగా చూపించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారుల‌కు చార్ట్ ప్ర‌కారం ఉండాల్సిన విధులు, అధికారాలు వ‌స్తాయ‌న్న ఆశాభావం త‌మ‌కు ఉంద‌న్న న‌మ్మకం వ్య‌క్తం చేస్తున్నారు.


మాకు స్వేచ్ఛ వచ్చింది


స‌చివాల‌య ఉద్యోగులు త‌మ‌కు స్వేచ్ఛ వ‌చ్చిందంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షులు కోదండ‌రామ్‌ను స‌చివాల‌య ఉద్యోగులు ఆహ్వానించి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇక నుంచి త‌మకు భావ ప్రకటనా స్వచ్ఛ లభించిందని చెప్పారు. ఈ సంద‌ర్భంగా కోదండ‌రామ్ మాట్లాడుతూ ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. మీ స‌మ‌స్య‌ల‌న్నీ ఈ ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించే విధంగా ప్ర‌య‌త్నం చేస్తాన‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆగిన ప‌దోన్న‌తులు, 317 జీవో ఇబ్బందులు, ఆగిన డీఏలు, పీఆర్‌సీ త‌దిత‌ర విష‌యాల‌న్ని స‌చివాల‌య ఉద్యోగులు కోదండ‌రామ్‌కు తెలియ‌జేశారు.


విధాత ePaper కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest News