అలాంటి అతిథి వ‌స్తే.. భూమిపై జీవం అంత‌రించిపోవ‌డం ఖాయం !

అంత‌రిక్షంలో ఏ గ్ర‌హ‌వ్య‌వ‌స్థ‌లోనూ ఉండ‌కుండా.. ఆవారాగా తిరిగే న‌క్ష‌త్రం ఏదైనా మ‌న సౌర కుటుంబంలోకి వ‌స్తే జ‌రిగే ప‌రిణామాల‌పై శాస్త్రవేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు

  • Publish Date - November 30, 2023 / 09:32 AM IST

విధాత‌: అంత‌రిక్షం (Space) లో ఏ గ్ర‌హ‌వ్య‌వ‌స్థ‌లోనూ ఉండ‌కుండా.. ఆవారాగా తిరిగే న‌క్ష‌త్రం ఏదైనా మ‌న సౌర కుటుంబంలోకి వ‌స్తే జ‌రిగే ప‌రిణామాల‌పై శాస్త్రవేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఇలాంటి న‌క్ష‌త్రాల‌ను రోగ్ స్టార్స్ (Rogue Star) అని పిలుస్తారు. ఈ అంశంపై ఎన్ రేమండ్, నాథ‌న్‌, కైబ్‌, ఫ్రాంక్ సెల్సిస్‌, హార్వే బాయ్‌లు ప‌రిశోధ‌న‌లు చేయ‌గా..అవి ఏఆర్ఎక్స్ఐవీ. ఓఆర్‌జీలో ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఆ వివ‌రాల ప్ర‌కారం.. ఒక వేళ అలాంటి ఆవారా తిరిగే న‌క్ష‌త్రం ఏదైనా మ‌న సౌర‌కుటుంబంలోకి వ‌స్తే.. భూమి గ‌తి త‌ప్పుతుంద‌ని త‌ద్వారా జీవం తుడిచిపెట్టుకుపోతుంద‌ని వెల్ల‌డైంది.


త‌న గెలాక్సీలో ఏ సూర్యుడి గురుత్వాక‌ర్ష‌ణ ప‌రిధిలో లేకుండా ప‌క్క గెలాక్సీలలోకి ప్ర‌వేశించాల‌ని ప్ర‌య‌త్నించే న‌క్ష‌త్రాల‌ను రోగ్ స్టార్స్ (ఆవారా న‌క్ష‌త్రాలు) అని పిలుస్తార‌ని అధ్య‌య‌న క‌ర్త రేమండ్ పేర్కొన్నారు. అరుదుగానే అయిన‌ప్ప‌టికీ.. ఇవి కొన్ని మ‌న సౌర‌కుటుంబం లాంటి గ్ర‌హ మండ‌లాల్లోకి ప్ర‌వేశించి.. అవి చెల్లాచెదురు కావ‌డానికి కార‌ణ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు. ఒక వేళ అలాంటి ప‌రిస్థితే మ‌న‌కు వ‌స్తే ఎలా ఉంటుంద‌నే దానిపై కంప్యూట‌ర్ మోడ‌ల్స్ ఉప‌యోగించి అంచ‌నాల‌ను రూపొందించామ‌ని ఆయ‌న అన్నారు.


ఇందులో భాగంగా ఒక మాదిరి ప‌రిన‌మాణంలో ఉన్న న‌క్ష‌త్రం సూర్యుడికి 10 ఆస్ట్ర‌నామిక‌ల్ యూనిట్ల దూరం నుంచి వెళుతోంద‌ని భావిస్తే.. మ‌న సౌర‌కుటుంబంలోని ఎనిమిది గ్ర‌హాలు వాటి క‌క్ష్య‌ల్లోనే కొన‌సాగ‌డానికి 92 శాతం అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ క‌క్ష్య మారినా అది ఏమంత ప్ర‌మాద‌క‌రం కాదని తెలిపారు. అన్ని గ్ర‌హాల్లోనూ అత్యంత దారుణంగా ప్ర‌భావిత‌మ‌య్యేది బుధ గ్ర‌హ‌మేన‌ని.. ఇది నేరుగా సూర్యుణ్ని ఢీకొట్టి అంత‌ర్థానమైపోతుంద‌ని అధ్య‌య‌న‌క‌ర్త‌లు చెబుతున్నారు.


భూమికి ఏమవుతంది?


ఒక వేళ ఆవారా న‌క్ష‌త్రం క‌నుక మ‌న వైపు వ‌స్తే.. భూమి చంద్రుణ్ని ఢీకొట్ట‌డానికే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. ఒక వేళ అలా జ‌ర‌గ‌క‌పోతే.. మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన న‌క్ష‌త్రం తాలూకు గురుత్వాక‌ర్ష‌ణ ప్ర‌భావానికి లోనై దాని చుట్టూ తిర‌గ‌డం ప్రారంభిస్తుంద‌ని ఊహిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది జ‌రిగినా .. భూమి ఇప్పుడున్న క‌క్ష్య మార‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. త‌ద్వారా జీవం అంతరించిపోవ‌డం కూడా ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డంతోనే ఈ అంతం ప్రారంభ‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించారు. అయితే ఇలాంటి రోగ్ స్టార్స్ మ‌న స‌మీపంలో ప్ర‌స్తుతానికి లేవ‌ని.. ఇలా జ‌ర‌గడానికి కూడా అవ‌కాశాలు చాలా స్వ‌ల్ప‌మ‌ని అధ్య‌య‌న‌క‌ర్త‌లు వెల్ల‌డించారు.

Latest News