చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

  • Publish Date - October 3, 2023 / 01:04 PM IST
  • అంగళ్ల కేసులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ
  • లోకేశ్‌ సీఐడీ విచారణ కేసు 10కి వాయిదా


విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా తనపై కేసు పెట్టారని, ఈ కేసును కొట్టేయాలని బాబు క్వాష్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు తరుపునా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, అభిషేక్‌ సింఘ్వీ, సిద్ధార్ద లూథ్రాలు తమ వాదనలు వినిపించారు.


సీఐడీ తరుపునా సుప్రీం సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. బాబు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతికార చర్యలు నివారించడానిక సెక్షన్‌ 17ఏ తీసుకొచ్చారని, ఈ కేసులో ఆ సెక్షన్‌ వర్తిస్తుందా లేదా అన్నదే ప్రధానమన్నారు. ఆరోపణల కంటే కేసు నమోదు, విచారణ ఇందులో ప్రధానంశంగా ఉందన్నారు. అధికార నిర్ణయంలో భాగంగా కేబినెట్‌ తీసుకునే నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కారని, అధికారిక నిర్ణయాలపై ప్రతికార చర్యల నుంచి 17ఏ రక్షణ కల్పిస్తుందని, యశ్వంత్‌ సిన్హా కేసు తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని వాదించారు.


సీఐడీ న్యాయవాది రోహత్గీ ఈ కేసులో 2018లో చట్టసవరణ వచ్చిందని, 2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, 2017లోనే కేసు మూలాలు ఉన్నందునా 17ఏ వర్తించదన్నారు. ఇందుకు ఆధారాలు, పత్రాలు ఏమైన ఉన్నాయా అని జస్టిస్‌ అనిరుద్ద బోస్‌ ప్రశ్నించారు. రోహత్గీ బదులిస్తూ 10శాతం ప్రభుత్వ సంస్థ, 90శాతం ప్రైవేటు సంస్థ పేరుతో వందల కోట్ల దుర్వినియోగం జరగిందన్నారు. కేసు మెరిట్స్‌లోకి వెళ్లవద్దంటు జడ్జీ సూచించగా, పిటిషనర్‌ కౌంటర్‌ కూడా వేయలేదని రోహిత్గీ కోర్టుకు వివరించారు.


ఈ దశలో బాబు న్యాయవాది లూథ్రా స్పందిస్తూ తాము అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించామన్నారు. ప్రతిగా తమకు డాక్యుమెంట్లు సమర్పించేందుకు సమయం కావాలని రోహిత్గీ కోరారు. బెయిల్‌ కోసం వెళ్లకుండా క్వాష్‌ పిటిషన్‌పై వాదిస్తున్నారని, అఫిడవిట్‌ వేసేందుకు సమయం కావాలని అభ్యర్ధించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


రింగ్‌ రోడ్డు కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిపోగా, కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

అంగళ్లు కేసులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ


అంగళ్లు అల్లర్ల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు టీడీపీ నేతలకు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు సమర్ధించింది. బెయిల్‌ రద్ధు చేయాలన్న ఏపీ ప్రభుత్వ వాదనను నిరాకరించిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్లను కొట్టివేసింది. ఈ కేసులో భద్రత కల్పించాల్సిన పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, వారే సాక్షులుగా ఉంటారా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వం ఈ కేసులో దాఖలు చేసి మొత్తం ఆరు పిటిషన్లను కొట్టివేసింది.


లోకేశ్‌ సీఐడీ విచారణ 10కి వాయిదా


ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సీఐడీ విచారణను ఆక్టోబర్‌ 10కి వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 41ఏ కింద నోటీస్‌లు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ లోకేశ్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న పిదప ఈ నెల 10వ తేదీన లోకేశ్‌ సీఐడీ విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు బుధవారం రావాలని లోకేశ్‌కు సీఐడీ నోటీస్‌లివ్వగా, కోర్టు ఆదేశాలతో లోకేశ్‌కు స్వల్ప ఊరట దక్కింది.