ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు రాజ్యాంగ‌బ‌ద్ధ‌మే!

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టిక‌ల్ 370 రద్దు రాజ్యాంగ బ‌ద్ధ‌మేన‌ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది

  • Publish Date - December 11, 2023 / 08:51 AM IST

  • రాష్ట్ర‌ప‌తి ప్ర‌క‌ట‌న‌పై జోక్యం చేసుకోలేం
  • జ‌మ్ముక‌శ్మీర్‌లో రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌ర‌ణ‌కు
  • కేంద్ర ప్ర‌భుత్వం వీలైనంత త్వ‌ర‌గా కృషిచేయాలి
  • సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌పాలి
  • కీల‌క తీర్పు వెలువరించిన ఐదుగురు స‌భ్యుల
  • సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం


విధాత‌: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టిక‌ల్ 370 రద్దు రాజ్యాంగ బ‌ద్ధ‌మేన‌ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జ‌మ్ముక‌శ్మీర్ అంశంలో రాష్ట్ర‌ప‌తి ప్ర‌క‌ట‌న‌పై తాము జోక్యం చేసుకోలేమ‌ని స్ప‌ష్టంచేసింది. ఆర్టిక‌ల్ 370 నిబంధ‌న తాత్కాలిక‌మేన‌ని, శాశ్వ‌తం కాద‌ని పేర్కొన్న‌ది. ఆ ఆర్టిక‌ల్ రద్దును స‌మ‌ర్థించింది. జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్ర‌క్రియ వీలైనంత త్వరగా జ‌ర‌గాల‌ని పేర్కొన్న‌ది.


2024 సెప్టెంబర్ 30లోగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘంగా విచార‌ణ జ‌రిపిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నం.. సోమ‌వారం కీల‌క తీర్పు వెలువ‌రించింది.


రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్‌ 370ని కేంద్రం ర‌ద్దు చేసింద‌ని స‌మ‌ర్థించింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్‌కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో జమ్ముక‌శ్మీర్‌ సమానమేన‌ని స్పష్టం చేసింది. అర్టిక‌ల్ 1, 370 ప్ర‌కారం జ‌మ్ముక‌శ్మీర్ భార‌త‌దేశంలో అంత‌ర్భాగ‌మేన‌ని తెలిపింది. ఆర్టికల్‌ 370 రద్దు వెనుక ఎటువంటి దురుద్దేశం కనిపించడం లేదని తెలిపింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొనే ప్ర‌తీ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేయ‌డం స‌రికాద‌ని సూచించింది.


జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం జ‌మ్ముక‌శ్మీర్‌ను రెండు కేంద్రపాలిత (జమ్ము-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ జ‌మ్ముక‌శ్మీర్‌కు చెందిన ప‌లువురు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖలు చేశారు. వీటిపై ఈ ఏడాది ఆగ‌స్టు 2 నుంచి సుదీర్ఘంగా విచార‌ణ జ‌రిపిన రాజ్యాంగ ధ‌ర్మాస‌నం.. సెప్టెంబ‌ర్ 5న త‌న తీర్పును రిజ‌ర్వు చేసింది. సోమ‌వారం నాడు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌మ‌ర్థిస్తూ కీల‌క తీర్పు వెలువ‌రించింది.

Latest News