Telangana | రేపటి నుంచి నామినేషన్ల పర్వం.. పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ షురూ!

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంతోపాటు ఏపీలో కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగనున్నాయి

  • Publish Date - April 16, 2024 / 08:40 PM IST

ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
మే 13న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌
జూన్ 4న ఎన్నికల కౌంటింగ్
పెరుగనున్న పొలిటికల్ హీట్
బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల ఖరారు
కాంగ్రెస్ మూడు స్థానాలు పెండింగ్

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంతోపాటు ఏపీలో కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశమంతటా పొలిటికల్ హీట్ పెరిగింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిపి మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. గత నెల ఏప్రిల్ 19న ప్రారంభమైన ఈ ఎన్నికల ప్రక్రియ జూన్1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి. రాష్ట్రంతోపాటు ఏపీలో మే 13న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్‌ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. దీని కోసం తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్ సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. నామినేషన్లు స్వీకరించే సెంటర్ల వద్ద ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నేతృత్వంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. స్థానిక పోలీసు అధికారులు అవసరమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. నామినేషన్ల స్వీకరణ సెంటర్ వద్ద బారికేడ్ల ఏర్పాటు, మీడియా పాయింట్, నిబంధనలు పాటించే విధంగా 100 దూరం ఉండే విధంగా సూచనలు, సీసీ కెమెరాలు, వీడియాగ్రాఫింగ్ తదితర అంశాలపై శ్రద్ధ తీసుకుంటున్నారు.

బీఆరెస్, బీజేపీ,ఎంఐఎం అభ్యర్థుల ప్రకటన

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ మినహా బీఆరెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. త్వరలో బీఫామ్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో మాత్రం బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అలాంటి మార్పులు చేసే అవకాశం పెద్దగా లేదు. బీఆరెస్, బీజేపీ 17 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పార్లమెంటరీ స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాల నిర్వహణలో నిమగ్నమయ్యాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మరోసారి ఎంపీగా పోటీచేస్తున్నట్లు ప్రకటించి, ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్ మూడు స్థానాలు పెండింగ్
కాంగ్రెస్ మాత్రం సోమవారం మధ్యాహ్నం నాటికి 14 లోక్‌సభ అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులపై ఏ సమయంలోనైనా ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే జాప్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఆశావహుల పోటీతోపాటు, సామాజిక సమీకరణలు సమస్యగా మారినందునే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతున్నదని కాంగ్రెస్‌ అధిష్ఠాన పెద్దలు చెబుతున్నప్పటికీ.. నాన్చివేత ధోరణి కనిపిస్తున్నదన్న విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ.. అసంతృప్తులను ఒప్పించిన తర్వాతే పేర్ల ప్రకటన ఉంటుందని సమాచారం. ఏమైనా నామినేషన్ల తేదీలు దగ్గరపడినందున నేడో రేపో పేర్లు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది.

పెరిగిన పొలిటికల్ హీట్
ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుని యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం తమ ప్రచారాన్ని తీవ్రం చేశాయి. కార్యకర్తల సమావేశాలు కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ప్రకటనకు ముందే ప్రధాని మోదీ అభివృద్ధి పనుల పేరుతో తెలంగాణలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. కాంగ్రెస్, బీఆరెస్ సైతం సభలు నిర్వహించారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలను కాంగ్రెస్, బీఆరెస్ ప్రారంభించగా, బీజేపీ ఇంకా సభలు ప్రారంభించలేదు. కానీ, అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నేటి వరకు మూడు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో వ్యక్తిగతంగా దూషణల పర్వం సాగుతోంది. మధ్యలో ఎంఐఎం తోడైతోంది. మొత్తంగా నామినేషన్లకు ముందే రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. నామినేషన్ల తర్వాత మరింత ఈ హీట్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ఇదే:
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో షెడ్యూల్ ఒకే విధంగా ఉంది.
ఏప్రిల్‌ 18: నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్‌ 25 : నామినేషన్లకు చివరి రోజు
ఏప్రిల్‌ 26 : నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్‌ 29 : ఉపసంహరణకు గడువు
మే 13 : పోలింగ్‌
జూన్‌ 4 : ఫలితాల వెల్లడి

Latest News