విధాత: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో, ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర యూనివర్సిటీల జాబితాలో గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేర్చుతూ ప్రస్తుత చట్టానికి సవరణ ప్రతిపాదించారు.
ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఈ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాల్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ఇందుకోసం 2009 సెంట్రల్ యూనివర్సిటీల చట్టాన్ని సవరించి అందులో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరును చేర్చుతున్నట్లు వెల్లడించింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాలలో రూ.889.07 కోట్లు ఖర్చు చేస్తుందని బిల్లులో పేర్కోంది.
సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని, గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై పరిశోధనలు చేయడానికి, ఆయా అంశాలలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి ఇది బాటలు వేస్తుందని పేర్కోంది. గిరిజనుల చదువులకు ఊతమివ్వడంతో పాటు కేంద్ర విశ్వవిద్యాలయాలు చేసే ఇతర కార్యకలాపాలనూ ఈ వర్సిటీ నిర్వహిస్తుందని తెలిపింది.