మీకు పింఛనా?.. మాకు కొలువా?

నిధులు, నీళ్లు, నియా­మ­కాలు అనే ట్యాగ్‌­లైన్‌ నినా­దా­లతో సాగిన ప్రత్యేక తెలం­గాణ రాష్ట్ర సాధన ఉద్య­మంలో నిరు­ద్యో­గులు, విద్యా­ర్థుల పాత్ర ఎన­లే­నిది.

  • Publish Date - November 23, 2023 / 01:22 PM IST
  • మాకు ఉద్యో­గా­లొస్తే నాలి­గిం­తల పింఛన్‌ మేమే ఇస్తం
  • పింఛ­న్‌కు ఆశ­పడి.. ఓట్లే­య­కండి
  • మాకు జీతాలు ఇవ్వాల్సి వస్తుం­దని
  • మీకు పెన్ష­న్లతో సరి­పె­డు­తు­న్నారు
  • వృద్ధు­లకు వివ­రి­స్తున్న యువత
  • పార్టీల పింఛన్‌ ఓట్ల ఆశ­లపై నీళ్లు
  • ఎన్ని­కల వేళ హడా­వుడి నోటి­ఫి­కే­షన్లు
  • పరీ­క్షల నిర్వ­హ­ణ­లోనూ అవ­క­త­వ­కలు
  • తప్పలు తడ­కగా మారిన టీఎ­స్‌­పీ­ఎస్సీ
  • కసి­మీ­దున్న నిరు­ద్యో­గులు, యువత



విధాత ప్రతి­నిధి ఉమ్మడి ఆది­లా­బాద్‌: నిధులు, నీళ్లు, నియా­మ­కాలు అనే ట్యాగ్‌­లైన్‌ నినా­దా­లతో సాగిన ప్రత్యేక తెలం­గాణ రాష్ట్ర సాధన ఉద్య­మంలో నిరు­ద్యో­గులు, విద్యా­ర్థుల పాత్ర ఎన­లే­నిది. ఆమ­రణ నిరా­హార దీక్షకు దిగిన సమ­యంలో అప్పటి ఉద్యమ నేత కేసీ­ఆర్‌ ఖమ్మం దవా­ఖా­నలో పండ్ల­రసం తీసు­కుని దీక్ష విర­మిం­చా­రన్న వార్తలు పొక్క­డంతో ఉస్మా­నియా రణ­రం­గ­మైంది.


రాష్ట్రంలో అగ్గి­రా­జు­కు­న్నది. ఒక విధంగా కేసీ­ఆర్‌ నిరా­హార దీక్ష కొన­సా­గిం­చ­డా­నికి విద్యా­ర్థులే కార­ణ­మ­య్యా­రన్న చర్చ అప్పట్లో సాగింది. మొత్తా­నికి కేసీ­ఆర్‌ కొన­సా­గిం­చిన దీక్ష కార­ణంగా డిసెం­బర్‌ 9 ప్రక­టన వెలు­వ­డింది. తదు­పరి కూడా ఆ ప్రక­ట­నను అమలు చేయని క్రమంలో పెల్లు­బి­కిన పోరా­టంలో యువత తమ ఉజ్వల భవి­ష్యత్తు పణంగా పెట్టి, ఒక­వైపు చదు­వు­కుం­టూనే మరో­వైపు తెలం­గాణ ఉద్య­మంలో అలు­పె­రు­గని పోరాటం చేశారు.


రాష్ట్రం సాకా­ర­మైనా.. గత పదేళ్ల పాల­నలో నియా­మ­కాలు మరు­గు­న­ప­డి­పో­వ­డంతో యువత తీవ్ర అసం­తృ­ప్తితో ఉన్నది. దీంతో ఇప్ప­టికే పలు యువ­జన సంఘాలు గ్రామాల్లో తిరు­గుతూ.. తమకు ఉద్యోగం వస్తే 40వేల పైనే జీతం వస్తుం­దని, అందు­లోంచి తామే పది­వేలు ఇచ్చేం­దుకు అవ­కాశం ఉంటుం­దని వివ­రిస్తూ.. పెన్ష­న్‌ల పేరుతో అధి­కార పార్టీ మోసం చేస్తు­న్న­దని వివ­రిస్తూ వృద్ధు­లను చైత­న్యం­పర్చే ప్రయత్నం చేస్తు­న్నారు. తమకు ఉద్యో­గాలు ఇవ్వ­కుండా.. పింఛన్ల రూపంలో కొంత పడేస్తూ మభ్య­పె­డు­తు­న్న­దని వివ­రి­స్తు­న్నారు.


ఆయా కుటుం­బాల్లో ఉంటున్న నిరు­ద్యోగ మను­మలు, మను­మ­రాళ్లు కూడా ఇదే విష­యాన్ని ఇంట్లోని వృద్ధు­లకు వివ­రించి చెబు­తు­న్నారు. పెద్ద ఎత్తున జీతాలు ఇవ్వాల్సి వచ్చే కొలు­వుల అంశాన్ని పక్క­న­ప­డేసి.. కొద్ది­పాటి పెన్షన్‌ విదు­ల్చుతూ ప్రజ­లను ప్రభు­త్వాలు మభ్య­పె­డు­తు­న్నా­యని నచ్చ­జె­బు­తు­న్నారు. వచ్చే ఎన్ని­కల్లో బీఆ­రె­స్‌కు ఓటే­య­బో­మంటూ వారితో ఒట్టు వేయిం­చు­కుం­టు­న్నారు. నెలకో రెండు వేలు చేతికి అందు­తు­న్నా­యని మురి­సి­పోయే వృద్ధులు.. ఆ పేరుతో తమ బిడ్డ­లకు జరు­గు­తున్న అన్యా­యాన్ని గుర్తి­స్తు­న్నారు. తాము ఉద్యో­గాలు ఇచ్చే పార్టీకే ఓటే­స్తా­మని మాటి­స్తు­న్నారు.


గత ఎన్ని­కల్లో పక్క రాష్ట్రంలో జాబు రావా­లంటే.. బాబు రావాలి.. అనే నినా­దంతో టీడీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. తెలం­గా­ణలో మాత్రం బీఆ­రెస్‌ గెలు­పులో వృద్ధాప్య పింఛన్లు కీలక పాత్ర పోషిం­చాయి. తమ నాయ­న­మ్మ­లకు, అమ్మ­మ్మ­లకు, తాత­లకు నాలుగు డబ్బులు వస్తా­యనే ఉద్దే­శంతో తాము ఆ రోజు వ్యతి­రే­కిం­చ­లే­దని పలు­వురు యువ­కులు చెబు­తు­న్నారు. కానీ.. రెండో దఫాలో సైతం నిరు­ద్యో­గుల ఆకాం­క్ష­లను పట్టిం­చు­కో­క­పో­వ­డంతో యువత కసి­మీద ఉన్నట్టు కని­పి­స్తు­న్నది. ఎట్టి­ప­రి­స్థి­తు­ల్లోనూ బీఆ­రె­స్‌కు ఓటు వేయొ­ద్దని తెగేసి చెబు­తు­న్నా­రని సమా­చారం. ‘నీకు బీఆ­రెస్‌ ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ డబ్బులు కావాలా? నాకు ఉద్యోగం రావాలా? నువ్వే ఆలో­చిం­చుకో’ అని ఇంట్లో వృద్ధు­లకు చెబు­తు­న్నా­రని తెలు­స్తు­న్నది. ఉద్యోగం లేక­పో­వడం వల్లే తనకు ఇంత వరకూ పెళ్లి కాలే­దని వివ­రించి చెబు­తు­న్నారు. ఉద్యోగం వస్తే పెళ్లి చేసు­కుం­టా­నని మీకు మాటి­చ్చా­నని ఆ మాట నెర­వే­రా­లంటే ఈ ప్రభుత్వం మారా­ల్సిం­దే­నని నచ్చ­చె­బు­తు­న్నారు. తనకు ఉద్యోగం వస్తే నెలకు 40 నుండి 50 వేల జీతం వస్తుం­దని, తానే అందులో నుంచి ఐదు నుంచి పది­వేలు పంపి­స్తా­నని వృద్ధు­లైన నాయ­నమ్మ, తాత­లకు విడ­మర్చి చెబు­తు­న్నారు. నాకు పెళ్లయి, భార్యా పిల్ల­లతో సుఖ సంతో­షా­లతో ఉండటం ముఖ్యమా? లేక నీకు రెండు­వేల పింఛన్ ముఖ్యమా? ఉద్యోగం లేక నేను పిచ్చి­వా­డిగా తిర­గడం ముఖ్యమా? నువ్వు పెన్ష­న్‌తో బత­కడం ఇష్టమా? అని ప్రశ్ని­స్తు­న్నారు.


ప్రభుత్వం జీతా­లకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తుం­దని కొలు­వులు భర్తీ చేయడం లేదని, అందుకే వృద్ధు­లకు పింఛన్ల వల విసిరి.. వారి ఓట్లతో రెండు దఫా­లుగా గెలుస్తూ వచ్చిం­దని, మూడో­సారి కూడా అదే పన్నా­గంలో ఉన్న­దని వివ­రి­స్తు­న్నారు. బీఆ­రెస్‌ ప్రభుత్వం ఆసరా పింఛన్ల విష­యంలో ఒక దారు­ణ­మైన ప్రచా­రా­నికి దిగిం­దని, పెద్ద కొడుకులా కేసీ­ఆర్‌ పింఛన్‌ ఇస్తున్నాడు అనే వాదాన్ని బలంగా తీసుకెళ్లిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా వృద్ధులు ఇటువంటి ప్రచారాన్ని ఇట్టే నమ్మేస్తారని, తన పెద్ద కొడుకు కేసీఆర్‌ అని భావించి ఓట్లు వేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇటువంటి వారి విషయంలో కూడా నిరుద్యోగులు అప్రమత్తంగా ఉంటున్నట్టు సమాచారం. అటువంటివారితో ఏకంగా ఒట్టు వేయించుకుంటున్నారని గ్రామాల్లో సంభాషణల ద్వారా తెలుస్తున్నది.



కేసీ­ఆర్‌ పిలు­పుతో ఉద్య­మం­లోకి యువత


తెలం­గాణ ఉద్యమ సమ­యంలో కేసీ­ఆర్‌ ఇచ్చిన ఉద్రే­క­పూ­రిత, ఉత్తే­జ­భ­రిత ఉప­న్యా­సా­లతో వేల మంది యువత రాష్ట్ర సాధన సమ­రంలో దూకారు. ఆ క్రమంలో ఆవే­శా­నికి లోనై.. అనే­క­మంది ఆత్మ­హ­త్యలు చేసు­కు­న్నారు. తాము తెలం­గాణ రాష్ట్రాన్ని చూడ­లే­క­పో­యినా తమ చెల్లెళ్లు, తమ్ముళ్లు తెలం­గాణ రాష్ట్రంలో ఉద్యో­గాలు పొంది, ఉన్న­త­మైన స్థానాల్లో ఉంటా­రని ఆశిం­చిన మృత్యు­వును సైతం ముద్దాడు. కానీ.. వారి ఆశ­యా­లను నెర­వే­ర్చ­డంలో ప్రభుత్వం విఫ­ల­మైం­దని నిరు­ద్యో­గులు తీవ్ర ఆగ్ర­హంతో ఉన్నారు.



సీఎం వైఖ­రితో అప­న­మ్మ­కంలో నిరు­ద్యో­గులు


తొలి ఐదే­ళ్లలో అనేక అంశా­లను చక్క­ది­ద్దాల్సి ఉన్న­దని కేసీ­ఆర్‌, ఇతర మంత్రులు చెబు­తున్న మాట­లను విద్యా­ర్థులు, నిరు­ద్యోగ యువత నమ్ముతూ వచ్చారు. రెండో దఫా­లో­నైనా తమ కలలు నెర­వే­రు­తా­యని ఆశించి మళ్లీ బీఆ­రెస్‌ ప్రభు­త్వాన్ని ఎన్ను­కు­న్నారు. కానీ.. రెండో దఫాలో కూడా కొలు­వులు దక్క­క­పోగా.. టీఎ­స్‌­పీ­ఎస్సీ తప్పుల కుప్పగా తయా­ర­వడం, ప్రశ్న పత్రాల లీకేజీ, పరీ­క్షల నిర్వ­హ­ణలో అవ­క­త­వ­కలు, పదే పదే వాయి­దా­లతో యువత విసు­గెత్తి పోయింది.


ఈ సంవ­త్సరం ఎన్ని­కల నోటి­ఫి­కే­షన్ రావ­డా­నికి ఆరు నెలల ముందు ఉద్యోగ నోటి­ఫి­కే­షన్‌ విడు­దల చేయడం ద్వారా యువ­తను, నిరు­ద్యో­గు­లను ఆక­ర్షిం­చ­వ­చ్చని బీఆ­రెస్‌ ప్రభుత్వం ప్రయ­త్నిం­చింది. కానీ.. వాటికి టీఎ­స్పీ­ఎస్సీ నిర్వ­హిం­చిన పరీ­క్షల ప్రశ్న పత్రా­లు­లీక్ కావ­డంతో 30 లక్షల మంది నిరు­ద్యో­గులు హతా­శు­ల­య్యారు. పేపర్ లీకే­జీపై తప్పును గుర్తించి, బాధ్యత తీసు­కో­వా­ల్సింది పోయి.. ఏ రాష్ట్రంలో ఎన్ని­సార్లు ప్రశ్న పత్రాలు లీక్‌ అయ్యాయో చెప్పి తప్పిం­చు­కునే ప్రయత్నం చేశారే తప్పించి.. ఆత్మ విమర్శ చేసు­కో­లేక పోయా­రన్న అభి­ప్రా­యాలు ఉన్నాయి.



నాడు కాంట్రాక్ట్‌ పద్ధతి వద్దని..


ఈ పదేళ్ల కాలంలో నిరు­ద్యో­గుల సమ­స్యపై ఏనాడూ ప్రభుత్వం సాను­కూ­లంగా స్పందిం­చ­లే­దని పలు­వురు విద్యార్థి సంఘాల నాయ­కులు విమ­ర్శి­స్తు­న్నారు. ఉద్యమ సమ­యంలో కాంట్రాక్టు అనే పదమే ఉండ­కూ­డ­దని చెప్పిన నాటి ఉద్యమ నేత.. నేడు ముఖ్య­మంత్రి అయిన తర్వాత కాంట్రా­క్టీ­క­రణ పెంచే­శా­రని వారు ఆరో­పి­స్తు­న్నారు. లక్షల రూపా­యలు కోచింగ్ సెంట­ర్లకు ధార­బోసి, పుస్త­కా­లతో కుస్తీ పడితే పేపర్ లీకే­జీ­లతో నిరు­ద్యో­గు­లను నిండా ముంచా­రని మండి­ప­డు­తు­న్నారు. ప్రవ­ళిక అనే నిరు­ద్యోగ యువతి ఆత్మ­స్థైర్యం కోల్పోయి ఆత్మ­హత్య చేసు­కుంది. దానిపై కూడా ప్రభుత్వం అనై­తి­కంగా రాజ­కీయం చేసిం­దని యువత తీవ్ర ఆగ్ర­హంతో ఉన్నది.


ఉద్యోగ భర్తీల విష­యంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశా­రని ఆరో­ప­ణలు ఉన్నాయి. గతంలో భర్తీ చేసిన కొన్ని సింగ­రేణి ఉద్యోగ నియా­మ­కాల్లో అధి­కార పార్టీకి చెందిన కీలక నేత ఉద్యో­గా­లను అమ్ము­కు­న్నా­రని ఆరో­ప­ణలు గుప్పు­మ­న్నాయి. డబ్బులు ఇచ్చిన అభ్య­ర్థు­లకు ముందే పరీ­క్షలు రాయిం­చా­రని వార్తలు వచ్చినా.. విచా­ర­ణకు ఆదే­శిం­చిన పాపా­న­పో­లే­దని నిరు­ద్యో­గుల ఆగ్రహం వ్యక్తం చేస్తు­న్నారు. వీట­న్నింటి ప్రభావం రాబోయే ఎన్ని­కల్లో కచ్చి­తంగా ఉంటుం­దని రాజ­కీయ విశ్లే­ష­కులు చెబు­తు­న్నారు. యువత, నిరు­ద్యో­గులు తాము ఉద్యో­గాలు రాక పడు­తున్న ఇబ్బం­దు­లను తమ ఇంట్లోని పెద్ద­లకు చెప్పి, వారిని ఒప్పించే అవ­కా­శాలు ఉన్నా­యని అంటు­న్నారు.


వార్నీ.. ‘కంటి వెలుగు’ వెనుక ఇంత పథకమా?


గ్రామాల్లో కంటిచూపు మందగించినవారి సంఖ్య సహజంగానే ఎక్కువ ఉంటుంది. అటువంటివారికి ప్రభుత్వం కంటివెలుగు పథకం పేరుతో పెద్ద ఎత్తున కంటి అద్దాలు పంపిణీ చేసింది. అవసరం ఉన్నకొందరికి కంటి ఆపరేషన్లు చేయించింది. అయితే.. ఎంత మందికి ఆపరేషన్లు జరిగాయన్న విషయంలో తగిన లెక్కలు లేవు. అయితే.. ఈ కంటి వెలుగు పథకం వెనుక పెద్ద కథే ఉన్నదని గ్రామాల్లో చర్చలు, సంభాషణల సందర్భంగా పలువురు పేర్కొనడం ఆసక్తి రేపుతున్నది. అదే.. ఎన్నికల గుర్తును సరిగ్గా గుర్తించగలగడం. చపాతీ రోలర్‌, రోడ్డు రోలర్‌, కెమెరా, ఇస్త్రీపెట్టె, ట్రక్కు తదితర గుర్తులు బీఆరెస్‌ కారు గుర్తును పోలి ఉంటాయి. కొన్నిచోట్ల బీఆరెస్‌ మెజార్టీకి దీటుగా సదరు గుర్తులకు ఓట్లు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.


దీంతో బీఆరెస్‌ కొట్లాడి మరీ వీటిని తొలగింపచేసింది. అయితే వృద్ధుల్లో ఈ గుర్తుల విషయంలో ఇబ్బంది లేకుండా, అవి స్పష్టంగా కనిపించేలా చూసేందుకే యుద్ధ ప్రాతిపదికన కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని పలువురు వ్యాఖ్యానించడం విశేషం. పింఛన్ల కారణంగా వృద్ధుల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని నమ్మకంతో ఉన్న ప్రభుత్వం.. గుర్తుల విషయంలో వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోవాలని భావించే కళ్లద్దాలు పంపిణీ చేసినట్టు ఉన్నదని చర్చించుకుంటున్నారు. అంటే వృద్ధుల ఓట్లపై అధికార పార్టీ ఎంత గట్టినమ్మకంతో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.