సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌.. మార్పుపైనే చర్చ!

ఒక ప్రాంత రాజకీయ పరిస్థితులపై అక్కడి రాజకీయ పండితుల్లో, లేదా విశ్లేషకుల్లో అవగాహన ఉంటుంది! కానీ.. అదే ఊళ్లోని ఆటోవాలాలు, టీకొట్లు, బార్బర్‌షాపుల ఓనర్లు.. క్షేత్రస్థాయి ‘మాస్‌’ రాజకీయ విశ్లేషకులుగా కనిపిస్తున్నారు.

  • Publish Date - November 25, 2023 / 04:10 AM IST
  • టీ కొట్లు, ఆటోలు, బార్బ‌ర్ షాపు ఓనర్లు..
  • బస్సు కండక్టర్లు.. ఉపాధ్యాయులు..
  • ‘క్షేత్రస్థాయి’ రాజకీయ విశ్లేషకులు వాళ్లే!
  • నిత్యం ప్రజలతో మాట్లాడే అవకాశం
  • పొద్దున లేస్తే.. రాజకీయాలపైనే చర్చలు
  • ఓటరు నాడిని పట్టేస్తున్న ‘నిపుణులు’
  • సంభాషణలతోనే ఎన్నికల ప్రచారాలు
  • రాష్ట్రంలో అధికార మార్పిడిపై సంకేతాలు!



విధాత‌, హైద‌రాబాద్: ఒక ప్రాంత రాజకీయ పరిస్థితులపై అక్కడి రాజకీయ పండితుల్లో, లేదా విశ్లేషకుల్లో అవగాహన ఉంటుంది! కానీ.. అదే ఊళ్లోని ఆటోవాలాలు, టీకొట్లు, బార్బర్‌షాపుల ఓనర్లు.. క్షేత్రస్థాయి ‘మాస్‌’ రాజకీయ విశ్లేషకులుగా కనిపిస్తున్నారు. ఏ అభ్యర్థి గెలుస్తాడో, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో ప్రజల నాడిని నేరుగా పసిగట్టి చెప్పేస్తున్నారు.


అంతేకాదు.. జరుగబోయే మార్పులపై ప్రజలకు వివరించి కూడా చెబుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిది? ఎవరి పథకాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపైనా వారు తమను కలిసే వారితో చర్చలు పెట్టుకుంటున్నారు. రాజకీయ అభిప్రాయాలను పెద్ద ఎత్తున వ్యాప్తి చేస్తున్నారు. వీరిని నిజమైన పొలిటికల్‌ మాస్‌ సూపర్‌ స్ప్రెడర్స్‌గా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు.


మార్చితే తప్పేంటి?


వివిధ గ్రామాల్లో విధాత ప్రతినిధులు ప్రజలతో మాట్లడుతున్నప్పుడు ఆయా రంగాల పొలిటికల్‌ సూపర్‌ స్ప్రెడర్స్‌ తారసపడ్డారు. ఇప్పటికి రెండు సార్లు బీఆరెస్‌కు అవకాశం ఇచ్చామని, ఈసారి కాంగ్రెస్‌కు ఇచ్చి చూస్తామని తమతో మాట్లాడేవాళ్లు చెబుతున్నారని వారు పేర్కొంటున్నారు. పింఛన్లు, ఇతర సామాజిక సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజల్లో స్పష్టత ఉన్నదని వీరు చెబుతున్నారు.


‘కాంగ్రేసోళ్లు వ‌స్తే పెంచ‌న్లు రావంట‌.. రైతు బంధు డ‌బ్బులు రావంట క‌దా! అని అంటే.. అరె ఊకో.. ఎవ‌రొచ్చినా ఈ డ‌బ్బులు ఇంకో రూపాయి పెంచి ఇవ్వాల్సిందే కానీ.. ఇవ్వ‌కుంట ఉండెటోడే లేడు రా బై! డ‌బ్బులు ఇవ్వ‌న‌ని చెప్పి ఓట్లు అడిగే ద‌మ్ము ఏ పార్టీకీ లేదు’ అని ఒకరు చెప్పారు. కాంగ్రేసోళ్లు వ‌స్తే దోచుకుంట‌ర‌ట క‌దా అని మ‌రో వ్య‌క్తి ప్రశ్నిస్తే.. ‘తిన‌నోడు ఎవ‌రు? అంద‌రు తినెటోళ్లే… పైకి అంద‌రు మాట్లాడుత‌రు.. అని తేల్చిచెప్పేస్తున్నారట.


అందరూ తినెటోళ్లే..


ఎన్నికల్లో డబ్బు పంపిణీపైనా సూపర్‌ స్ప్రెడర్స్‌కు, సాధారణ ప్రజలకు మధ్య ఆసక్తికర చర్చలే సాగుతున్నాయి. అన్ని పార్టీల నేత‌లు అవినీతికి పాల్ప‌డే వారే.. అక్ర‌మంగా సంపాదించుకునెటోళ్లే.. లేకుంటే ఈ తీరుగా కోట్ల‌కు కోట్లు డ‌బ్బులు ఖ‌ర్చు పెడ‌త‌రా? తిన‌క‌పోతే ఎక్క‌డికెళ్లి వ‌స్త‌యి? అని ఒక టీకొట్టు ఓనర్‌ తేల్చిపారేశాడు. ‘మ‌నం ఎవ‌రికి ఎందుకు కంటు కావాలె! ఇచ్చిన‌వి తీసుకుందాం.. మ‌నం వేసే దిక్కున ఓటు వేద్దాం అని ముచ్చట పెట్టుకుంటున్నారు. ఎన్నిక‌ల‌ను వ్యాపారంగా మారిన తీరు చూస్తున్న ప్ర‌జ‌లు అవ‌కాశం వ‌స్తే అంద‌రూ దండుకునే వాళ్లేననే అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది.


అటేసి చూస్తే ఏమైతది?


సాగ‌ర్ రింగ్ రోడ్ వ‌ద్ద ఆటోలో ప్ర‌యాణిస్తున్న వృద్దురాలితో మాట క‌లిపిన ఓ డ్రైవ‌ర్.. ‘ఓట్లు వ‌స్తున్న‌యి క‌దా అవ్వా.. ఈసారి ఎటు వేద్దామ‌నుకుంటున్న‌వ్‌? అని అడుగ‌గా కేసీఆర్ బాగ‌నే చేసిండు నాయ‌నా.. పించ‌న్ పెంచిండు.. రైతు బంధు ఇస్తుండు.. కాక‌పోతే ఈ మ‌ధ్య కాంగ్రెసోళ్లేమో ఇంకా పించ‌ను పెంచుత‌ర‌ట‌.. ఎటు వేయాలో చూడాలి ఆ రోజుకు! అని చెప్ప‌గానే.. ఏమి పించ‌ను అవ్వా.. కాంగ్రెస్ వ‌స్తే 4 వేలు ఇస్తా అంటున్న‌రు.. చాలా మంది పిల్ల‌లు హైద‌రాబాద్‌కు వ‌చ్చి క‌డుపు కాల్చుకొని చ‌దువుకుంటుంటే కేసీఆర్ కొలువులు ఇవ్వ‌క‌పోయే.. ఇంటికి రావ‌డానికి పిల్ల‌ల‌కు ముఖం లేక‌పోయే.. ఈసారి కాంగ్రెసోళ్లు వ‌స్తే 2 ల‌క్ష‌ల కొలువులు ఇస్తా అంటున్న‌రు.


మీకు మ‌నుమ‌ళ్లు, మ‌నుమ‌రాళ్లు లేరా? పోర‌గాళ్ల‌కు కొలువులు వ‌స్తే కుటుంబాన్ని మొత్తం చూసుకుంట‌రు. ఈ పించ‌న్లు ఏమి చేస్త‌యి.. ఇటు రెండుసార్లు ఏసినం క‌దా.. ఓ పారి అటేసి చూద్దాం.. ఏమి పోతది! అంటే.. ‘అంతే బిడ్డా.. చూద్దాం’ అని చెప్పింది. ఇదే తీరుగా టీ దుకాణాలు, బార్బర్‌ షాపులలో చర్చలు నడుస్తున్నాయి.


అభివృద్ధి ఉంది.. అహంకారమూ ఉంది


శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక బార్బ‌ర్ షాప్‌లో కూడా ఇదే తీరుగా చ‌ర్చ జ‌రిగింది. అభివృద్ది చేసినా అహంకారం ఉంద‌ని, ఒక్క‌సారి మారిస్తేనే మంచిందన్న తీరుగా చ‌ర్చించుకున్నారు. సీఎం కేసీఆర్ ప్ర‌సంగంపై చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న మాట‌ల్లో వాడి త‌గ్గింద‌ని, ఫ్ర‌స్టేష‌న్ క‌నిపిస్తున్నదని చ‌ర్చింకుంటున్నారు.


కాంగ్రెస్ వ‌స్తే రైతు బంధు ఆగిపోతుంద‌న్న వాదన రాగా.. ఎవ‌రు వ‌చ్చినా.. రాకున్నా ఏ బంధూ ఆగ‌ద‌ని బ‌హాటంగా అంటున్నారు. ‘ద‌ళిత బంధు వాళ్ల కార్య‌క‌ర్త‌ల‌కే ఇచ్చిండ్రట. డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఒక‌రిద్ద‌రికి మాత్ర‌మే ఇచ్చిండ్రు.. ఎవ‌రికి వ‌చ్చిన‌యే!’ అని మ‌రొక‌రు.. ల‌క్ష రూపాయ‌లు ఇస్త‌మ‌ని ద‌ర‌ఖాస్తులు తీసుకున్న‌రు… ఏడ వ‌చ్చిన‌యే? అని మ‌రొక‌రు.. చర్చించుకోవడం కనిపించింది.


ఇలా రాష్ట్రంలో ఏ మూల‌న చూసినా చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనికి సూప‌ర్ పొలిటికల్‌ స్ప్రెడ‌ర్లుగా బార్బ‌ర్ షాపులు, ఆటోలు, ఆర్టీసీ బ‌స్సులు, టీ దుకాణాలు, బ‌స్తీలు, గ్రామాల్లోని చౌర‌స్తాలు వేదిక‌ల‌వుతున్నాయి. ఇలాంటి చర్చలను సాదాగా కొట్టిపారేయడానికి వీల్లేదని, ఈ దిశ‌గా జ‌రిగే చ‌ర్చ‌లే మార్పుకు నాంది ప‌లుకుతాయ‌ని, ప్రజాభిప్రాయాన్ని ఒక అభిప్రయానికి మల్చుతాయని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వాఖ్యానిస్తున్నారు.