BRSతో కాంగ్రెస్ పొత్తు ఉండదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

KCR ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ .. విధాత: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోబోదని ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని పిసిసి మాజీ చీఫ్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నేరేడుచర్ల మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న బడ్జెట్ చివరి బడ్జెట్ అని, ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ […]

  • Publish Date - January 27, 2023 / 12:49 PM IST
  • KCR ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ ..

విధాత: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోబోదని ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని పిసిసి మాజీ చీఫ్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నేరేడుచర్ల మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.

బిఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న బడ్జెట్ చివరి బడ్జెట్ అని, ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ఉన్న సెక్రెటేరియట్ ను కూల్చి వందల కోట్ల ప్రజాధనంతో కొత్త సెక్రెటేరియట్ కట్టి ఆహా ఓహో అనుకుంటే జనానికి ఏమీ ఒరుగుతుందన్నారు.

తొమ్మిదేళ్లు దగా కోరు పాలన సాగించిన సీఎం కేసీఆర్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు తన చివరి బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ చెప్పిన రైతుల లక్ష రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పంటల బీమా అమలుకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు.

దళితులకు, గిరిజనులకు కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని చెప్పారని ఈ బడ్జెట్లో అందుకు నిధులు ఇవ్వాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 3000 కోట్లు, అభయాహస్తం పింఛన్ ప్రీమియం కింద 1000 కోట్లు మొత్తం నాలుగు వేల కోట్లు బకాయిలు చెల్లించేందుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్య‌మన్నారు. గవర్నర్, సీఎం కేసీఆర్ లు పంచాయితీ పెట్టుకుని రాష్ట్రంలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించకుండా రాజ్యాంగ విధానాలను విస్మరించడం ద్వారా దేశంలో రాష్ట్రాన్ని, రాజ్యాంగాన్ని అప్రతిష్ట పాలు చేశారన్నారు.

అధికారంలో ఎవరున్నా రాజ్యాంగ పద్ధతులను ఉల్లంఘించడం మంచిది కాదన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్, బిజెపిలు జనాన్ని తరలించుకుని బహిరంగ సభలు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీలకు ప్రజాదరణ ఉందని భావించరాదన్నారు. బిజెపి బిఆర్ఎస్ లు దొందు దొందేనని ఆ రెండు పార్టీలను రానున్న ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు.

హుజూర్‌న‌గర్ నియోజకవర్గంలో జాన్ పహడ్ దర్గా ఉర్సు అభివృద్ధి కి బిఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో చేసింది శూన్యమన్నారు. వచ్చే ఉర్సు కల్లా మౌలిక వసతులు కల్పిస్తానంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే చెబుతున్నాడని, అప్పటివరకు ఆయన ఎమ్మెల్యే పదవి ఉండదన్నారు. తన హయాంలో ఉర్సుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20కోట్లతో మట్టపల్లి రోడ్డు, జానపాడ్- పాలకీడు రోడ్డు వేయించాను అన్నారు.

దర్గా అభివృద్ధికి తన హ‌యాంలో 70 లక్షలతో అభివృద్ధి చేశానని, మౌలిక వసతుల కల్పనకు కొత్తగా 25లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దర్గాకు ఏటా వస్తున్న రెండు కోట్ల ఆదాయం ఎక్కడ పోతుందో అధికారులు చెప్పాలన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాటలు తప్ప చేతలు లేవని, మాకంటే ఫ్లెక్సీలు కట్టడంలో, కండువాలు కప్పడంలో మాత్రమే బిఆర్ఎస్ ఎమ్మెల్యే మెరుగ్గా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

కేసులు పెడతామంటూ కొందరిని, దళిత బంధు ఇస్తామంటూ మరికొందరిని బిఆర్ఎస్ లో చేర్పించే బోగస్ కార్యక్రమం కొనసాగిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేని బిఆర్ఎస్ నాయకులు వైన్సు, కాంట్రాక్టుల, భూకబ్జాల కమీష‌న్లు మాత్రం జోరుగా దండుకుంటున్నారని విమర్శించారు.

అధికారులు తనకు గెస్ట్ హౌస్ ఇవ్వరాదంటూ చెప్పడం అభ్యంతరకరమన్నారు. అధికారులు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేయాలని, ఎవరికో పనిమనిషిగా పని చేయవద్దని, అలా చేసి వివక్ష పాటిస్తే తమ సమయం వచ్చినప్పుడు ఏమి చేయాలో చేస్తామన్నారు.

హుజూర్‌న‌గర్ ఎన్నారై పిల్లుట్ల రఘు ఇటీవల, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారని ఆయన గతంలో దేవగౌడను, షర్మిలను, కిషన్ రెడ్డిని, జగన్ ను, బిఆర్ఎస్ నాయకులను కూడా కలిశాడని, ఆయనకు హుజూర్‌న‌గర్ నియోజకవర్గంలో ఎలాంటి పాత్ర అవకాశం లేదన్నారు.