న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడగొట్టేందుకు విపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విషయం విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో మరో కొత్త పేరును బహుజన్ సమాజ్ పార్టీ తెరపైకి తెచ్చింది. ఇన్నాళ్లు బీజేపీకి అనుకూలంగా ఉన్న ఆ పార్టీ ఇండియా కూటమిలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అది కూడా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతిని ప్రకటిస్తేనే చేరుతామని షరతు విధించింది.
ఈ సందర్భంగా బీఎస్పీ ఎంపీ మలూక్ నగర్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరును ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ మాయావతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితుడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటే.. మాయావతి కంటే ఉత్తమమైన వ్యక్తులు ఎవరు లేరని చెప్పారు.
వీటిపై కాంగ్రెస్ పార్టీ ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకుంటే ఇండియా కూటమిలో చేరేందుకు మాయావతి ఆలోచిస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీకి 13.5 శాతం ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే యూపీలో 60 సీట్లకు పైగా విజయం సాధిస్తామని మలూక్ నగర్ చెప్పారు.
ఇక యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో తమకు ఎలాంటి విబేధాలు లేవని ఎంపీ స్పష్టం చేశారు. మాయావతి ఇండియా కూటమిలో చేరుతానంటే, అఖిలేష్ అబ్జెక్షన్ చెప్పడు అని తెలిపారు. అఖిలేష్‌తో బీఎస్పీకి సఖ్యత లేదనే వార్తలు అవాస్తవం అన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీపైనే అఖిలేష్‌కు కోపం ఉందన్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ కమ్యూనిటీకి కాంగ్రెస్ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. అందుకే ఆ పార్టీపై అఖిలేష్‌కు కోపం ఉందని మలూక్ నగర్ తెలిపారు.