విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, వలిగొండ మండలాలకు సంబంధించిన రైతులు త్రిబుల్ ఆర్ భూ సేకరణ పై వరుస ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం సైతం చౌటుప్పల్ మండలంలోని మందోళ గూడెం, తూర్పు గూడెం, నేలపట్ల, కుంట్ల గూడెం, సింగరాయ చెరువు స్వాములవారి లింగోటం గ్రామస్తులు రీజినల్ రింగ్ రోడ్డు భూ సర్వే అధికారులను అడ్డుకొని నిరసన తెలిపారు.
తమ భూములలో వరి, ఆకుకూరలు కూరగాయలు వంటి పంటలు పండించుకొని జీవిస్తున్నామని రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణతో తాము రోడ్డున పడతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు రోడ్డు అలైన్మెంట్ మార్చాలని, లేనిపక్షంలో ఓపెన్ మార్కెట్లో పలుకుతున్న ధర అనుసరించి నష్టపరిహారం ఇవ్వాలని, లేదా భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ పరిధిలో చౌటుప్పల్, వలిగొండ మండలాలకు సంబంధించి 3ఏ నోటిఫికేషన్ ద్వారా రైతుల సహకారంతో 70% గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేశామని మిగిలిన 30% సర్వే కొనసాగుతుందన్నారు. చౌటుప్పల్ మండలంలోని ఐదు గ్రామాలకు మూడు గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని, చిన్న కొండూరు, నేలపట్ల మిగిలిపోగా, వలిగొండ మండలంలో మూడు గ్రామాలు మిగిలాయన్నారు. రైతుల డిమాండ్లను తాము ప్రభుత్వానికి నివేదిస్తామని సర్వే మాత్రం కొనసాగించక తప్పదు అన్నారు.