Site icon vidhaatha

Maoist Party: వారు పార్టీ డబ్బుతో పారిపోయారు : మావోయిస్టు పార్టీ

Maoist Party: సౌత్ బస్తర్ డీ.వీ.సీ.ఏం సభ్యుడు మొడీయం దినేష్, అతని భార్య కళ పార్టీ డబ్బుతో పారిపోయి పోలీసులకు లొంగిపోయారని మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో మావోయిస్ట్‌లు విడుదల చేసిన లేఖలో వారు ఈ కీలక ఆరోపణలు చేశారు.

ఇరవై ఏళ్ల ఉద్యమ జీవితంలో ఉన్న దినేష్ పార్టీకి ద్రోహం చేశారని మావోయిస్ట్‌లు లేఖలో ప్రస్తావించారు. తీవ్రమైన అణచివేతకు గురైన వారు శత్రువుకు లొంగిపోతారని మావోయిస్ట్‌లు తెలిపారు. త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ‘ఆపరేషన్ కగార్’ యుద్దాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. దండకారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టులను, ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం హత మారుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని మావోయిస్ట్‌లు డిమాండ్ చేశారు.

అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలను వెళ్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, అడవుల్లో ఆదివాసీలకు మావోయిస్టులు అండగా నిలిచారన్నారు. ఆదివాసీలను లేకుండా చేసి అడవుల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను బహుళజాతి సంస్థలకు అమ్ముకోవడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, దీనిని ప్రజలు, మేధావులు తిప్పికొట్టాలని మావోయిస్ట్‌లు పిలుపునిచ్చారు. దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version