విధాత:దసరా పండుగ పర్వదినాన్ని చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇక శ్రీరాముడు రావణాసురుడిని వధించిన దానికి గుర్తుగా.. దసరా రోజు రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అందరికీ తెలిసిందే.
అయితే ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో విజయ దశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఇంటర్ కళాశాల మైదానంలో రావణాసురుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రావణుడికి కోపం వచ్చిందేమో తెలియదు కానీ.. ఒక్కసారిగా జనాలపై నిప్పుల వర్షం కురిపించాడు.
ఒకట్రెండు సార్లు జనాలపైకి నిప్పులు ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడికి వచ్చిన వారంతా ఆ అగ్నికీలల నుంచి కాపాడుకునేందుకు వెనక్కి పరుగెత్తారు. పోలీసులు కూడా పరుగెత్తి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.