తొలి ప్యారా ఆస్ట్రోనాట్ అంత‌రిక్ష ప్రయాణంపై సందిగ్ధం.. కృత్రిమ కాలే కార‌ణం!

చ‌రిత్ర‌లో తొలి సారి దివ్యాంగ ఆస్ట్రోనాట్ (Para - Astronaut) అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లోకి పంపాల‌న్న శాస్త్రవేత్త‌ల ఆలోచ‌న‌పై సందిగ్ధ‌త నెల‌కొంది

  • Publish Date - November 28, 2023 / 09:36 AM IST

విధాత‌: చ‌రిత్ర‌లో తొలి సారి దివ్యాంగ ఆస్ట్రోనాట్ (Para – Astronaut) అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లోకి పంపాల‌న్న శాస్త్రవేత్త‌ల ఆలోచ‌న‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఈ యాత్ర‌కు బ్రిటిష్ మాజీ పారాలంపియ‌న్ జాన్ మెక్ ఫాల్‌ను యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఇప్ప‌టికే ఎంపిక చేసింది. జాన్‌కు 19 ఏళ్ల వ‌య‌సు ఉన్న స‌మ‌యంలో బైక్ యాక్సిడెంట్‌కు గుర‌వ‌డంతో ఒక కాలును తీసేయాల్సి వ‌చ్చింది. ఆ స్థానంలో అత‌డు ప్రొస్థెటిక్ కాలును అమ‌ర్చుకుని జీవిస్తున్నాడు.


పారా ఆస్ట్రోనాట్‌ను తొలిసారి అంత‌రిక్షం (Space) లోకి పంపించాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌పుడు ప‌లువురిని ప‌రీక్షించ‌గా జాన్ అందుకు స‌రైన వాడ‌ని శాస్త్రవేత్త‌లు భావించారు. ప్రస్తుతం అత‌డికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నారు. అయితే జాన్ ప్ర‌స్తుతం క‌లిగి ఉన్న కృత్రిమ ప్రొస్థెటిక్ కాలే.. ఈ అంత‌రిక్ష యాత్ర‌కు స‌మ‌స్య‌గా మారే ప్ర‌మాద‌ముందని ESA శాస్త్రవేత్త‌లు అనుమానిస్తున్నారు. ఈ కాలు త‌యారీలో అత్య‌ధిక గాఢ‌త ఉన్న ఫోం ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించారు. ఇవి అంత‌రిక్షంలోకి వెళ్లాక ఏ ర‌కంగానైనా ప్ర‌భావిత‌మైతే విష వాయువులు వెలువ‌డే ప్ర‌మాదముంది.


అందుకే ఈ అంశంపై శాస్త్రవేత్త‌లు లోతైన అధ్య‌య‌నం తాజాగా మొద‌లుపెట్టారు. అత‌డి కృత్రిమ కాలు నాసా (NASA) నిబంధ‌న‌ల మేర‌కే ఉందా లేదా అనే అంశాన్ని ప‌రిశీలిస్తున్నారు. ఐఎస్ఎస్‌లో గాలిని రీసైకిల్ చేసి ఉప‌యోగిస్తారు. అది పూర్తిగా మూసి ఉంటుంది. ఒక‌వేళ అక్క‌డ క‌నుక విష‌వాయువులు విడుద‌లైతే అది అంద‌రికీ ప్ర‌మాద‌క‌రం అని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒక‌వేళ అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే 2025లో జాన్ ఐఎస్ఎస్‌లోకి అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. అదే జ‌రిగితే అంత‌రిక్ష‌యానం చేప‌ట్టిన తొలి పారా ఆస్ట్రోనాట్‌గా ఆయ‌న చ‌రిత్ర‌లో నిలిచిపోతారు.


అంత‌రిక్షంలో ఎవరైనా చ‌నిపోతే..!


జాన్ మెక్ ఫాల్ అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అస‌లు ఎవ‌రైనా అంత‌రిక్షంలో చ‌నిపోతే వారి మృత‌దేహాలు ఏమ‌వుతాయ‌నే సందేహం వ‌స్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న గ‌ణాంకాల‌ను ఒక సారి ప‌రిశీలిస్తే ఈ 60 ఏళ్ల మాన‌వ అంత‌రిక్ష ప్రయాణంలో 20 మంది ఆస్ట్రోనాట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఐఎస్ఎస్‌కు ఎక్కువ యాత్ర‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, చంద్రునిపై.. అనంత‌రం స‌మీప భ‌విష్య‌త్తులో అంగార‌కుడిపైకి మ‌నుషుల‌ను పంపాల‌ని ప్ర‌ణాళిక‌లు ఉన్న నేప‌థ్యంలో నాసా దీనికి ఒక ప్రొటోకాల్‌ను సిద్ధం చేసింది. భూ వాతావ‌ర‌ణంలోకానీ లేదంటే చంద్రునిపై కానీ ఆస్ట్రోనాట్ చ‌నిపోతే వారి మృత‌దేహాన్ని భూమిపైకి చేర్చాల‌ని నిర్ణ‌యించింది. అయితే అలాంటి ప‌రిస్థితుల్లో అంత‌రిక్షంలో జీవించి ఉన్న‌వారి భ‌ద్ర‌త అత్యంత ప్ర‌ధాన‌మ‌ని.. చ‌నిపోయిన వారి మృత‌దేహం కాద‌ని నాసా త‌న నిబంధ‌న‌ల్లో స్ప‌ష్టం చేసింది.

Latest News