Site icon vidhaatha

Currency | ఆ 88వేల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు.. గాయబ్‌

Currency |

చిల్లర దొంగలు జేబులకు కన్నాలేస్తారు! ఓ స్థాయి దొంగలు ఇళ్లలోపడి డబ్బు, నగలు దోచుకుపోతుంటారు! సైబర్‌ నేరస్థులు బ్యాంక్‌ అకౌంట్లలో చొరబడి.. ఖాతాలు ఖాళీ చేస్తారు! బడా కార్పొరేట్‌ కంపెనీలు.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టి ఎంచక్కా విదేశాలకు చెక్కేసిన ఉదంతాలూ చదివాం! ఇది వాటికి మించినది! డబ్బులు ఎక్కడైతే ప్రింట్‌ అవుతాయో.. అక్కడి నుంచే మాయమైపోయాయి! దాని విలువ 88,032.5 కోట్లు! అంతుచిక్కని విధంగా మాయమైన ఈ సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థ భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నది. సమాచార హక్కు చట్టం కింద ఒక ఆర్టీఐ కార్యకర్త సేకరించిన వివరాలు ఈ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చాయి.

నాసిక్‌: పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా డిజైన్‌ చేసిన కరెన్సీ నోట్లను చెలామణిలోకి తెచ్చింది. వాటిలో 88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లు అంతుచిక్కని రీతిలో మాయమవడం ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇందులో 2015 ఏప్రిల్‌ నుంచి 2016 డిసెంబర్‌ మధ్య నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రించినవి కూడా ఉన్నాయి.

1999-2010 మధ్య కాలంలో దేశంలోని మూడు కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌లు సరఫరా చేసిన దానికంటే దాదాపు 40 కోట్ల రూ.500 నోట్లు ఆర్‌బీఐ ధనాగారాలకు చేరడం ఒక ఎత్తయితే.. తాజాగా ముద్రించిన నోట్ల సంఖ్యకంటే తక్కువ నోట్లు ఆర్బీఐకి చేరడం సంచనం రేపుతున్నది. 8,810 మిలియన్‌ నోట్లను అన్ని మింట్స్‌లలో ముద్రిస్తే.. ఆర్‌బీఐకి చేరినవి మాత్రం 7,260 మిలియన్‌ నోట్లే. దీనిపై ఆర్‌బీఐ ప్రతినిధులు నోరు విప్పడం లేదు.

మనదేశంలో కరెన్సీ నోట్లను బెంగళూరులోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌, నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌, దేవస్‌లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లలో ముద్రిస్తారు. వాటిని ఆర్‌బీఐకి ధనాగారాలకు పంపిస్తారు. అక్కడి నుంచి వాటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెడతారు. దీనిపై ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్‌ రాయ్‌ సేకరించిన వివరాల ప్రకారం.. నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌.. కొత్తగా డిజైన్‌ చేసిన రూ.500 ముఖ విలువ కలిగిన 375.450 మిలియన్‌ నోట్లను ముద్రించింది.

ఆశ్చర్యం ఏమిటంటే.. 2015 ఏప్రిల్‌-2016 డిసెంబర్‌ మధ్య కాలంలో తాము 345 మిలియన్‌ నోట్లు అందుకున్నట్టు ఆర్బీఐ రికార్డులు పేర్కొంటున్నాయి. మరో ఆర్టీఐ ప్రశ్నకు నాసిక్‌ ప్రెస్‌ అందించిన వివరాల్లో.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.500 ముఖ విలువ కలిగిన 210 మిలియన్‌ నోట్లను సరఫరా చేసినట్టు ఉన్నది.
కొత్త రూ.500 నోట్లను సరఫరా చేసినట్టు నాసిక్‌ ప్రెస్‌ ధ్రువీకరిస్తుంటే.. ప్రజలకు అందుబాటులో ఉన్న కరెన్సీ నిర్వహణపై వార్షిక నివేదికలో మాత్రం ఆ నోట్లను అందుకున్నట్టు ఆర్‌బీఐ ఎక్కడా చెప్పకపోవడం విశేషం.

అంతేకాకుండా.. 2016-17లో రూ.500 ముఖ విలువ కలిగిన మొత్తం 1,662 మిలియన్ నోట్లు ఆర్‌బీఐకి సరఫరా చేసినట్టు నాసిక్‌ ప్రెస్‌ ఇచ్చిన అదనపు సమాచారం పేర్కొంటున్నది. ఇదే సమయంలో బెంగళూరు మింట్‌ నుంచి 5,195.65 మిలియన్‌ నోట్లు, దేవాస్‌ నుంచి 1,953.000 మిలియన్‌ నోట్లు ఆర్‌బీఐకి సరఫరా అయ్యాయి. అయితే.. ఆర్‌బీఐ మాత్రం 7,260 మిలియన్‌ నోట్లు మాత్రమే ఈ మూడు ప్రెస్‌ల నుంచి స్వీకరించింది.

ఈ అవకతవకలను ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్‌ రాయ్‌ సేకరించిన వివరాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇంతటి భారీ స్థాయిలో తేడాలు ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే ఈ అంశంపై ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవడం లేదని మనోరంజన్‌ రాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మాయమైన 1760.65 మిలియన్‌ నోట్లు ఆషామాషీ కాదని, అది భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు, భద్రతకు ప్రమాదం కలిగిస్తాయని చెప్పారు. మొత్తం మీద రూ.88,032.5 కోట్ల రూపాయలు అంతుచిక్కని రీతిలో మాయమైపోయాయి.

Exit mobile version