Mehul Choksi | PNBScam
విధాత: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు దాదాపు రూ.13,500 కోట్ల టోకరా వేసి పరారైన వజ్రల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మోహుల్ ఛోక్సీ (Mehul Choksi) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఛోక్సీని బెల్జియంలో ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఛోక్సీని తమకు అప్పగించాలని కోరిన భారత దర్యాప్తు సంస్థలు ఆ దేశాన్ని కోరాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ 2018లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ స్కామ్ లో మెహుల్ ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీలో రూ.13,500 కోట్ల మోసానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్కామ్ వెలుగుచూసిన క్రమంలో వారిద్ధరూ విదేశాలకు పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా.. నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు.
ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గతనెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబరులో అతడు ‘ఎఫ్ రెసిడెన్సీ కార్డ్’ పొందాడు. సీబీఐ అధికారుల కోరిక మేరకు మెహుల్ ఛోక్సీని ఎట్టకేలకు బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు బెల్జియం జైలులో ఉన్నాడు. మెహుల్ ఛోక్సీపై తీవ్ర అభియోగాలు ఉండడంతో అతడిని తమకు అప్పగించాలని బెల్జియం ప్రభుత్వాన్ని భారత్ ప్రభుత్వం కోరింది. ఇప్పుడు ఛోక్సి చిక్కడంతో ఈ కేసులో కీలక పురోగతికి దర్యాప్తు సంస్థలకు అవకాశం ఏర్పడింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం మెహుల్ ఛోక్సీ భారత్‌కు వస్తాడా? లేదంటే అక్కడే న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.