విధాత : తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీఆరెస్ పార్టీకి పలు నియోజకవర్గాలు కొరకరాని కొయ్యలా.. విజయం దక్కని ద్రాక్షలా సవాల్ విసురుతున్నాయి. వాటిలో బీఆరెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా గెలవని నియోజకవర్గాలు 17ఉండగా, అందులో ఏ పార్టీ గెలిచిన రెండోసారి గెలువని 27సీట్లలో 21సీట్లు సిటింగ్ బీఆరెస్‌వే ఉండటం గులాబీ పార్టీకి గుబులు రేపుతుంది.
ముందుగా బీఆరెస్ ఇప్పటిదాకా గెలువని సీట్లు పరిశీలిస్తే వాటిలో గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17నియోజకవర్గాలున్నాయి. ఎంఐఎం కు పట్టున్న ఏడు మినహాయిస్తే బీఆరెస్ బోణి కొట్టని మరో పది నియోజకవర్గాల్లో ఏడు ఖమ్మం పరిధిలోనివి. మూడు ఎల్బీనగర్, మహేశ్వరం, గోషామహల్‌లో గ్రేటర్ పరిధిలోనివి.
కారు పోలేని గ్రేటర్ సీట్లు
హైద్రాబాద్ పరిధిలోని ఎంఐఎంకు తిరుగులేని నియోజకవర్గాలు ఏడు చాంద్రాయణగుట్ట, చార్మినార్, యకత్‌పురా, బహదూర్‌పుర, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేటలలో బీఆరెస్ ఇంతవరకు గెలవలేదు. మలక్‌పేటలో 2009నుంచి ఎంఐఎంలు గెలుస్తుంది. అంతకుముందు ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ బీజేపీలు గెలిచినా బీఆరెస్ మాత్రం గెలవలేదు. కార్వాన్‌లో 1985నుంచి 1999వరకు బీజేపీ గెలవగా, 1999నుంచి ఎంఐఎం గెలుస్తుంది.
ఎల్బీనగర్‌లో 2009లో కాంగ్రెస్ నుంచి సుధీర్‌రెడ్డి, 2014లో టీడీపీ నుంచి ఆర్.కృష్ణయ్య, 2018లో కాంగ్రెస్ నుంచి మరోసారి సుధీర్‌రెడ్డి గెలిచారు. బీఆరెస్ మాత్రం ఇక్కడ గెలవలేదు. సిటింగ్ సుధీర్‌రెడ్డి ఈ దఫా బీఆరెస్ నుంచి పోటీలో ఉన్నారు. మహేశ్వరంలో 2009, 2018లలో కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలవగా, 2014లో టీడీపీ నుంచి తీగల కృష్ణారెడ్డి గెలిచారు. సిటింగ్ సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆరెస్ నుంచి పోటీలో ఉన్నారు. డిలిమిటేషన్‌కు ముందు గోషామహల్ మహరాజ్‌గంజ్ నియోజకవర్గం పేరుతో ఉండగా 1989నుంచి 1999వరకు ప్రేమ్‌సింగ్ రాథోడ్ బీజేపీ నుంచి గెలిచారు. 2004లో, 2009లో కాంగ్రెస్ నుంచి ముఖేశ్‌గౌడ్, 2014లో, 2018లో రాజాసింగ్ గెలిచారు. ఇక్కడ కూడా బీఆరెస్ బోణి కొట్టలేదు.
ఖమ్మంలో గులాబీ వికసించని ఏడు సీట్లు
ఖమ్మం జిల్లాలో 7నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా బీఆరెస్ ఖాతా తెరవలేదు. మధిరలో 2009, 2014, 2018ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క గెలుస్తు వచ్చారు. ఇక్కడ బీఆరెస్ గెలుపు ఖాతా తెరువలేదు. భద్రాచలంలో 2009లో కాంగ్రెస్, 2014లో సీపీఎం, 2018లో కాంగ్రెస్ గెలువగా, ఆ పార్టీ సిటింగ్ పొడెం వీరయ్య ఈ దఫా పోటీలో ఉన్నారు. సత్తుపల్లిలో 2009నుంచి మూడూ ఎన్నికల్లోనూ సండ్ర వెంకటవీరయ్ టీడీపీ నుంచి గెలిచారు.
2018లో టీడీపీలో గెలిచిన సండ్ర బీఆరెస్‌లో చేరి ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. వైరాలో 2009లో సీపీఐ, 2014లో వైఎస్సార్‌సీపీ బాణోతు మదన్ లాల్, 2018లో ఇండిపెండెంట్ లావుడ్య రాములునాయక్ గెలుపొందారు. ఆయన బీఆరెస్‌లో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో మదన్‌లాల్ బీఆరెస్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. అశ్వరావుపేటలో 2009లో కాంగ్రెస్ నుంచి మిత్రసేన, 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు, 2018లో టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వర్‌రావు గెలిచారు.
అనంతరం మెచ్చా బీఆరెస్‌లో చేరి ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇల్లందులో 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో బీఆరెస్ నుంచి బాణోతు హరిప్రియలు గెలిచారు. హరిప్రియ బీఆరెస్‌లో చేరి ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. పినపాకలో 2009లో కాంగ్రెస్ నుంచి రేగ కాంతరావు, 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి పాయం వెంకటేశ్వర్లు, 2018లో కాంగ్రెస్ నుంచి రేగ కాంతరావు గెలిచారు. రేగ బీఆరెస్‌లో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆరెస్ నుంచి రేగ కాంతరావు, కాంగ్రెస్ నుంచి పాయం వెంకటేశ్వరు మరోసారి పోటీ పడుతున్నారు.
అదే జరిగితే అధికారం గల్లంతే
డిలిమిటేషన్ పిదప వరసగా 2009, 2014, 2018 మూడు ఎన్నికల్లోనూ ఒక పార్టీని రెండుసార్లు వరసగా గెలిపించని 27నియోజకవర్గాల్లో 21నియోజకవర్గాలు ప్రస్తుతం బీఆరెస్ ఖాతాలోనే ఉన్నాయి. వరుసగా ఆ 27నియోజకవర్గాలలో రెండోసారి ఏ పార్టీ గెలవని రికార్డు ఈ దఫా కూడా పునరావృతమైతే బీఆరెస్ ఖాతాలోని 21సీట్లు గల్లంతవ్వక తప్పదు.
దక్షిణాదిలో ఏ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించలేదన్న రికార్డును అధిగమించాలనుకుంటున్న బీఆరెస్ పార్టీ అందుకు ముందుగా తమకున్న రెండోసారి ఏ పార్టీ గెలవని నియోజకవర్గాలలో కూడా మెజార్టీ సీట్లు గెలవక తప్పదు. అప్పుడు దక్షిణాదిలో హాట్రిక్ విజయం సాధించిన పార్టీ రికార్డుతో పాటు రెండోసారి గెలవని సిటింగ్ స్థానాల్లో వరుస విజయాన్ని అందుకున్న రికార్డు బీఆరెస్ సొంతమవుతుంది. ఇందులో ఎంతమేరకు సాధిస్తారన్నది ఈనెల 30న పోలింగ్‌లో తేలనుంది.
వరుసగా రెండోసారి ఏ పార్టీ గెలవని స్థానాలు
ఏ పార్టీయైన ఒక సారి మాత్రమే గెలిచి రెండోసారి గెలవని నియోజకవర్గాల్లో బీఆరెస్ సిటింగ్ స్థానాలు 21లో దేవరకొండ, వనపర్తి, మక్తల్, కల్వకుర్తి, నిర్మల్, ముథోల్, జగిత్యాల, డోర్నకల్, ఖమ్మం, నర్సంపేట, ఉప్పల్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సనత్‌నగర్, ముషిరాబాద్, కంటొన్మెంట్‌లు ఉన్నారు. కాంగ్రెస్ పరిధిలో కొత్తగూడెం, ములుగు, తాండూరు, టీడీపీకి చెందిన అశ్వారావుపేట, ఇండిపెండెంట్ నెగ్గిన రామగుండం, వైరాలున్నాయి.