BRS | మహబూబ్‌నగర్ జిల్లాలో.. ఆ నలుగురికి అనుమానమే

BRS | బీఆరెస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గడ్డు కాలం అధిష్టానం సర్వేలో వారిపై నెగిటివ్ నివేదికలు కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఉమ్మడి  అలజడి మొదలయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఇది వరకే నియోజకవర్గా ల్లో సీటింగ్‌ ఎమ్మెల్యే పని తీరుపై అధిష్టానం ప్రత్యేక సర్వే చేయించింది. సర్వే ఆధారంగా టికెట్ కేటాయింపు ఉంటుందని ముందుగానే అధిష్టానం ప్రకటించింది. సర్వే […]

  • Publish Date - August 15, 2023 / 12:23 PM IST

BRS |

  • బీఆరెస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గడ్డు కాలం
  • అధిష్టానం సర్వేలో వారిపై నెగిటివ్ నివేదికలు
  • కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఉమ్మడి అలజడి మొదలయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఇది వరకే నియోజకవర్గా ల్లో సీటింగ్‌ ఎమ్మెల్యే పని తీరుపై అధిష్టానం ప్రత్యేక సర్వే చేయించింది. సర్వే ఆధారంగా టికెట్ కేటాయింపు ఉంటుందని ముందుగానే అధిష్టానం ప్రకటించింది. సర్వే ప్రకారం జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గా ల్లో నాలుగింటిలో సీటింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నివేదిక వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ నియోజకవర్గాలపై జిల్లాలో ఇప్పుడి నుంచే చర్చ సాగుతోంది. ముఖ్యంగా అలంపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, కొడంగల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకం ఉన్నట్లు అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు పార్టీ మొట్టికాయలు వేసిన వారి తీరులో మార్పు రాలేదని పార్టీ వర్గాల్లో అంతర్గత ప్రచారం కొనసాగుతుంది. దీంతో వారి స్థానంలో బీఆరెస్ అధిష్టానం కొత్త అభ్యర్థుల వేటలో పడినట్లు తెలుస్తోంది. కొత్త వారికి టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గాల్లో పార్టీ నిలదొక్కుకుంటుందని అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లుగా గులాబీ కేడర్ చెబుతుంది.

అలంపూర్ (ఎస్సీ రిజర్వుడ్ )లో

ఇక్కడి బీఆరెస్ ఎమ్మెల్యే అబ్రహంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీ నిర్వహించిన సర్వేలో ఇయనపై పూర్తిగా నెగిటివ్ ఉంది. పార్టీ నాయకులే ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా మాజీ ఎంపీ మందా జగన్నాథo మరో వర్గాన్ని కూడబెట్టారు. ఎమ్మెల్యే అబ్రహం తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉండండంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.

కొన్ని సందర్భాల్లో మందా జగన్నాథం కుమారుడు, అబ్రహం కుమారుని మధ్య గొడవ జరిగి కొట్టుకునే స్థాయి కి వెళ్లారు. అబ్రహం ను తప్పించి తన కుమారునికి టికెట్ ఇప్పించాలని మందా ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా పార్టీ అధిష్టానం దృష్టిలో పడింది. అబ్రహంకు టికెట్ ఇస్తే ఇక్కడ పార్టీ మనుగడ కష్టమే అని పార్టీ అధినాయకులు భావిస్తున్నారు. ఇద్దరు నేతలను పక్కన పెట్టి అధిష్టానం కొత్త వారి కోసం వెతుకుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆయన మద్దతు ఎవరికి ఉంటే వారే ఇక్కడ గెలుపొందే అవకాశం ఉంటుందని అంచనా. ప్రస్తుతం అబ్రహంకు చల్లా మద్దతు లేదు.

ఇద్దరి మధ్య ఒకప్పుడు మంచి స్నేహం ఉండేది. చల్లా మద్దతు తో ఎమ్మెల్యే గా గెలిచిన అబ్రహం అనంతరం కొన్ని సమయాల్లో చల్లా వెంకట్రామారెడ్డి మాటను సైతం లెక్కచేయలేదు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో చల్లా మద్దతు ఉంటేనే అభ్యర్థి గెలుపు ఉంటుంది. ఎట్టి పరిస్థితి లో ఆయన అబ్రహం కు మద్దతుగా ఉండరు. నియోజకవర్గాన్ని పట్టించుకోక పోవడం, చల్లా మద్దతు లేకపోవడం వంటి పరిస్థితి చూస్తే అబ్రహం కు టికెట్ రానట్లే అని అర్థం అవుతోందని గులాబీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అచ్చంపేట ( ఎస్సీ రిజర్వ్‌)లో:

ఇక్కడి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నోటి దురుసే మైనస్ పాయింట్ అని చెప్పవచ్చంటున్నారు విశ్లేషకులు. ఎమ్మెల్యేలలో ఆయనకు వచ్చిన బూతు మాటలు ఎవ్వరికి రావన్న ప్రచారం ఉంది.ఆయన తిట్ల బారిన అధికారులే కాదు స్వయాన మంత్రులు కూడా ఉన్నారు. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్లే తిట్ల కు అలవాటు పడ్డారు. గతంలో ఓ సమావేశానికి గువ్వల బాలరాజు ఆలస్యం కావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశాన్ని ప్రారంభించారు. ఆలస్యంగా వచ్చిన గువ్వల మంత్రిపై స్టేజ్ పైనే చిందులు తొక్కారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అని చూడకుండా ఇలా తిడుతున్నాడేమిటని అక్కడి వారంతా నివ్వేరపోయారు.

ఎమ్మెల్యే తీరు అంతేనంటు నియోజకవర్గం ప్రజలలో ప్రచారం బలపడింది. నోరు తెరిస్తే చాలు తిట్ల దండకమేనన్నది సాధారణమైంది. ఎన్నో సార్లు వార్తలకు ఎక్కినా గువ్వల మాత్రం తన తిట్ల పురాణం మానలేదు. ఇది ఇలా ఉంటే దీనికి తోడు లైంగిక ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో ఓ మండలం ఎంపీపీ ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పై సోషల్ మీడియాలో ఎమ్మెల్యే తీరుపై దుమ్మెత్తి పోశారు. ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని పార్టీ అధిష్టానం ఎంత చెప్పినా పెడ చెవిన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ చేసిన సర్వేలో కూడా పూర్తి గా నెగటివ్ రావడంతో టికెట్ కష్టమే అని తెలుస్తోంది. మరో కొత్త అభ్యర్థి కోసం పార్టీ ప్రయత్నం ప్రారంభించినట్లు సమాచారం.

కల్వకుర్తిలో

ఈ నియోజకవర్గ బీఆరెస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై సొంత పార్టీ నాయకులే తీవ్ర మైన ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పనులు చేయడం లో పూర్తి నిర్లక్ష్యం వహించడం, కార్యకర్తలను విస్మరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న విమర్శలున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు బాలాజీ సింగ్, పలువురు ఎంపీపీ లు ఎమ్మెల్యే తీరును ఎండగడుతున్నారు. జైపాల్ యాదవ్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామని వారంతా ఇదివరకే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. వీరి ఆరోపణల నేపథ్యంలో జైపాల్ యాదవ్ కు టికెట్ కష్టమే అని అందరూ భావిస్తున్నారు.

కొడంగల్ లో

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థియైన ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ని ఓడించి, స్థానికేతరుడైన బీఆరెస్‌ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించి తప్పు చేశామనే భావన లో ఈ నియోజకవర్గం ప్రజలు ఉన్నారని సర్వేలలో వెల్లడైనట్లుగా ప్రచారం వినిపిస్తుంది. అభివృద్ధి ఆశించి నియోజకవర్గంను పట్టించుకోని అధికార పార్టీ ఎమ్మెల్యేను ఎన్నుకున్న ఆశించిన ప్రయోజనం దక్కలేదని ఇక్కడి ప్రజలు, పార్టీ కేడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పై పార్టీ లో వ్యతిరేకతతో పాటు అధిష్టానం దృష్టిలో కూడా అన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో పర్యటించిన దాఖాలాలు లేవు. ప్రజల సమస్య లు గాలికి వదిలేశారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బరిలో ఉండడంతో రాజకీయంగా దృష్టి అంతా ఈ నియోజకవర్గం పైనే ఉండనుంది. సీఎం కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని ఓడించాలనే కసితో ఉన్నారు. రేవంత్ రెడ్డికి పోటీగా బలమైన అభ్యర్థి కోసం బీఆరెస్ అధిష్టానం వెతుకుతుంది. రేవంత్ రెడ్డిని ఢీ కొనాలంటే ప్రస్తుత పరిస్థితిలో బీఆరెస్‌కు కష్టమే. రేవంత్ రెడ్డిని ఢీ కొనే అభ్యర్థి కోసం వేట కొన సాగించాల్సిందే. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో అటు అధిష్టానం దృష్టిలో, ఇటు నియోజకవర్గ వాసుల్లో సదాభిప్రాయం లేని ఆ నలుగురు సీటింగ్ ఎమ్మెల్యేల భవితవ్యం ఏమిటన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

Latest News