Site icon vidhaatha

Jogulamba: జోగులాంబ అమ్మవారికి.. రూ.కోటి 60ల‌క్ష‌ల‌ బంగారు కిరీటం బహూకరణ‌!

విధాత: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా అలంపూర్‌ శ్రీ జోగులాంబ అమ్మవారికి బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల బృందం బంగారు కిరీటం బహుకరించారు. రూ.1కోటి 60,10,501ల విలువైన 1.587 కిలోల బంగారు కిరీటాన్ని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అమ్మవారికి బహుకరించారు. కిరీటంపై తేలు, గుడ్లగూబ, బల్లి, కపాలంతో ఉన్న ప్రతిమలు ఉన్నాయి. ఈ బంగారు కిరీటాన్ని ఈవో పురేందర్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలకు అందించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. దాతలకు అమ్మవారి దర్శనం అనంతరం శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.

ఐదవ శక్తి పీఠం

పద్దెనిమిది (అష్టాదశ) మహా శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ శక్తి పీఠం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. దేశంలోని 18 శక్తి పీఠాలలో జోగులంబ దేవిని 5 వ శక్తి పీఠంగా పరిగణిస్తారు. దక్ష యజ్ఞంలో సతీదేవి(పార్వతీ) ఆత్మాహుతితో కోపోద్రిక్తుడైన శివుడు దక్ష యజ్ఞం విధ్వంసం చేసి దక్షుడిని అంతమొందిస్తాడు. సతీదేవిపై ప్రేమతో శివుడు ఆ దేహాన్ని భుజాన ధరించి లోకం మొత్తం తిరుగుతుంటాడు. ఇక శివుడిని మళ్లీ తన కార్యంలోకి దించేందుకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 భాగాలుగా ఖండిస్తాడు. ఖండిత శరీర భాగాలు పడిన ప్రదేశాల్లో అమ్మవారు అష్టాదశ శక్తీ పీఠాలుగా అవతరించిందని పురాణ కథనం. సతీదేవికి చెందిన పైపళ్ళు(దంతాలు), దవడ భాగం పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది. జోగులాంబ అనే పదం యోగుల తల్లి అనే అర్ధం నుంచి వచ్చిందని కథనం.

వాటి పరమార్ధం ఇదే

అలంపూర్ క్షేత్రంలో అమ్మవారు పీఠాన రూపంలో మహో తేజోవంతంగా దర్శనమిస్తారు. జోగులంబ దేవత శవంపై కూర్చుని గాల్లో తేలే కేశాలు..వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలంతో కనిపిస్తుంది. ఆమె నాలుకను చాచి నగ్న అవతారంతో ఉగ్రరూపంలో కనిపిస్తుంది. బల్లి శకునాల చిహ్నం, అందుకే అమ్మవారు శకునాలకు అధిపతి, తేలు న్యాయ ధర్మాల చిహ్నం, అందుకే అమ్మవారు న్యాయధర్మాలకు అధిపతి అని.. గుడ్లగూబ లక్ష్మీ అమ్మవారి వాహనం కాబట్టి అలక్ష్మిని తొలగిస్తుందని.. కపాలం, ప్రేతం తాంత్రికోపాసన చిహ్నాలు.. కాబట్టి అమ్మవారు తాంత్రికోపాసనకు అధిపతి అని చెబుతుంటారు. భర్త శివుడు స్మశానంలో ఉంటాడు కాబట్టి ఆ స్మశాన వికృతాలను తలమీద ధరించింది అమ్మవారు. దీనికి సంతోషించిన స్వామివారు.. ఆ వికృతాలకు ఓ స్థిరత్వాన్ని, శక్తిని ఆపాదించి వాటికి అమ్మవారిని అధిపతిని చేశాడు. అందుకే అలంపూర్‌ జోగులాంబ నరఘోషకు అధిపతిగా కొలుస్తారు. జోగులాంబను దర్శించుకుంటే వాస్తు దోషాలు, కీడు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని గృహచండిగా కూడా పిలుస్తారు.

నవ బ్రహ్మల ఆలయాలకు ప్రసిద్ధి

ఈ ఆలయంలో మొగ్గరూపంలో ఉన్న కుండలిని చెక్కబడి ఉంది. ఇలా మరెక్కడా కనిపించదు. ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే కుండలిని జాగృతమవుతుందని.. కుండలిని జాగృతమవడమంటే మోక్షానికి దగ్గరగా చేరినట్లేనని చెబుతారు. ఆలంపూర్ ఆలయం ఏడవ-ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. ఇక్కడ తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం కూడా కొలువై ఉంది. జోగులంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులంబ, బాలబ్రహ్మేశ్వరులు.

దక్షిణ కాశీ

శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివారి దివ్యక్షేత్రమైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని పిలుస్తుంటారు. ఉత్తర భారతంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూర్‌లోని బాల బ్రహ్మేశ్వరున్ని దర్శించినా అంతే మహా పుణ్యం లభిస్తుందంటారు పండితులు. కాశీ క్షేత్రంలో గంగా నది ఉంటే అలంపూర్‌లో తుంగభద్రా నది ఉంది.. అక్కడ విశ్వేశ్వర, విశాలాక్షులు ఉంటే.. ఇక్కడ బాల బ్రహ్మేశ్వర, జోగులాంబలు కొలువై ఉన్నారు. కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా-యమునల సంగమనం జరిగితే.. అలంపూర్‌లో తుంగభద్ర-కృష్ణా నదులు కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి. కాశీలో వరుణ-అసి అనే నదులు సంగమిస్తే.. అలంపూర్‌లో వేద-నాగవతి నదులు కలుస్తాయి. కాశీలో ఉన్నట్లే 64 స్నాన ఘట్టాలు, 18 తీర్థాలు, అష్టాదశ శక్తిపీఠాలు అలంపూర్‌లో కూడా ఉన్నాయి. అందుకే దీనిని దక్షిణ కాశీగా అభివర్ణిస్తుంటారు.

Exit mobile version