Site icon vidhaatha

BJP | బీజేపీ గట్టెక్కెనా!

BJP | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ (BJP) పరిస్థితి రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనుకకు అనే చందంగా తయారైంది. జిల్లాలో ఆ పార్టీని నడిపించే బలమైన నాయకత్వం లోపించింది. ఒకరిద్దరూ నేతలు మినహా పార్టీ లో చెప్పుకోదగిన నాయకులు కరువయ్యారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ (DK Aruna), మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Ex Mp Jitendra Reddy) ఇద్దరే జిల్లా బీజేపీలో బలమైన నేతలుగా ఉన్నారు. మిగతా నియోజకవర్గా ల్లో నాయకులు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీ లతో పోటీ పడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాల్లో బీజేపీకి ఒకటి రెండు మినహా మిగతా చోట్ల నామమాత్రంగానే పోటీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.

గద్వాల (Gadwal) నియోజకవర్గంలో డీకే అరుణ కు బలమైన నాయకత్వం ఉంది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కొంత మేర ఏపీ జితేందర్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ విజయం పొందాలంటే కొంచం కష్టం. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కీలకంగా ఉంటాయి. ఈ ఓట్లు బీజేపీకి వచ్చే అవకాశం తక్కువ. ఇతర నియోజకవర్గాలు పరిశీలిస్తే సీనియర్ బీజేపీ నేత ఆచారి కల్వకుర్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ దఫా మరోసారి పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు.

మొదటి నుంచి బీజేపీకి అధిక కేడర్ ఉన్న నియోజకవర్గం నారాయణ పేట (Narayanpet) . ఇక్కడ బీజేపీ కి మంచి పట్టున్న నాయకత్వం ఉంది. కానీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే వరకే పరిమితమైంది. బీజేపీ బలంగా ఉన్నా ఈ స్థానంలో విజయం ముంగిట బోల్తా పడుతుంది. షాద్ నగర్ నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీ ని నమ్ముకున్న శ్రీవర్ధన్ రెడ్డి (Sri Vardhan Reddy)కి ఇంత వరకు అదృష్టం కలిసిరాలేదు.

ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపు బాటలో ప్రయాణం సాగడం లేదు. అయినా పట్టు సడలకుండా నియోజకవర్గంలో ప్రజలతో మమేకం కావడం మరిచి పోలేదు. ఎప్పుడు ప్రజల్లో ఉండే నేతగా గుర్తింపు ఉన్నా ఎన్నికల్లో విజయాన్ని అందుకోలేకపోతున్నారు. కొల్లాపూర్ (Kolhapur)లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ నేత ఎల్లేని సుధాకర్ రావు ఇప్పటి నుంచే గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లేందు కు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడ కాంగ్రెస్, బీఆరెస్‌ (BRS) పార్టీలు బలంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థి తట్టుకునే స్థాయి లేనట్లే కనపడుతోంది. మిగతా నియోజకవర్గాలు మక్తల్‌, జడ్చర్ల, నాగర్ కర్నూల్‌, అచ్చంపేట, అలంపూర్‌, కోడంగల్‌లలో సైతం బలమైన నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు ఉంది. కొన్ని చోట్ల పోటీ చేసేందుకు నాయకులు ఆసక్తి చూపడం లేదు.

బీజేపీ అధిష్టానం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు రాబట్టాలని చూస్తున్నా ఈ జిల్లా లో మాత్రం ఒకటి రెండు మినహా గెలుపొందే స్థానాలు లేవు. దీంతో నియోజకర్గాల వారిగా గెలుపు గుర్రాల కోసం ఇతర పార్టీ వలస నేతలపైన, సామాజిక ప్రముఖులు, ఎన్నారైలపైన కమలదళం ఫోకస్ పెట్టింది.

Exit mobile version