విధాత: ఓ టీవీ జర్నలిస్టు వార్తలు చదువుతూ కాఫీ తాగడం ఆమె ఉద్యోగం పోవడానికి కారణమైంది. టర్కీ (Turkey) లో జరిగిన ఈ ఘటనకు.. ఇజ్రాయెల్-హమాస్‌ల (Israel – Hamas Conflict) మధ్య జరుగుతున్న ఘటనకు సంబంధం ఉండటం గమనార్హం. అమెరికాకు చెందిన ప్రసిద్ధ కాఫీ చైన్ ఔట్‌లెట్ స్టార్‌బక్స్ (Starbucks) కాఫీని తాగుతూ టర్కీ యాంకర్ మెల్టమ్ గన్‌వే లైవ్ లో కనిపించారు. ఈ వీడియో టర్కీలో వైరల్ అయిన వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సంబంధిత టీజీఆర్‌టీ హాబర్ టీవీ ఛానల్ ప్రకటించింది. అంతే కాకుండా ప్రోగ్రాం డైరెక్టర్‌ను కూడా వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.
ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపే స్టార్‌బక్స్ కాఫీ కప్పును లైవ్‌లో కనపడేలా పెట్టడమే దీనికి కారణమని వివరించింది. ‘టర్కిష్ ప్రజల మనోభావాలు మాకు అత్యంత ముఖ్యం. గాజా కోసం వారు ఎంత వరకైనా మద్దతిస్తారనే విషయం మాకు తెలుసు. దానికి విరుద్ధంగా మా న్యూస్ యాంకర్, ప్రోగ్రాం డైరెక్టర్ చేసిన పని సరైనది కాదు. వారి నియామకాలను రద్దు చేశాం’ అని ప్రకటనలో పేర్కొంది. ముస్లిం మెజారిటీ దేశమైన టర్కీలో హమాస్, పాలస్తీనాకు మద్దతు ఎక్కువ. ఇజ్రాయెల్‌పై ఇక్కడి ప్రజలకు ద్వేషం ఉంటుంది.
ఇజ్రాయెల్‌కు అన్నివిధాలుగా మద్దతు ప్రకటించే అమెరికా, ఆ దేశానికి చెందిన కంపెనీలనూ వీరు వ్యతిరేకిస్తున్నారు. తాజా సంక్షోభం నేపథ్యంలో స్టార్‌బక్స్ సహా వివిధ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదని బాయ్‌కాట్ ఉద్యమం కూడా టర్కీలో నడిచింది. అయితే తాము ఇజ్రాయెల్ మద్దతుదారులమన్న వాదనను స్టార్‌బక్స్ తోసిపుచ్చుతోంది. ఇలాంటి ఆందోళన చేసేవారు తప్పుడు సమాచారం వల్ల ప్రభావితమవుతున్నారని ఇటీవల అభిప్రాయపడింది.
గతంలో ఇజ్రాయెల్ పక్షమే అయినప్పటికీ
ఒకప్పుడు పూర్తి లౌకికవాద దేశంగా ఉండే టర్కీ.. ఇజ్రాయెల్ పక్షానే నిలబడేది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు తయ్యప్ ఎర్దోగన్ అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి మత ప్రాతిపదికన పాలస్తీనా వైపు మొగ్గు చూపి ఇజ్రాయెల్‌ను ద్వేషించడం మొదలుపెట్టింది. ఎర్దోగన్ ఏకంగా ఇజ్రాయెల్ ప్రధానిని గాజా కసాయి అని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇజ్రాయెల్‌ను ఉగ్రవాద దేశంగా పిలిచే ఆయన..ప్రస్తుత సంక్షోభంలో అమాయక పాలస్తీనియన్లను చంపడం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.