Site icon vidhaatha

Telangana | గుండె నొప్పి భ‌రించ‌లేక‌ ఒక‌రు.. చెడు వ్య‌స‌నాల‌కు బానిసై మ‌రొక‌రు.. ఇద్ద‌రు ఇంజినీరింగ్ విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌

Telangana |

ఓ ఇద్ద‌రు విద్యార్థులు ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. మంచి ఉద్యోగం సంపాదించి త‌ల్లిదండ్రుల‌కు ఆస‌రాగా ఉండాల్సిన స‌మ‌యంలో.. ఆ ఇద్ద‌రు విద్యార్థులు వేర్వేరుగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఒక‌రేమో గుండెనొప్పి భ‌రించ‌లేక త‌నువు చాలిస్తే.. మ‌రొక‌రేమో చెడు వ్య‌స‌నాల‌కు బానిసై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న‌లు వికారాబాద్, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల్లో వెలుగు చూశాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా శంకర్‌ప‌ల్లి ప‌రిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన క‌డ‌మంచి విద్యాసాగ‌ర్, ల‌లిత దంప‌తుల రెండో కుమారుడు హ‌రికృష్ణ‌(21) దుండిగ‌ల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చ‌దువుతున్నాడు. హ‌రికృష్ణ గ‌త కొంత‌కాలం నుంచి గుండె సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు మెడిసిన్స్ వాడుతున్నాడు.

ఆదివారం కూడా అత‌నికి గుండెలో నొప్పి రావంతో.. ఒక్క‌డే వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. ఇక త‌ల్లిదండ్రుల‌కు భారం కాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న హ‌రికృష్ణ త‌న పొలంలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. మిస్ యూ డాడ్.. మిస్ యూ మ‌మ్మీ అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు హ‌రికృష్ణ‌. కుమారుడి మృత‌దేహాన్ని చూసి త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదించారు.

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా బీబీన‌గ‌ర్ మండ‌లం నెమ‌ర‌గోముల‌కు చెందిన ఆంజ‌నేయులు, క‌ళ్యాణి దంప‌తుల కుమారుడు సాయికుమార్(22) ఘ‌ట్‌కేస‌ర్ స‌మీపంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చ‌దువుతున్నాడు. చెడు వ్య‌స‌నాల‌కు బానిసై అప్పులు చేశాడు. ఈ విష‌యం ఇంట్లో చెప్ప‌లేక ఆదివారం అర్ధ‌రాత్రి బీబీన‌గ‌ర్ వ‌ద్ద రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు సాయికుమార్.

Exit mobile version