విధాత: రైతాంగ సమస్యల పరిష్కారానికి రానున్న కాలంలో ఉద్యమాలు ఉధృతంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈనెల 27న తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ప్రదర్శన బహిరంగ సభకు ఆశించిన దాని కంటే ఎక్కువ మంది రైతులు హాజరైనట్లు తెలిపారు. 28, 29న జరిగిన ప్రతినిధుల మహాసభలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న 27 ముఖ్యమైన సమస్యలపైన సమగ్రంగా చర్చించి తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, పంట బీమా, నకిలీ కల్తీ విత్తనాలు అరికట్టుట, పంట బీమా పథకాన్ని అమలు చేయాలని, అలాగే రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందజేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతు బీమా, రైతు బంధు వర్తింపజేయాలని, ఇంకా పోడు భూముల సమస్యలు పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 లక్షల రైతులకు హక్కు దారు పాసుపుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేయాలని తీర్మానం చేసినట్టు తెలిపారు.
నల్లగొండ జిల్లాలో పండ్ల తోటల రైతులు అధికంగా ఉన్నందున వారు పండించిన పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు పంటల బీమా పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని, రాష్ట్రంలో భూ సమగ్ర సర్వే నిర్వహించాలని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లను కేటాయించాలని, సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలని, రాష్ట్రంలో ధరణి అవకతవకలను పరిష్కరించాలని, రాష్ట్ర మహాసభల్లో తీర్మానించినట్లు తెలిపారు.
తీర్మానాలతో పాటు రాష్ట్ర మహాసభలో సమగ్రమైన చర్చ జరిగినట్లు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం మహాసభలు జిల్లా కేంద్రంలో ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, సహాయ కార్యదర్శి కున్ రెడ్డి నాగిరెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల తదితరులు పాల్గొన్నారు.