Ujjain Mahankali Bonal
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లో బోనాల జోష్ నెలకొంది. ఇవ్వాల ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఉజ్జయిని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.
మహంకాళి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. భారీ ర్యాలీతో తరలివచ్చిన కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కు చెల్లించుకున్నారు.
కాగా, ఇవ్వాల, రేపు రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు, ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. బోనాలు, ఓడి బియ్యం సమర్పణతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Honoured to be a part of the vibrant Bonalu festival in Secunderabad today #BonaluFestival #TelanganaPride pic.twitter.com/DxxChxkRhI
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 9, 2023
పోతరాజుల నృత్యాలు, శివసత్తులు,జోగినీల నృత్యాలతో సికింద్రాబాద్‌లో సందడి నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్లాట్ కేటాయించారు. భక్తులు భద్రత కోసం ఆలయంలో 20 సీసీ కెమెరాలు ఉండగా, జాతర సందర్బంగా మరో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
బోనాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయానికి వచ్చే భక్తుల వెహికిల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్వచ్చే మార్గంలో సైతం ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు..