- ఆధునిక ప్రపంచంలో ఇజ్రాయెల్ నేడే అతిపెద్ద మానవమరణ హోమం కోసం ఒడిగట్టబోయేది.
హమాస్ అణచివేత పేరిట ఇజ్రాయెల్ సైనిక రాజ్యం ఓ మూడు లక్షల అత్యాధునిక సైన్యాన్ని, మరో యాబై వేలమంది పారా మిలిటరీ శక్తుల్ని గాజా సిటీ పైకి తరలించే సన్నాహం చేస్తోన్నది. 24 గంటల్లో ఖాళీ చేయాలని గాజా సిటీ ప్రజలకు నిన్న అల్టిమేటం జారీ చేసింది. ఆ గడువు ముగిస్తోంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ ఇక గాజాపై భూతల యుద్ధం ప్రారంభించే అవకాశం ఉంది. ఇదెంత క్రౌర్యంతో ముగుస్తుందో అంచనా కోసం ఓ ప్రయత్నమిది.
గాజా స్ట్రిప్ విస్తీర్ణం 365 చదరపు కిలో మీటర్లు. జనాభా 23 లక్షల మంది! ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆరుబయలు జైలు! పైగా అత్యధిక జన సాంద్రత గల ప్రాంతం! అందుకొక కారణం ఉంది.
పాలస్తీనా ప్రాంతాల్ని ఇజ్రాయిల్ దురాక్రమిస్తూ పోతుంటే, నిర్వాసితులైన బాధిత ప్రజలను గాజా అక్కున చేర్చుకుంటోంది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల నిర్వాసిత ప్రజల నివాసం కోసం బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాలలో కొత్తగా కాలనీలను ప్రభుత్వాలు నిర్మించడం తెల్సిందే! ఆ కారణంగా అక్కడ కూడా జన సాంద్రత పెరగడం సహజమే. ఇవి విశాల ప్రాంతాలు. జనసాద్రత స్వల్పంగా పెరుగుతుంది. గాజా స్థితి అది కాదు.
అక్తమ నిర్మాణాల పేరిట మున్సిపల్ యంత్రాంగం హఠాత్తుగా బుడోజర్లతో ఇళ్లు తొలగించిన వివిధ సందర్భాలు తెల్సిందే. రోడ్డున పడే బాధితుల్ని సమీప బంధువులు కొద్ది రోజులు తమ ఇళ్లల్లో కాస్త వసతి కల్పించడానికి సైతం ఇష్టపడని పరిస్థితి మనకు అనుభవమే. గాజా ప్రజలు 75 ఏళ్లుగా; అంటే మూడు తరాలుగా పాలస్తీనియన్లని ఏ ఊరు, ఏ పట్నంలో ఇజ్రాయెల్ నిర్వాసితుల్ని చేసినా, కట్టుబట్టలతో వచ్చే వారికి గాజా నిండు మనస్సుతో స్వాగతం పలికింది. వారు తమకి ఉన్నదాంట్లో చోటు ఇచ్చారు. నీడ ఇచ్చారు. ముద్ద పెట్టి ప్రాణాలు నిలిపారు. ముఖ్యంగా హృదయం ఇచ్చారు. చేతల్లో మానవత్వాన్ని నిరూపించారు. అట్టి మనసున్న మనుషుల ఆదర్శ మానవీయ నేల పైకి ఇజ్రాయెల్ అమానుష యుద్ధానికి సిద్ధమౌతోంది. అమెరికా, యూరప్ లతో పాటు మోడీ కార్పోరేట్ భారత్ కూడా ఇజ్రాయెల్ కి అండగా నిలిచాయి.
గాజా స్ట్రిప్ వేరు. గాజా సిటీ వేరు. గాజా స్ట్రిప్ కి రాజధాని గాజా సిటీ. ఇది సింగపూర్ దేశం మరియు సింగపూర్ సిటీ జంట పేర్ల వంటిది. గాజా స్ట్రిప్ జనాభా 23 లక్షలు! గాజా నగర జనాభా 11 లక్షలు! గాజా జనాభాలో సగం మందిది గాజా సిటీ! ఇజ్రాయెల్ నేడు భూతల యుద్ధానికి దిగబోయేది గాజా స్ట్రిప్ మీద కాదు. గాజా సిటీ మీద!
గాజా భౌగోళిక స్థితిని మన ప్రాంతాల స్థితితో పోల్చి చెబితే తేలిగ్గా అర్ధమౌతుంది. యుద్ధ ఫలితాల్ని అంచనా వేయడానికి మన ప్రాంత భౌగోళిక అన్వయింపు ద్వారా ప్రయత్నం చేద్దాం.
ఈ గాజా చార (స్ట్రిప్) పొడవు 41 కిలొ మీటర్లు. సుమారు విజయవాడ నుండి గుంటూరు వరకు! వీటి మధ్య హైవేకి కుడి, ఎడమ పక్కల్లో ఐదారు కిలో మీటర్ల చొప్పున నేల పాలస్తీనియన్లది. హైవే పొడవునా ఐదారు కిలో మీటర్లకి అవతల నేల పాలస్తీనియన్లది కాదు. ఆ సన్నటి చారకు తూర్పు, పడమరలలో ఓ వైపు సముద్రం, మరోవైపు ఇజ్రాయెల్ ఉంటుంది. అటు గుంటూరు సిటీ ఇటు విజయవాడ సిటీ పాలస్తీనియన్లది కాదు. విజయవాడ ఇజ్రాయెల్ లో భాగమే. గుంటూరు ఈజిప్ట్ లో భాగం.
గుంటూరులోకి ప్రవేశ స్థలం ఆటోనగర్! రఫా సరిహద్దు పాయింట్ అక్కడుందని ఊహిద్దాం. రఫా బోర్డర్ ద్వారా తప్ప విదేశాలతో గాజాకు లింక్ లేదు. అమెరికా వత్తిడితో రఫా సరిహద్దు పాయింట్ ని సాధారణంగా ఈజిప్ట్ మూసివుంచడం షరా మామూలే! ఒకవేళ ఏ సందర్భంగా తెరిచినా నఖశిఖ పర్యంతం తనిఖీ ద్వారానే! గత శనివారం నుండి అమెరికా వత్తిడి మేరకు ఈజిప్టు రఫా సరిహద్దుని పూర్తిగా మూసేసింది.
(నేనిచ్చిన విజయవాడ, గుంటూరు ఉదాహరణ వలెనే AP తెలంగాణ రాష్ట్రాల్లో 40 కిలోమీటర్ల దూరం గల ఏ రెండు పట్టణాలనైనా ఊహించి అంచనా వేసుకోవచ్చు)
గాజా జనాభా క్రిష్ణా నది ఒడ్డున ఉండవల్లి నుండి గుంటూరు ఎంట్రీ ఆటో నగర్ వరకే పరిమితం. అదే గాజా జాగా! వాటి మధ్య హైవేకు అటూ ఇటూ సన్నటి ప్రాంతం గాజా ప్రజలది. ఆ చార వెడల్పు కొన్నిచోట్ల ఐదారు కిలో మీటర్లే!
మంగళగిరిని గాజా సిటీ అనుకుందాం. కృష్ణానది పై వారధి దాటాక గాజా ప్రారంభం అవుతుందని ఊహిద్దాం. ఇజ్రాయెల్ అల్టిమేటం ప్రకారం మంగళగిరి జనాభా 24 గంటల్లో కట్టుబట్టలతో ఖాళీచేసి వెళ్లిపోవాలి. ఉత్తరానికి తాడేపల్లి, ఉండవల్లి వైపు కాదు. దక్షిణాన పెద్దకాకాని, నంబూరు వైపు మాత్రమే వెళ్ళాలి. విజయవాడ నుండి బయలుదేరే మూడున్నర లక్షల సైన్యం మంగళగిరిని ముట్టడి చేస్తుంది. కాల్చివేత, పేల్చివేత, కూల్చివేత చర్యలతో ధ్వంసిస్తుంది. అది అటు నుండి వెనక్కి తిరిగి వస్తుందా? లేదా హమాస్ ప్రధాన నేతలు మంగళగిరిలో దొరకలేదనే సాకుతో పెద్దకాకని వైపు దండయాత్రకు వెళ్తుందా?
ఇజ్రాయెల్ అల్టిమేటం వల్ల ఒకవేళ మంగళగిరి జనం కట్టుబట్టలతో నేడు పెద్దకాకాని, నాగార్జున యూనివర్సిటీ, నంబూరు వైపు వెళ్తే, రేపు భద్రత ఉందా? సందేహమే.
కొసమెరుపు ఏమిటంటే, ‘ఇది మన మాతృభూమి, ఇక్కడే ఉండి సైతాన్ రాజ్యంతో యుద్ధం చేస్తూ అమరత్వం పొందుదాం’ అనే పిలుపును హమాస్ సంస్థ గాజా ప్రజలకు నిన్న సాయంత్రం ఇచ్చింది.
ఇది మానసిక యుద్ధం మాత్రమేనా? నిజంగానే భౌతికంగా యుద్దాన్ని చేస్తుందా? వెస్ట్ బ్యాంక్, జెరూసలేం అరబ్బుల పైకి భూతల యుద్ధానికి వెళ్లిన నేపథ్యం ఇజ్రాయెల్ కి ఉంది. గాజా పై ఇజ్రాయెల్ వెనకడుగు వేసేది. అలా వెళ్తే ఇల్లిల్లూ ఓ మందు పాతర్లుగా స్వాగతం పలికే సాహసిక చరిత్ర గాజాది. ఆ భయం వీడి ఇజ్రాయెల్ నిజంగానే సాహసిస్తుందా?
గాజా జాగా అతి చిన్నది. విజయవాడ జనాభాతో దాదాపు సమానమైన గాజా నగర జనాభా విజయవాడ కంటే ఇరుకైన వీధులతో కూడింది. దానిపైకి మూడున్నర లక్షల సేన వెళ్తే పరిస్థితి ఏమిటి? 11 లక్షల మంది జనాభా పైకి మూడున్నర లక్షల సేన! నలుగురికి ఓ సైనికుడు! జనసాంద్రత రీత్యా గాజా సగటు కుటుంబ సభ్యుల సంఖ్య ఏడెనిమిది మంది. ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు సైనికులనమాట! ఇది ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద మానవ మారణ హోమానికి దారితీసేది.
ఇజ్రాయెల్ ఆల్టిమేటానికి నిరసనగా, నిన్నటి నుంచి గాజాకు సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు వెల్లువెత్తడం తెల్సిందే. టెహ్రాన్, సానా, బాగ్దాద్, అమ్మాన్, కైరో, బీరూట్, డమాస్కస్, ట్యునీస్, ఇస్లామాబాద్, జకార్తా, కౌలాలంపూర్ వంటి నగరాలతో సహా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ఇరాక్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికా దురాక్రమించిన ఓ శిథిల రాజ్యం. ఆ దేశ రాజధాని బాగ్దాద్ తెహ్రిర్ గ్రౌండ్ లో నిన్న ‘మిలియన్ మెన్ మార్చ్’ ప్రదర్శన జయప్రదంగా జరగడం ఒక ప్రత్యేక విశేషం!
ఇండియా ఒకవైపు కార్పోరేట్ భారత్ గా, మరోవైపు ప్రజాతంత్ర భారత్ గా నగ్నంగా విడిపోతోంది. మోడీ సర్కారు నేతృత్వంలో కార్పోరేట్ భారత్ ఇజ్రాయెల్ కి అండగా నిలిచింది. ప్రజాతంత్ర భారత్ పాలస్తీనా పట్ల సంఘీభావంగా తన పాత్ర పోషించాల్సి ఉంది.
మనం మౌనం వీడుదాం. మనసున్న మనుషుల నేల పైకి ఆధిపత్య రాజ్యాల అండతో నేడు అణ్వస్త్ర సైనిక రాజ్యం అమానుష యుద్దాన్ని చేయబోతోంది. దానిని మనం గొంతెత్తి ఖండిద్దాం. పాలస్తీనియన్ ప్రజలకి, ముఖ్యంగా గాజా ప్రజలకి సంఘీభావంగా మన వాణిని వినిపిద్దాం.
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
14-10-2023