ఉద్యోగం దొరక్కపోవడం నిరుద్యోగుల లోపమా? పాలకుల శాప‌మా?

వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలో గొప్పలు చెప్పుకొన్నా.. యువతకు ఇది స్వర్ణయుగమని ప్రకటించినా

  • Publish Date - February 4, 2024 / 03:23 PM IST

  • కొలువులో రామచంద్రా!
  • స్వర్ణ యుగమంటున్న ఆర్థిక మంత్రి
  • ఉద్యోగాల కోసం అల్లాడుతున్న యువత
  • లక్షల్లో జాబులు.. కోట్లలో దరఖాస్తులు
  • తగ్గిపోయిన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు
  • ట్యాక్సీలు, బైక్‌ ట్యాక్సీలు, ఫుడ్‌ డెలివరీలు..
  • వేరే ప్రత్యామ్నాయాల్లో నిరుద్యోగులు
  • రికార్డుస్థాయిలో అమెరికా వీసాల జారీ
  • పదేళ్లలో భారీగా పెరిగిన నిరుద్యోగిత రేటు
  • ప్రైవేటీకరణ, కంపెనీల మూత కారణంగా
  • పీఎస్‌యూల్లో తగ్గుతున్న ఉద్యోగాలు
  • తాజాగా జాబ్‌ మార్కెట్‌లోకి వస్తున్న
  • 15 లక్షల ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌

విధాత ప్రత్యేకం: వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలో గొప్పలు చెప్పుకొన్నా.. యువతకు ఇది స్వర్ణయుగమని ప్రకటించినా.. వాస్తవాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగమే ముందు భాగాన ఉన్నది. విచిత్రమేంటంటే.. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి కట్టిన రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇచ్చినంత ప్రాధాన్యంలో ఒక వంతు కూడా ఈ అత్యంత కీలకమైన అంశానికి మీడియా ఇవ్వకపోవడం! కొన్ని అంశాలు గమనిస్తే ఒక్కోదానికి మధ్య ఉన్న లింకు అర్థమవుతుంది. దేశంలో చాలా పెద్ద సంస్థలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం లేదు. సబ్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలోనూ తీసుకోవడం లేదు. తొలగించడమూ లేదు. అంటే ఆయా కంపెనీల్లో స్తబ్దత ఉన్నది. మరోవైపు ప్రఖ్యాత విద్యాసంస్థలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ నిలిపివేశాయి. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు రెండు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయాయని తాజాగా వార్తలు వచ్చాయి. ఓ మోస్తరు మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ కాలేజీలే కాదు.. ఐఐఎంలు సైతం తమ విద్యార్థులందరికీ ప్లేస్‌మెంట్లు ఇప్పించలేకపోతున్నాయి. గత పదేళ్లలో సాధారణ ఉద్యోగాల మార్కెట్‌ గణనీయంగా కుదించుకుపోయింది. ఫలితంగా కోట్ల మంది ఎలాంటి ఉద్యోగ భద్రత, రక్షణ, హక్కులు లేని ఇన్‌ఫార్మల్‌ లేదా అసంఘటితరంగ, కాంట్రాక్టు ఉద్యోగాలకు, చిన్నచిన్న పనులకు, వ్యవసాయరంగానికి తరలిపోతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే.. ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, యాప్‌ బేస్డ్‌ బైక్‌ ట్యాక్సీ, ట్యాక్సీ వంటి రంగాల్లో ఉన్నత విద్యావంతులు కూడా కనిపిస్తుంటారు. నిజానికి ఇప్పుడు ఈ రంగాలు అధిక రద్దీతో ఉన్నాయి. మరోవైపు.. గత ఏడాదినే ఉదాహరణగా తీసుకుంటే రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు జారీ చేసింది. ఇందులో ఎంప్లాయిమెంట్‌ వీసాలు కూడా గతం కంటే అధికంగా ఉండటం గమనార్హం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. వాస్తవ స్థితి సులభంగానే అర్థమవుతుంది. భారతదేశాన్ని నిరుద్యోగం పట్టి పీడిస్తున్నది.


ప్రగతిభారతం.. అనే మాటలు ప్రమాదకరం!

బీజేపీ ప్రభుత్వం చెబుతున్న లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ.. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ.. యువతకు స్వర్ణయుగం వంటి డైలాగులు అసంబద్ధమైనవేకాదు.. అవి ఉద్యోగార్థులకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. తమకు ఉద్యోగం రావడం లేదంటే అది వ్యవస్థలో తప్పిదమని కాకుండా.. తమలో లోపమని పొరపాటుపడే అవకాశం ఉన్నదని, అది అవాంఛనీయ పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా అత్యధికంగా ప్లేస్‌మెంట్స్‌ పొందినవాటిలో కీలకమైనది ఐటీ రంగం. 245 బిలియన్‌ డాలర్ల ఈ ఐటీ పరిశ్రమ.. గత ఏడాది నియామకాలను గమనిస్తే.. రెండు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సర్వీసులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గడం మన దేశ ఐటీ ఇంజినీర్లకు అదనపు సవాలుగా పరిణమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఐటీ పరిశ్రమ 70వేల నుంచి 80వేల మధ్య కొత్త నియామకాలతో సరిపెడుతుందని తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం ఫలితంగా నియామకాలు పడిపోతున్నాయి. దీంతో ఇప్పుడు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కోర్సు ముగించుకోనున్న వారి పరిస్థితి ఏంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేసవి ముగిసే నాటికి 15 లక్షల మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ ఉద్యోగాల వేటకు దిగుతారని అంచనా. అయితే.. వారిలో పదోవంతుకంటే తక్కువ మందికే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉన్నదని నియామక కంపెనీలు చెబుతున్నాయి. ప్రఖ్యాత కంపెనీలైన ఇన్ఫోసిస్‌, విప్రో వంటివి వరుసగా రెండో ఏడాది కూడా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లను చేప్టటే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నాయి. దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కూడా ఫ్రెషర్స్‌ నియామకాలు గణనీయంగా తగ్గించనున్నట్టు ప్రకటించింది.


పదేళ్లలో రెట్టిపైన నిరుద్యోగిత రేటు

గడిచిన పదేళ్లలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది. అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. 2013లో 5.42 శాతం ఉంటే.. అది 2023 అక్టోబర్‌ నాటికి 10.05 శాతానికి పెరిగింది. నవంబర్‌లో 8.9 శాతానికి తగ్గింది. డిసెంబర్‌లో 8.7శాతంగా ఉన్నది. అంతకు ముందు ఏడాది అంటే 2022లో 7.33 శాతంగా ఉన్నదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) నివేదికను ఉటంకిస్తూ బ్లూంబెర్గ్‌ పేర్కొంటున్నది. 2020లో ఎనిమిది శాతం ఉండగా.. 2021 నాటికి 5.98 శాతానికి తగ్గింది. అయితే.. ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్నదని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్నదని ప్రభుత్వం చెబుతున్నది. మరి అంత అభివృద్ధి ఉంటే.. నిరుద్యోగిత రేటు ఈ స్థాయిలో ఎందుకున్నది? అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. నిరుద్యోగిత రేటు అనేది 8%-9% మధ్య ఉండటం కొత్త ట్రెండ్‌గా కనిపిస్తున్నదని సీఎంఐఈ పేర్కొంటున్నది. మరోవైపు గ్రామీణ నిరుద్యోగిత 6.2 శాతం నుంచి 10.82 శాతానికి పెరగడం గమనార్హం. ఇండియా ఎకానమీ ఆరు శాతం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. మరోవైపు జనాభాలోనూ ఇప్పుడు ఇండియానే నెంబర్‌ 1. గత ఏప్రిల్‌లో చైనా జనాభాను భారత్‌ దాటేసింది. ఇంత జనాభా పెరుగుతున్నా, ఉపాధి అవకాశాలు మాత్రం ఆ మేరకు పెరగడం లేదని సీఎంఐఈ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మహేశ్‌ వ్యాస్‌ ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఒక్క అక్టోబర్‌ నెలలోనే కొత్తగా కోటి మంది భారతీయులు ఉద్యోగ వేటకు దిగారని బ్లూంబెర్గ్‌ పేర్కొంటున్నది. సెంటర్‌ పర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో 15 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య భారతీయుల్లో 36 శాతం మంది ఈ దేశ అతి ప్రధాన సమస్య నిరుద్యోగమేనని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, అంతకు మించిన విద్యార్హలు ఉన్నవారిలో 40 శాతం మంది నిరుద్యోగమే ప్రధాన సమస్య అని చెబుతున్నారు.


పీఎస్‌యూల్లో పడిపోయిన ఉద్యోగాలు

2013 మార్చి నుంచి 2213 మార్చి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 17.3 లక్షల నుంచి 14.6 లక్షలకు పడిపోయిందని పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సర్వే నివేదిక పేర్కొంటున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రానికి 50 శాతం వాటా ఉంటుంది. అక్కడ రిజర్వేషన్లు కూడా ఉంటాయి. కానీ.. పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ, కంపెనీల మూసివేతతో ఉద్యోగాల సంఖ్య పడిపోతున్నది. అదే సమయంలో కొత్త ధోరణి కూడా కనిపించింది. ఉన్న ఉద్యోగాల్లో 42.5 శాతానికిపైగా కాంట్రాక్టు, క్యాజువల్‌ వర్కర్ల కింద తీసుకుంటున్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా గడిచిన ఎనిమిదేళ్లలో 7.22 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపింది. అదే సమయంలో మరో కీలక విషయం కూడా వెల్లడించింది. ఆ ఉద్యోగాలకు 22 కోట్ల దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. రైల్వేల్లో 3.15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడి ఉన్నాయి. పై వివరాలన్నీ గమనిస్తే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో నిరుద్యోగం అనే మాట లేకుండా పోయింది. ఉపాధి కల్పిస్తామన్నారే కానీ అందుకు తగిన వ్యయ ప్రణాళికలు లేదా మార్గాలను ఆమె చెప్పనేలేదు. కానీ.. డైనమిక్‌ నేత మోదీ నాయకత్వంలో సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ నినాదంతో దూసుకెళిపోతున్నామని చెప్పుకొన్నారు. మరి ఎటు దూసుకెళ్తున్నామో!!

Latest News