Site icon vidhaatha

Pirated Content | పైరేటెడ్‌ వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా.. చట్టానికి సవరణ..!

Pirated Content |

పైరేటెడ్‌ కంటెంట్‌ను ప్రసారం చేసే వెబ్‌సైట్లపై కొరడా ఝుళిపించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆయా వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని భావిస్తుందని కేంద్ర సమాచార, ప్రసారాల కార్యదర్శి అపూర్వ చంద్ర గురువారం తెలిపారు. పైరసీకి అడ్డుకట్ట వేసే విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

ఇప్పటికే కంటెంట్‌ను ఫిల్మింగ్‌ చేయడాన్ని నేరంగా పరిగణించాలని కేంద్రం ప్రతిపాదించిందని, అలాంటి పైరేటెడ్‌ కంటెంట్‌ను ప్రసారం చేసినా నేరంగా పరిగణించే మరో నిబంధనను జోడించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్పులను సినిమాటోగ్రాఫ్‌ చట్టంలో ప్రతిపాదించనున్నట్లు చెప్పారు.

సవరణ ముసాయిదాను త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టి, చట్టం చేస్తామని మంత్రి తెలిపారు. ఓటీటీ సంస్థలు కంటెంట్‌ను సృష్టించే విషయంలో దేశ సంప్రదాయాలకు భంగం కలగకుండా చూసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదనుకుంటే జాగ్రత్తగా ఉండాలన్నారు.

99 శాతానికిపైగా కంటెంట్ నిబంధనల్లో మార్పు అవసరం లేదని, అయితే కొన్నిసార్లు కొంత కంటెంట్‌ను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం, ఓటీటీ (ఓవర్ ది టాప్)ల ప్లాట్‌ఫారమ్‌ల కోసం స్వీయ నియంత్రణపై నిర్మించిన మూడు అంచెల వ్యవస్థ ఉందని, ఇది మెరుగ్గా పని చేస్తుందన్నారు. ఈ విషయంలో కేవలం మూడు నాలుగు ఫిర్యాదులే అందాయన్నారు.

Exit mobile version